thesakshi.com : విదేశీ పర్యటనకు సీఎం జగన్య బయలుదేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కు హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం జగన్ నేరుగా జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఈ రాత్రికి 8.30 గంటలకు దావోస్ చేరుకుంటారు. 10 రోజుల పాటు సీఎం ఫారిన్ టూర్ లోనే ఉండనున్నారు. ఈనెల 31వ తేదీన సీఎం తిరిగి ఏపీకి చేరుకునే అవకాశముంది. సీఎం జగన్ వెంట ఆర్ధిక qమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ , ఎంపీ పీవీ మిథున్ రెడ్డి ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఆర్ధిక, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26వరకు స్విట్డర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23న తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. “ప్రజలు , పురోగతి , అవకాశాలు” అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు దావోస్ పర్యనకు వెళ్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవలే సీఎం జగన్ దావోస్ వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. దీంతో జగన్ టూర్ కు లైన్ క్లియర్ అయింది. సీఎం అయన మూడేళ్ల తర్వాత తొలిసారి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎలాంటి సంస్థలను తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు.. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు.
కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సీఎం బృందం వివరించనుంది.