thesakshi.com : దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దెల్కర్ ముంబై మెరైన్ డ్రైవ్ లోని ఓ హోటల్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హోటల్ రూమ్ లో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ గుజరాతీలో రాసి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ఎంపీ మోహన్ ఆత్మహత్య చేసుకన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ.. పోలీసులు ఇంకా ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇక ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 58 ఏళ్ల మోహన్కు భార్య కలాబెన్ ఇద్దరు పిల్లలు అభినవ్ దివిత ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో దాద్రా నగర్ హవేలి లోక్ సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. గతంలో కూడా పలుమార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న మోహన్.. 2019 వరకు దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
1989లో 9వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో రెండవసారి. ఆ తరువాత 1996లో మూడవసారి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక గతేడాది దాద్రానగర్ హవేలీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయన జేడీయూతో జత కట్టారు