thesakshi.com : మఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ కోసం ఒంగోలులో చోటు చేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్త సంచలనంగా మారింది. దీని పైన ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఒంగోలులో పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ కోసం ఆగారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వచ్చి ఆ వాహనంతో పాటుగా డ్రైవర్ ను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
తాము తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదంటూ శ్రీనివాస్ వాపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అని చెబుతూ..ఆ వాహనం తో పాటుగా డ్రైవర్ ను తీసుకొని వెళ్లారనే ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.
దీని పైన మీడియాలో కధనాలు రావటంతో సీఎంఓ దీని పైన ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందింది. ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక, ఈ వ్యవహారం పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కారు స్వాధీనం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్ లో వాహనాలు లేక తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి ఇన్నోవా కారు లాక్కున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎంవో స్ధానిక ఆర్టీఏ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అయినా దీనిపై రాజకీయ దుమారం ఆగడం లేదు. ఒంగోలు ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసారు.
ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని పవన్ కోరారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన లాంటివి ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ట్రావెల్ ఆపరేటర్ల నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడం గురించి విన్నామే తప్ప ప్రయాణంలో ఉన్నామని చెబుతున్నా పట్టించుకోకుండా వాహనం తీసుకొనే పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు.
బుధవారం రాత్రి ఒంగోలు నగరంలో శ్రీ వేమల శ్రీనివాస్ గారి కుటుంబం తిరుమల వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు బలవంతంగా వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసింది పవన్ తెలిపారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణీకులను నడిరోడ్డున దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందని పవన్ ప్రశ్నించారు. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి, రూ.7.77లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏమిటంటూ పవన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్ లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా… అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలన్నారు. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే సందేహాలు నెలకొంటున్నాయన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగునపెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఆరోపించారు. ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణీకులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడితో కూడిన పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలన్నారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా ఉన్నతాధికారులు తీసుకువచ్చారా అనేది ముఖ్యమన్నారు. పాలన వ్యవస్థలో భాగమైన ఆ ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో, ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడి కావాలని పవన్ కోరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఏటా ముఖ్యమంత్రి భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాహన శ్రేణిలో ఉండే వాహనాలు ఎన్ని? ముఖ్యమంత్రి పర్యటనలకు ప్రైవేట్ వాహనాలు ఎందుకు స్వాధీనం చేసుకొంటున్నారు? ప్రైవేట్ వాహనాల్లో ఎవరు పర్యటనలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒంగోలు ఘటనపై శాఖపరమైన విచారణ చేయాలన్నారు.
ఏపీ ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే ఘటన. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళుతున్న కుటుంబానికి ఒంగోలులో తీవ్ర ఇబ్బందులు. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్ కోసం బలవంతంగా కారు, డ్రైవర్‌ను ఆర్టీఏ విభాగం హోంగార్డు తీసుకెళ్లాడు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే… ఉన్నతాధికారుల ఆదేశాలని సమాధానం. ఈ విషయమై మీడియాలో దుమారం చెలరేగడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే…
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో ఇన్నోవా కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమలకు బయల్దేరారు. ఆకలిగా ఉండడంతో ఒంగోలు పాత మార్కెట్ సెంటర్‌కు బుధవారం రాత్రి 10 గంటలకు వెళ్లారు. అక్కడ కారు నిలిపి టిఫెన్ చేస్తున్నారు.
ఈ సమయంలో అక్కడికి రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ విభాగానికి చెందిన హోంగార్డు తిరుపతిరెడ్డి వెళ్లాడు. కారుపై కన్ను పడింది. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్ కోసం కారు కావాలని అడిగాడు. తాము తిరుమలకు వెళుతున్నామని, ప్రజల వాహనాన్ని తీసుకోవాలని అనుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయినా అతను వినిపించుకోలేదు. కారు, డ్రైవర్‌ను పంపాల్సిందేనని పట్టుబట్టాడు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్… మీకు సారీ చెప్పడం తప్ప తామేమీ చేయలేమని డ్రైవర్‌తో సహా తీసుకెళ్లాడు.
దీంతో ఆ రాత్రివేళ ఆ కుటుంబం నడిరోడ్డున నిలవాల్సి వచ్చింది. ఆ సమయంలో మరో వాహనం తీసుకెళ్లాలని అనుకున్నా, కొత్త ప్రాంతం కావడం, సమీపంలో లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో శ్రీనివాస్ కుటుంబం నడిరోడ్డుపై నిలిచింది. చివరికి వినుకొండ నుంచి మరో వాహనాన్ని అర్ధరాత్రి ఒంటి గంటకు తెప్పించుకుని తిరుమలకు వెళ్లారు. ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సంధ్య, హోంగార్డు పి.తిరుపతిరెడ్డి అని గుర్తించారు. వెంటనే వాళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్టీఏ అధికారుల అత్యుత్సాహం చివరికి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. ఇదంతా జగన్ అరాచక పాలనకు నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం గమనార్హం.