thesakshi.com : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం జగన్ తొలి అధికారిక విదేశీ పర్యటన ఇదే. సీఎం అయిన తరువాత లండన్..అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన గానే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు ఏపీకి పెట్టుబడల ఆకర్షించేందుకు దావోస్ కు సీఎం వెళ్లనున్నారు.దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.
సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తిగా సంక్షేమం పేరుతో..పథకాల అమలు పైనే ఎక్కువగా ఫోకస్ చేసిన సీఎం రాష్ట్రంలో పెట్టుబడులు..పరిశ్రమల విషయంలో అడుగు ముందుకు వేయలేదంటూ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్క పెట్టుబడి ఏపీకి రాలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ ఏటా దావోస్ లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ కు హాజరయ్యేవారు. అదే విధంగా తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సైతం తరచూ అక్కడ జరిగే సమిట్ లకు హాజరవుతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో గ్రాసిం పరిశ్రమను సీఎం ప్రారంభించారు.
ఇదే సమంయలో రాష్ట్రంలో పది వేల మందికి ఉపాధి..ఉద్యోగాలకు అవకాశం కలుగుతుందని ప్రముఖ పారిశ్రమిక వేత్త ఆదిత్య బిర్లా ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పుకొచ్చారు. ఆయన గ్రాసిం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత తాడేపల్లిలో సీఎం తో భేటీ అయ్యారు. సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఏపీ పరిశ్రమల మంత్రి అమర్ నాధ్ తో సహా అధికారుల టీం వెళ్లనుంది. ఈ మీట్ లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించటంతో పాటుగా కొన్ని సంస్థలలో ఎంఓయూలు చేసుకొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఏపీలో పెట్టుబడులకు జరిగే ఒప్పందాలు..సీఎం జగన్ కు కీలకంగా మారనున్నాయి.