thesakshi.com : అనుకున్నది అనుకున్న దాని కంటే బాగా జరుగుతున్నప్పుడు.. కష్టం అనుకున్న పరిణామాలు సైతం కలిసి వచ్చేలా పరిస్థితులు ఉంటే ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఉంటామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందులోకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి శక్తివంతమైన నేత.. అసాధ్యాల్ని సుసాధ్యాలుగా చేస్తున్న వేళలో ఆయనలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయికి చేరుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.తాజాగా సీఎం జగన్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు.
ఉన్నట్లుండి.. ఎవరో పిలిచినట్లుగా ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లటం.. ఆయన వెళ్లిందే ఆలస్యమన్నట్లు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వటం.. గంటకు పైనే మాట్లాడి.. ఆ తర్వాత అమిత్ షాతో భేటీ అయి.. తాడేపల్లికి తిరిగి రావటమే కాదు.. తర్వాతి రోజునే చరిత్రలో చాలా అరుదుగా ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సభ్యులందరిని పిలిచి.. భోజనాలు పెట్టి మరీ వారి నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. రాజీనామా పత్రాలు అందజేసిన తర్వాత కూడా ఎవరూ ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయకుండా జగన్ మీద తమకున్న విశ్వాసాన్ని ప్రకటనల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయటం తెలిసిందే.
కొత్త కేబినెట్ కొలువు తీరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రతి ఇంటికి మేనమామ మాదిరి పిల్లలందరిని చదివించే బాధ్యత తనదన్న ఆయన.. తనను వ్యతిరేకించే విపక్షాలకు.. వ్యతిరేక వర్గాలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చేశారు. ప్రజలందరి దీవెనతో వెళుతున్న తనను ఎవరు ఏం చేయలేరన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు” అంటూ సంచలన వ్యాఖ్య చేశారు.
పిల్లలకు ఇచ్చే చిక్కీపై ముఖ్యమంత్రి ఫోటో ఉండటాన్నితప్పు పడుతున్న విపక్షాలపై విరుచుకుపడ్డారు. వారి చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబుదేనంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో తాను తరచూ ప్రస్తావించే ఎల్లో మీడియాపైనా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తనను ఎవరూ కదలించలేరు.. బెదిరించలేరన్న ఆయన.. ”దేవుడి దయ.. ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థాయికి వచ్చా. వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో అనేక విధాలుగా రచ్చ చేస్తున్న నేతలు.. ఢిల్లీలో ఏపీ పరువును దిగజారుస్తున్నారు” అంటూ ఆందోళనను వ్యక్తంచేశారు.
తాము చేపట్టిన చర్యలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారినట్లుగా చెప్పారు. ఇప్పుడు పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేలు రికమెండేషన్లు చేయాల్సి వస్తోందన్నారు. డ్రాపవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిందన్న ఆయన.. తమ హయాంలో సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామన్నారు. మొత్తంగా తానెంత జోష్ లో ఉన్నానన్న విషయాన్ని తన మాటలతో సీఎం జగన్ స్పష్టం చేశారని చెప్పక తప్పదు.