thesakshi.com : అక్టోబర్ 14న ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన చైనా, భూటాన్ విదేశాంగ మంత్రులు రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచీ నడుస్తున్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేలా ఒక త్రీ-స్టెప్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
డోక్లాం ట్రై-జంక్షన్ దగ్గర భారత్, చైనా సైన్యం మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఈ ఒప్పందం జరిగింది.
భూటాన్ తమదిగా చెబుతున్న ఈ ప్రాంతంలో చైనా ఒక రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయడంతో డోక్లాంలో ప్రతిష్టంభన మొదలైంది.
చైనా-బూటాన్ ఎంఓయూపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు.
“ఈరోజు భూటాన్, చైనా మధ్య అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేయడాన్ని మేం నోట్ చేశాం. భూటాన్, చైనా 1984 నుంచీ సరిహద్దు చర్చలు జరుపుతున్నాయని మీకు తెలుసు. భారత్ కూడా అదే విధంగా సరిహద్దు చర్చలు జరుపుతోంది” అన్నారు.
“త్రీ-స్టెప్ లేదా మూడు దశల రోడ్‌మ్యాప్ మీద జరిగిన ఈ ఎంఓయూ సరిహద్దు చర్చలకు ఒక కొత్త వేగం అందిస్తుంది అని భూటాన్ విదేశాంగ శాఖ చెప్పింది.
చైనాతో భూటాన్ 400 కిలోమీటర్లకు పైగా పొడవున్న సరిహద్దును పంచుకుంటోంది. రెండు దేశాల ఉన్న వివాదాలు పరిష్కరించడానికి 1984 నుంచి ఇప్పటివరకూ 24 సార్లు సరిహద్దు చర్చలు జరిగాయి.
ఈ ఒప్పందం గురించి భారత్ వివరంగా స్పందించకపోయి ఉండచ్చు. కానీ, చైనాతో గత ఏడాదిన్నరగా ఉద్రిక్తలు కొనసాగుతుండడంతో ఈ ఘటనను విస్మరించే స్థితిలో అయితే లేదు.
చైనా, భూటాన్ మధ్య రెండు ప్రాంతాల గురించే ఎక్కువ గొడవ జరుగుతోంది. వాటిలో ఒకటి భారత్-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ దగ్గరున్న 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఇంకొకటి భూటాన్‌కు ఉత్తరంగా ఉన్న 495 చదరపు కిలోమీటర్ల జకార్‌లుంగ్, పాసమ్‌లుంజ్ లోయల ప్రాంతం.
భూటాన్‌కు 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇచ్చేస్తామన్న చైనా దానికి బదులు 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమకివ్వాలని కోరుతోంది.
తన ఆర్థిక, సైనిక ఆధిపత్యంతో ప్రభావితం చేయాలని, తనకు లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకునేలా తనకంటే బలహీన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పరుచుకోడానికి చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుందని ఎస్‌బీ అస్థానా అన్నారు.
ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌బీ అస్థానా వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు.
“భూటాన్ ఉత్తర సరిహద్దులో చైనా తమవిగా చెబుతున్న ప్రాంతాల్లో చుంబీ లోయ ఒకటి. దానికి సమీపంలో ఉన్న డోక్లాంలో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన ఉంది. చుంబీ లోయ ప్రాంతం కావాలని చైనా భూటాన్‌ను అడుగుతోంది. బదులుగా వారికి మరో వివాదిత ప్రాంతం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంది. అది చుంబీ లోయ కంటే చాలా పెద్దది. చైనా అడుగుతున్న ఆ ప్రాంతం భారత సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది” అని ఆయన చెప్పారు.
సిలిగురి కారిడార్‌ను ‘చికెన్స్ నెక్’ అని కూడా అంటారు. ఇది భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఈశాన్య రాష్ట్రాల్లోకి చేరుకోడానికి ఇది భారత్‌కు ప్రధాన మార్గం.
చైనా సిలిగురి కారిడార్‌కు దగ్గరగా వస్తే అది భారత్‌కు అత్యంత ఆందోళన కలిగించే విషయం అవుతుంది. ఎందుకంటే అది ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని ప్రమాదంగా పడేయవచ్చు.
“చికెన్స్ నెక్ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు చాలా ముఖ్యం. ఈ ప్రాంతంలో చైనాకు కాస్త ప్రయోజనం కలిగినా దానివల్ల భారత్‌కు నష్టం తీవ్రంగా ఉంటుంది. చైనా, భూటాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ ఒప్పందం భారత్‌కు ప్రయోజనం కలిగించదు” అంటారు మేజర్ జనరల్ అస్థానా.
డాక్టర్ అల్కా ఆచార్య జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తూర్పు ఆసియా అధ్యయన కేంద్రంలో ప్రొఫెసర్. “చైనా-భూటాన్ ఎంఓయూ భారత్‌కు ఆందోళనలు పెంచవచ్చు” అని ఆమె అంటున్నారు.
“డోక్లాం వివాదం తర్వాత.. భూటాన్‌ను సంప్రదించి, సరిహద్దు గురించి చర్చించాలని చైనా ఒక ఆపరేషన్ ప్రారంభించింది. అది దీనిపై చాలా చొరవ తీసుకుంటున్నట్లు కనిపించింది. చైనా ఇప్పుడు భూటాన్‌తో నేరుగా ఏదైనా ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దానివల్ల భారత్‌కు సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే, చైనా అన్నిటితోనూ ఒప్పందాలు చేసుకుంటోంది, భారత్ మాత్రమే ఎందుకు మిగిలిపోయింది అని అందరూ అంటారు. దానివల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది” అన్నారు.
“డోక్లాం దగ్గర మూడు దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతంలోని ట్రై-జంక్షన్ మీద ఎలాంటి ఒప్పందం జరుగుతుంది” అనేది భారత్‌కు అత్యంత ఆందోళన కలిగించే అంశం అవుతుంది” అంటారు ప్రొఫేసర్ ఆచార్య.
ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి కాస్త సున్నితంగానే ఉందని అనిపిస్తోందని, భారత్ దీనిపై చాలా నిశితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆమె చెబుతున్నారు.
చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో తాజా అవగాహనా ఒప్పందం భూటాన్‌ను గందరగోళంలో పడేసిందా?
భారత్, భూటాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయనేది సుస్పష్టం. భూటాన్ మొగ్గు భారత్ వైపే ఎక్కువగా ఉంటుంది అంటారు ప్రొఫెసర్ ఆచార్య.
“భారత విదేశాంగ శాఖ నుంచి ఒక భారీ మొత్తం భూటాన్‌కు వెళ్తుంది. ఆర్థికంగా భూటాన్‌కు భారత్ చాలా సాయం అందిస్తోంది. భూటాన్‌లో చైనా ఎక్కువ జోక్యం ఉండకుండా చూడ్డానికే భారత్ ప్రయత్నిస్తుంది. మరోవైపు, భారత్ భూటాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకుంటోందని చైనా కూడా విమర్శిస్తోంది. అది ఎన్నోసార్లు అలాంటి ఆరోపణలు చేసింది” అన్నారు.
కానీ, భూటాన్ చిన్న లాండ్ లాక్డ్ దేశం కాబట్టి, చైనాతో అసలు సంబంధాలే లేకుండా ఉండాలని అది కోరుకోదు అంటారు ప్రొఫెసర్ ఆచార్య.
“చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరించుకోవాలని భూటాన్ కోరుకుంటుంది. ఆ తర్వాత అది చైనాతో ఒక ఆర్థిక బంధం కూడా ఏర్పరచుకోవచ్చు. అంటే, వాటిని ఒక విధంగా ఒక స్వతంత్ర దేశం అభివృద్ధి ఆలోచనలుగా కూడా చూడచ్చు. భారత్, చైనా మధ్య భూటాన్ ఒక విధంగా ఇరుక్కుపోయుంది. భారత్, చైనాలో ఒకరికి మిత్రుడుగా, ఒకరికి శత్రువుగా చూసే పరిస్థితిలో తాము పడకూడదని అది బలంగా కోరుకుంటుంది” అన్నారు.
“భూటాన్ జీడీపీకి బదులు ‘గ్రాస్ నేషనల్ హాపీనెస్ ఇండెక్స్’ గురించి మాట్లాడుతుంది. అది దేశాల మధ్య ఉన్న పవర్ పాలిటిక్స్‌లో తను ఎలాంటి జోక్యం చేసుకోకూడదని అనుకుంటుంది” అంటారు ఆచార్య.
“భారత్ భూటాన్ పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సుంటుంది. చైనా భూటాన్‌తో ఈ చొరవ తీసుకుంటుంటే… చైనాతో తమ చర్చలు ఏ దిశగా వెళ్తున్నాయో దానికి తెలిసేలా భూటాన్‌తో భారత్ నిరంతరం చర్చలు జరుపుతూనే ఉండాలి” అని ఆమె చెప్పారు.
మరోవైపు, చైనాది ఒత్తిడి పెంచే వ్యూహంగా చెబుతున్నారు మేజర్ జనరల్ అస్థానా.
“యుద్ధం లేకుండానే గెలవాలి అనేది చైనా వ్యూహం. అది యుద్ధం కోరుకోవడం లేదు, అందుకే దాని వ్యూహాల్లో ఒత్తిడి, ప్రచారం, బెదిరింపులు, పొరుగు దేశాలను ప్రలోభపెట్టడం లాంటివి ఉంటాయి” అన్నారు.
“భారత తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన గురించి చర్చలు ఆపేయాలని, రెండు దేశాల మధ్య గతంలోలాగే వాణిజ్య కార్యకలాపాలు కొనసాగాలి అనేది చైనా అంతిమ లక్ష్యం. లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితిని అలాగే కొనసాగాలని చైనా భావిస్తోంది. కానీ భారత్ దానికి తలవంచడం లేదు. అందుకే చైనా మిగతా ప్రాంతాల్లో ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తోంది” అని అస్థానా చెప్పారు.
భారత్ అప్రమత్తంగా లేకపోతే, చైనా రైల్వే లైన్ త్వరలో చుంబీ లోయ వరకూ వచ్చేస్తుంది అంటారు అస్థానా.
“చైనా దగ్గర ఇప్పటికే యాతుంగ్ వరకూ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఉంది. యాతుంగ్ చుంబీ లోయ మొదట్లో ఉంది. అందుకే భారత్ జాగ్రత్తగా లేకపోతే, చైనా-భూటాన్ మధ్య ఒప్పందం విజయవంతం అయితే, చుంబీ లోయలో మన ప్రభావం ఏమీ ఉండదు” అన్నారు.
ఆ ప్రాంతంలో భారత సైనికుల మొహరింపు అత్యంత బలంగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ మన సైన్యం ఎత్తులో ఉంది. అందుకే చైనా సిలిగురి కారిడార్‌లోకి ప్రవేశించలేకపోవచ్చు. కానీ, అది ట్రై జంక్షన్ ప్రాంతంలోకి చేరుకోవడం వల్ల వారికి వ్యూహాత్మక ప్రయోజనం అందించవచ్చు” అంటున్నారు అస్థానా.