thesakshi.com : హైదరాబాద్ నగర శివారులోని రంగారెడ్డి-యాదాద్రి జిల్లాల సరిహద్దుల్లో ఓ జంట దారుణ హత్యకు గురయ్యారు. యాదాద్రిభువనగిరి జిల్లా కొత్తగూడెం వంతెన వద్ద కుళ్లిన స్థితిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ మహిళ, యువకుడిదిగా గుర్తించారు. మృతులు సికింద్రాబాద్ చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. వారాసిగూడకు చెందిన యశ్వంత్ గత ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద చెట్ల మధ్య నగ్నంగా ఉన్న రెండు మృదేహాలున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు పరిశీలించారు.
ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలు పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను గుర్తించారు. అక్కడే లభించిన బైక్, బ్యాగులో ఉన్న ఆధారాలతో వీరిద్దరిని వారాసిగూడకు చెందినవారుగా గుర్తించారు. కాగా, మృతులను యశ్వంత్, జ్యోతిగా గుర్తించామని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జ్యోతి వివాహిత అని, వీరిద్దరివి హత్యలుగానే ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు. లభించిన ఆధారాలతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని డీసీపీ తెలిపారు.
కాగా, డ్రైవర్‌గా యశ్వంత్, వివాహిత జ్యోతిలను ఎవరో హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే, యశ్వంత్ మర్మాంగాన్ని, జ్యోతి ముఖాన్ని హంతకులు ఛిద్రం చేయడాన్ని బట్టి చూస్తే పలు అనుమానాలు కలుగున్నాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందా? అనే విషయం తేలాల్సి ఉందన్నారు. జ్యోతికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.