thesakshi.com : పిల్లలకూ కరోనా వ్యాక్సీన్ వచ్చేస్తే బాగుటుందని, వాళ్లని హాయిగా బడికి పంపించవచ్చని అనుకునేవాళ్లల్లో మీరూ ఉన్నారా?అయితే, మీకోసమే ఈ శుభవార్త..
2 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కోవాగ్జిన్ టీకా వేయడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
కోవాగ్జిన్ తయారుచేసే భారత్ బయోటెక్ సంస్థ, పిల్లలపై చేసిన ట్రయిల్ ఫలితాలను కమిటీకి సమర్పించింది. వాటిపై కమిటీ సానుకూలంగా స్పందించిందని ఆ సంస్థ తెలిపింది.
ఇక, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదించడమే తరువాయి.. పిల్లలకూ టీకాలు అందించవచ్చు.
పిల్లల కోసం కోవాగ్జిన్ కంటే ముందు జైడస్ కాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్-డి టీకా ఆమోదం పొందింది.
ఈ అక్టోబర్‌లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
దీంతో, భారతదేశంలో పిల్లల కోసం కోవిడ్ వ్యాక్సీన్ల నిరీక్షణ ముగిసినట్టేనని పలువురు భావిస్తున్నారు.
అయితే, ఇది నిజమేనా? మరో నెల రోజుల్లో దేశంలోని పిల్లలందరికీ టీకా అందుబాటులో ఉంటుందా?
త్వరలో భారతదేశంలో 97 కోట్ల వ్యాక్సీన్ డోసులు ఇవ్వడం పూర్తవుతుందని, అయితే, అందులో కోవాగ్జిన్ వాటా కేవలం 11 కోట్లు మాత్రమేనని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి, కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ సభ్యురాలు డాక్టర్ సునీలా గార్గ్ తెలిపారు.
అంటే గత పది నెలల్లో 11 కోట్ల కోవాగ్జిన్ డోసులను మాత్రమే అందించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పెద్దలకు ఇచ్చే కోవాగ్జిన్ టీకానే పిల్లలకూ ఇవ్వనున్నారు.
పిల్లలపై టీకా ప్రభావాన్ని పరిశీలించేందుకు ట్రయిల్స్ మాత్రం విడిగా చేశారు.
కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం, దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలు 42 నుంచి 44 కోట్ల మంది ఉన్నారు.
ప్రతి ఒక్కరికీ రెండేసి డోసుల వ్యాక్సీన్ ఇవ్వాలంటే మొత్తం 84 నుంది 88 కోట్ల డోసులు అందుబాటులో ఉండాలి.
ఈ ఏడాది చివరికల్లా జైకోవ్-డి టీకా 5 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని అంచనా.
ఇది కాకుండా, డీజీసీఐ ఆమోదం కోసం మరో రెండు వ్యాక్సీన్లు వేచి చూస్తున్నాయి.
దీన్ని బట్టి, పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించక ముందే, వాటి లభ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నది స్పష్టమవుతోంది.
పెద్దల మాదిరి పిల్లలకు కూడా దశలవారీగా టీకాలు ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
“కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే మధుమేహం, గుండె, మూత్రపిండాల సమస్యలు ఉంటాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో అలాంటి పిల్లలు ఆరేడు కోట్ల మంది ఉంటారు. పూర్తి ఆరోగ్యవంతులైన పిల్లల కన్నా వీరిలో ఇంఫెక్షన్ రేటు మూడు నుంచి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. పెద్దలతో పాటే కో-మార్బిడీస్ ఉన్న పిల్లలకూ టీకాలు అందించడం ప్రారంభించాలి” అని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా (ఎన్‌టీఏజీఐ) హెడ్ డాక్టర్ ఎన్‌కే అరోరా అభిప్రాయపడ్డారు.
పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎక్స్‌పర్ట్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చిందని సమాచారం.
ఉదాహరణకు, టీకాలు వేయడం ప్రారంభించిన తరువాత, మొదటి రెండు నెలల్లో ప్రతి 15 రోజులకూ డాటాను కమిటీకి పంపాల్సి ఉంటుంది.
ట్రయిల్స్ కొనసాగిస్తూనే ఉండాలి. అలాగే, ఒక రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను కంపెనీ సిద్ధం చేయాలి.
ఈ కారణాలుగా, అసలు పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్లు వేయాలా వద్దా అనే అంశంపై భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది.
“కరోనా వ్యాప్తి నివారణకు పెద్దలకు వ్యాక్సీన్లు వేయడం తప్పనిసరి. తరువాత కో-మార్బిడీస్ ఉన్న పిల్లల వంతు” అని డాక్టర్ సునీలా గార్గ్ అన్నారు.
అనేక చోట్ల నిర్వహించిన సెరో సర్వేలో పిల్లల్లో 60 శాతానికి యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది. అంటే వారికి కరోనా సోకడమే కాక, దాని నుంచి తేరుకున్నారు కూడా.
ఇందుకు కారణం, పెద్దలతో పోలిస్తే
పిల్లల్లో ఏసీఈ రిసెప్టర్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇప్పటివరకూ భారత్ బయోటెక్ దేశవ్యాప్తంగా 500 మంది పిల్లలపై వ్యాక్సీన్ ట్రయిల్స్ చేసింది.
ఇది చాలా చిన్న స్థాయిలో జరిగిన ట్రయిల్ అని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
“పిల్లల్లో టీకా సామార్థ్యం, దుష్ప్రభావాల గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో తక్కువ దుష్ప్రభావాలు ఉన్నట్లు ట్రయిల్స్‌లో తేలిందని అంటున్నారు. అందుకే, మనకు మరింత డాటా అవసరం. ముఖ్యంగా 2 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఎక్కువ డాటాను పరిశీలించాలి” అని సునీలా గార్గ్ అన్నారు.
ప్రపంచంలోని ఇతర దేశాలలో ప్రస్తుతం 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, దీని గురించి కూడా ఎక్కువ డాటా అందుబాటులో లేదు.
భారతదేశంలో పిల్లలకు ఎప్పుడు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనలేవీ రాలేదు.
అయితే, ఈ నిర్ణయం డీజీసీఐ చేతిలో ఉన్నదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, కొంత సమయం పడుతుందని ఆమె అన్నారు.
వచ్చే ఏడాది త్రైమాసికంలో ఆరోగ్యవంతులైన పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కావొచ్చని డాక్టర్ ఎన్‌కే అరోరా అంచనా వేస్తున్నారు.
సునీలా గార్గ్ మాత్రం 2022 చివరివరకూ ఆరోగ్యవంతులైన పిల్లలకు వ్యాక్సీన్ అందకపోవచ్చని అంచనా వేస్తున్నారు.