thesakshi.com : పెగాసస్ స్పై వేర్‌ను ఉపయోగించి భారత పౌరులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందా? లేదా అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది.
సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిస్ రంగాల్లో ప్రఖ్యాతి చెందిన నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు.
ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఆర్‌వీ రవీంద్రన్ నాయకత్వం వహిస్తారని అన్నారు. ఆయనకు మాజీ ఐపీఎస్ అధికారి అలోక్ జోషి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ సబ్ కమిటీ చైర్మన్, డాక్టర్ సందీప్ ఒబెరాయ్ ఆయనకు సహకారం అందిస్తారు.
సాంకేతిక కమిటీలో గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్, ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ కుమార్ చౌదరీ.. అమ్రిత విశ్వ విద్యాపీఠం (స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కేరళ) ప్రొఫెసర్ డాక్టర్ పి. ప్రభాహరణ్, బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ చైర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే సభ్యులుగా ఉన్నారు.
తీర్పు ఉత్తర్వుల్లో ఈ కమిటీ విధివిధానాలు వివరంగా ఉన్నాయని రమణ తెలిపారు.
”జాతీయ భద్రత అని కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన సుప్రీంకోర్టు చూస్తూ కూర్చోదు. జాతీయ భద్రతా కారణాల రీత్యా వివరాలు వెల్లడించలేం అన్న వాదనను కేంద్ర ప్రభుత్వం రుజువు చేసుకోవాలి”
”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పౌరుల హక్కులను కాలరాస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే దర్యాప్తు కమిటీ ఏర్పాటును వాటికి అప్పగించలేదు. న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఈ అంశంలో అవి పక్షపాతంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. న్యాయం జరిగిందని చెప్పడం మాత్రమే కాదు న్యాయం జరిగేలా చూడటం మా కర్తవ్యం”
”పరస్పర ప్రయోజనాలను ఆశించే ఈ ప్రపంచంలో… సమర్థులైన, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా వ్యహరించే నిపుణులను ఎంపిక చేయడం అత్యంత సవాలుతో కూడిన పని.”
”నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ప్రతీ ఒక్కరూ ప్రైవసీని కోరుకుంటారు. ఇది కేవలం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు సంబంధించిన అంశం కాదు. భారతదేశంలోని ప్రతీ పౌరునికి ప్రైవసీ ఉల్లంఘన నుంచి రక్షణ కల్పించాలి. ప్రతీ పౌరుని స్వేచ్ఛ, ఎంపికలు ఈ అంశంపై ఆధారపడి ఉంటాయి.”
”ఇతర ప్రాథమిక హక్కుల తరహాలోనే, గోప్యతా హక్కు విషయంలోనూ కొన్ని పరిమితులు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. అయితే ఈ పరిమితులు రాజ్యాంగ పరిశీలనకు లోబడి ఉండాలి.”
”సమాచార విప్లవ యుగంలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ వ్యక్తుల జీవితాలన్నీ క్లౌడ్‌లలో లేదా డిజిటర్ డాసియర్‌లలో నిక్షిప్తమై ఉంటాయి.”
”ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత అనేది ఒక టూల్‌గా ఉపయోగపడుతున్నప్పుడు, వారి వ్యక్తిగత గోప్యతను హరించడానికి కూడా దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తారనే అంశాన్ని అందరూ గుర్తించాలి”
”ఈ అంశంపై త్వరితగతిన విచారణ జరపాలని కమిటీని అభ్యర్థిస్తున్నాం” అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇజ్రాయెల్ దేశానికి చెందిన నిఘా సంస్థ ‘ఎన్‌ఎస్‌వో’ గ్రూపు అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి భారత్‌లోని అనేక మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్‌లపై నిఘా పెట్టారు.
50,000 నంబర్ల డేటా బేస్ లీకవడంపై ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, ద వైర్, ఫ్రంట్‌లైన్, రేడియో ఫ్రాన్స్ వంటి 16 మీడియా సంస్థల జర్నలిస్టులు పరిశోధనలు చేశారు.
ఈ అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వివిధ దేశాల ప్రభుత్వాలకు మాత్రమే తమ సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తామని ఎన్‌ఎస్‌వో కంపెనీ స్పష్టం చేసింది. ఉగ్రవాదులను, నేరస్థులను ట్రాక్ చేయడం కోసమే ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని ఆ కంపెనీ వెల్లడించింది.