THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం.. కీలకంగా మంత్రుల నేపథ్యం

thesakshiadmin by thesakshiadmin
April 12, 2022
in Latest, Politics, Slider
0
కేబినెట్ కూర్పులో సీఎం జగన్ మార్క్..మంత్రులకు శాఖలు కేటాయింపు
0
SHARES
299
VIEWS
Share on FacebookShare on Twitter

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో కేబినెట్ కొలువుదీరింది. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ ప్రకారం తొలి కేబినెట్ మంత్రులకు రెండున్నరేళ్ల పదవీకాలం కల్పించారు. అనంతరం కేబినెట్ ప్రక్షాళన ద్వారా సగం మందికి పైగా మంత్రుల్ని తప్పించి కొత్తగా 15 మందికి అవకాశం కల్పించారు.

అలాగే 10 మంది పాత మంత్రుల్ని కొనసాగించారు. అయితే ఇందులో కొత్తగా చోటు దక్కించుకున్న వారితో పాటు పాత మంత్రుల నేపథ్యం చాలా కీలకంగా ఉంది. అందుకే ఈ ఎన్నికల కేబినెట్ లో వారికి చోటు కల్పించినట్లు అర్ధమవుతోంది.

కొత్త మంత్రుల నేపథ్యం..
ఏపీ కేబినెట్లో ప్రస్తుతం అత్యంత సీనియర్లుగా ఉన్నవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అత్యంత సీనియర్లు. వీరికి జగన్ తొలికేబినెట్లోనే అవకాశమిచ్చారు. ఇప్పుడు మరోసారి కొనసాగించారు. వీరిలో పెద్దిరెడ్డి 1974లో ఎస్వీ యూనివర్శిటీ విద్యార్ధి నేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడుసార్లు జనతా, కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. చివరికి 1989 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అలాగే వైఎస్, రోశయ్య, జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.

ఇదే కోవలో మరో సీనియర్ బొత్స సత్యనారాయణ 1978లో విద్యార్ధి నేతగా కెరీర్ ప్రారంభించారు. 1999లో తొలిసారి బొబ్బిలి ఎంపీగా గెలిచారు. 2004,2009లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఏపీ విభజనలో 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. గతంలోనూ వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసారు.

మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు 1983లో సర్పంచ్ గా కెరీర్ ప్రారంభించి 1989 నాటికి ఎమ్మెల్యేగా గెలిచారు. 1991లోనే తొలిసారి మంత్రి అయ్యారు. వరుసగా గెలుస్తూ వైఎస్, రోశయ్య, కిరణ్ హయాంలో కీలకమంత్రి పదవులు చేపట్టిన ఆయనకు 2014లో తొలిసారి ఓటమి ఎదురైంది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019లో గెలిచి జగన్ కేబినెట్ లో తొలిసారి మంత్రి అయ్యారు.

జగన్ తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి మరోసారి మంత్రులయ్యారు. వీరిలో బుగ్గన 1995లో సర్పంచ్ గా కెరీర్ ప్రారంభించినా.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తిరిగి వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో, ఆ తర్వాత జగన్ హయాంలో వైసీపీలో చేరారు. 2014లో తొలిసారి డోన్ ఎమ్మెల్యే అయిన బుగ్గన.. 2019లో మరోసారి గెలిచి ఆర్ధికమంత్రిగా చక్రం తిప్పుతున్నారు.

ఇదే కోవలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్.. ఐఆర్ఏఎస్ అధికారిగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ 2009లో వైఎస్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నాటికి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.2019లో మరోసారి గెలిచి జగన్ కేబినెట్ లో రెండుసార్లు మంత్రి అయ్యారు.

ఇదే కోవలో మరో ఎస్సీ మంత్రి నారాయణస్వామి.. 1983లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం సర్పంచ్ గా రాజకీయాల్లోకి ప్రవేశించి 2004 నాటికి సత్యవేడు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ఓడినా తిరిగి 2014 నాటికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు.

జగన్ తొలి కేబినెట్లో మంత్రి పదవులు పొందిన వారిలో గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు ఉన్నారు. వీరిలో జయరాం 2005లో టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచి కెరీర్ ప్రారంభించారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి ఆలూరు నుంచి 2014, 2019లో ఎమ్మెల్యే అయిన జయరాం.. జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు.

ఇక చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తొలిసారి ఎమ్మెల్యే అయినా తూగో జిల్లా జడ్పీ ఛైర్మన్ గా , జడ్పీటీసీగా పనిచేసిన చరిత్ర ఉంది. 2019లో రామచంద్రాపురం నుంచి గెలిచిన ఆయనకు జగన్ రెండోసారి మంత్రి అవకాశం కల్పించారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు 2019లో పలాసలో తొలిసారి వైసీపీ తరఫున గెలిచి జగన్ కేబినెట్ లో సామాజిక సమీకరణాలతో మంత్రి అయ్యారు. మరోసారి ఆయనకు అవకాశం దక్కింది.

జగన్ తొలి కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన అంజాద్ బాషా, విశ్వరూప్ కు ఇప్పుడు మరోసారి అవకాశం దక్కింది. వీరిలో అంజాద్ బాషా జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి కడప కార్పోరేటర్ అయిన అంజాద్ బాషా.. 2014లో తొలిసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మరోసారి గెలిచిన ఆయనకు జగన్ కేబినెట్లో రెండుసార్లు మంత్రిగా అవకాశం దక్కింది.

అలాగే తూగో జిల్లా అమలాపురానికి చెందిన విశ్వరూప్ కు 1987లోనే కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఓటములు పలకరించినా 2004లో వైఎస్ హయాంలో విశ్వరూప్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్, రోశయ్య, కిరణ్ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 19 ఎన్నికల్లో గెలిచి జగన్ కేబినెట్లో రెండుసార్లు మంత్రి అయ్యారు.

ఇదే కోవలో తానేటి వనిత తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చి తొలుత టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఆమెకు జగన్ రెండు కేబినెట్లలోనూ చోటు దక్కింది.

కొత్త మంత్రుల విషయానికొస్తే తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు 2004లో ద్వారకాతిరుమల జడ్పీటీసీగా కెరీర్ ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీలో చేరి దెందులూరులో ఓడినా తిరిగి 2019లో తణుకు నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి జోగి రమేష్.. 2009లో తొలిసారి పెడన నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

2014లో వైసీపీ నుంచి మైలవరంలో ఓడినా తిరిగి 2019లో అక్కడే గెలిచి తొలిసారి జగన్ కేబినెట్ మంత్రి అయ్యారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ 2007లో తొలిసారి విశాఖ కార్పోరేటర్ గా గెలిచారు. 2014లో వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి అంబటి రాంబాబు 1988లో కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ గా కెరీర్ ప్రారంభించి 1989లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా నామినేటెడ్ పదవులు దక్కాయి. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరినా 2014లోనూ గెలవలేదు. చివరికి 2019లో గెలిచి ఇప్పుడు జగన్ కేబినెట్ లో తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి ఉషశ్రీ చరణ్ కర్నాటకలో పుట్టిన అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్ధిరపడ్డారు. 2013లో టీడీపీతో రాజకీయం ప్రారంభించినా 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి విడదల రజనీ కూడా 2019లోనే తొలిసారి ఎమ్మెల్యే అయి సామాజిక సమీకరణాల్లో జగన్ కేబినెట్ మంత్రి అయ్యారు. మరో మంత్రి ఆర్కే రోజా.. 1999లో టీడీపీలో కెరీర్ ప్రారంభించారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి వైసీపీలో గెలుస్తున్నారు. 2019లో గెలిచి విధేయతతో జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు.

జగన్ కేబినెట్లో తొలిసారి చోటు దక్కించుకున్న ఇతర మంత్రుల్లో మేరుగ నాగార్జున.. 2009లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో ఓడినా 2019లో తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు జగన్ కేబినెట్ లో తొలిసారి మంత్రి అయ్యారు. అలాగే మరో మంత్రి బూడి ముత్యాలనాయుడు 1991లో కాంగ్రెస్ నుంచి కెరీర్ ప్రారంభించినా.. 2014 లోనే తొలిసారి వైసీపీ తరఫున మాడుగుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ తిరిగి గెలిచి జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు.

ఇదే కోవలో కొట్టు సత్యనారాయణ 1994లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఓడినా 2004లో తిరిగి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడినా 2019లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి పీడిక రాజన్నదొర 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2019లో వరుసగా గెలిచి ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు.

మరో మంత్రి దాడిశెట్టి రాజా 2008లో తొలిసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. 2010లో వైసీపీలో చేరారు. 2014, 2019లో గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జడ్పీటీసీగా తొలిసారి ఎన్నికై కెరీర్ ప్రారంభించారు. 2014, 2019లో వైసీపీ నుంచి గెలిచి జగన్ కేబినెట్లో స్ధానం దక్కించుకున్నారు.

Tags: #Andhrapradesh#apnews#APstategovernment#cabinetexpansion2022#cabinetministers#YSJaganMohan Reddy#YSRCP
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info