thesakshi.com : బద్వేల్ ఉప ఎన్నిక ఇపుడు తెలుగుదేశానికి బాగా కలసి వచ్చినట్లుంది. అక్కడ పోటీ చేయమంటూ వ్యూహాత్మకంగా తప్పుకుని బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా వన్ సైడ్ లవ్ ని తమ్ముళ్ళు స్టార్ట్ చేశారు అంటున్నారు. నిజానికి రాయలసీమ ప్రాంతాల్లో కమలానికి ఎంత బలం ఉంది అన్నది అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీకి బద్వేల్ లో చాలా చోట్ల పోలింగ్ ఏజెంట్లు కనిపిస్తున్నారు. వారు కూడా టీడీపీ నుంచే ఉంటున్నారు. మరి ఇది తెర వెనక స్నేహమా లేక ముందర రోజుల కోసం బంధమా అన్నది తెలియడంలేదు. మొత్తానికి టీడీపీ తప్పుకోవడం బీజేపీ ఎంట్రీ ఇవ్వడం ఒక వ్యూహం ప్రకారమే సాగింది అన్నది బద్వేల్ లో పోలింగ్ వద్ద సంఘటనలు చూస్తే అర్ధమవుతుంది.
మరో వైపు బద్వేల్ లో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే వార్ ఉంది. ఎందుకంటే రెండు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక్కడే టీడీపీ అతి తెలివి కూడా కనిపిస్తోంది. తాము బీజేపీకి మిత్రులం కాబట్టే పోటీలో లేమని సందేశం ఇచ్చుకున్నట్లుగా కూడా దీన్ని చూడాలి అంటున్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేశారు అని టీడీపీ వర్గాలు చెప్పుకున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో బీజేపీకి టీడీపీ అవసరం ఉందని స్పష్టమవుతోంది. దానికి తగినట్లుగా బద్వేల్ లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు దక్కేలా చూస్తే కనుక తెర వెనక టీడీపీ వ్యూహం ఉందని అర్ధం అవుతుంది.
ఇక బీజేపీకి ఆ మాత్రం ఏపీలో లేపినా కేంద్ర నాయకత్వం నుంచి బాగానే మార్కులు పడతాయి. అది కూడా రాయలసీమలో జగన్ సొంత ఇలాకా అయిన కడప జిల్లాలో ఒక ఉప ఎన్నికలో బీజేపీకి బాగా ఓట్ల షేర్ వస్తే కచ్చితంగా టీడీపీకే ప్లస్ అవుతుంది. ఆ మీదట బీజేపీ కేంద్ర పెద్దలు కూడా మెత్తబడతారు ఫ్యూచర్ పాలిటిక్స్ ని కూడా ఈ లెక్కలతో సమీక్షించుకుంటారు. మొత్తానికి కొత్త పొత్తులకు ఎత్తులకు ఇది ప్రాతిపదిక అవుతుంది.
అందుకే బద్వేల్ లో తమకు బలమున్న చోట్ల టీడీపీ బీజేపీకి బాహాటంగానే సహకరిస్తోంది. ఒక విధంగా బీజేపీ గెలవకపోయినా వైసీపీ మెజారిటీని గణనీయంగా తగ్గించాలని చూస్తోంది. దీని వల్ల రెండిందాలా లాభం. ఏపీలో వైసీపీ మీద మోజూ క్రేజూ బాగా తగ్గాయని చెప్పడం అన్న మాట. ఏకంగా జగన్ సొంత జిల్లాలోనే ఫ్యాన్ స్పీడ్ తగ్గింది అని చెప్పడం ద్వారా టీడీపీ గణనీయంగా లాభపడే చాన్స్ ఉంది. అదే టైం లో బీజేపీతో చెలిమికి దారులు ఏర్పడతాయి. మొత్తానికి వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా టీడీపీ వేస్తున్న ఎత్తులు బద్వేల్ బంధాన్ని పటిష్టం చేసేలాగానే ఉన్నాయని అంటున్నారు.
కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ-బీజేపీ నేతలు ఏకమయ్యారా ? అవుననే అంటున్నారు క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. బీజేపీకి టీడీపీ మద్దతు పలకటమంటే కాస్త విచిత్రంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే బద్వేలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీకి ఏమాత్రం బలంలేదు. పార్టీ ఎంత బలహీనంగా ఉందంటే కనీసం 281 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని దయనీయస్ధితిలో ఉంది.
ఉపఎన్నికలో కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా కూర్చోబెట్టలేకపోతే పరువు పోతుందని దాదాపు రెండువారాలుగా టీడీపీ నేతలకు కమలనాదులు గాలమేస్తున్నారు. టీడీపీ ఎలాగూ పోటీలో లేదుకాబట్టి తమ పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోమని తమ్ముళ్ళని బతిమలాడుకుంటున్నారు. బీజేపీ అభ్యర్ధి సురేష్+కీలక నేత ఆదినారాయణరెడ్డి అండ్ కో కాశీనాయనపల్లి మండలంలోని టీడీపీ నేత వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళి మరీ చర్చలు జరిపారు.
దాదాపు రెండు వారాల క్రితం వరకు కేవలం పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటే చాలని చర్చలు జరిపిన కమలనాదులు వారం క్రితం నుండి టీడీపీ ఓట్లను బీజేపీ అభ్యర్ధికి వేయించాలని బేరాలు పెట్టినట్లు సమాచారం. టీడీపీ ఓట్లు వృధాగా పోకుండా తమ పార్టీకి వేయిస్తే దానికితగ్గ ప్రతిఫలం ఉంటుందని ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. టీడీపీ మాజీ ఎంఎల్ఏ విజయమ్మ కొడుకు రితేష్ రెడ్డితో కొందరు కమలనాదులు ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే బీజేపీ నేతల ప్రలోభాలకు గాలానికి తమ్ముళ్ళు తగులుకున్నారా లేదా అన్నది మొదట్లో తేలలేదు. కానీ ఈరోజు పోలింగ్ సందర్భంగా గమనిస్తే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ శ్రేణులు కనిపించాయనే ప్రచారం పెరిగిపోతోంది. అంటే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి సిద్ధపడిన టీడీపీ నేతలు మరి తమ ఓట్లను కూడా వేయించటానికి సిద్ధపడ్డారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
నిజానికి బీజేపీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 735 మాత్రమే. కమలంపార్టీకి ఏ ఎన్నికలో కూడా పోటీచేసేంత బలంలేదు. అలాంటిది ఇపుడు పోటీలోకి దిగిందంటేనే కారణం అర్ధమైపోతోంది. పోటీలో లేని ఇతర పార్టీల నేతల సేవలను ఓట్లను వేయించుకునే ప్లాన్ చేసినట్లు మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలింగ్ రోజున జరిగిన పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించినట్లే కనబడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం ఎలాగుంటుందో చూడాలి.
బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్ల కలకలం చెలరేగింది. నేతల మధ్య గొడవలు కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు వేయడానికి గ్రామంలోకి వచ్చారని కొందరిని గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హుజూరాబాద్ బద్వేలులో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కడప జిల్లా బద్వేలులో అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ప్రచారం సాగింది. కొంత మంది మహిళలు బద్వేలు ఉప ఎన్నికల్లో అట్టూరుమండలంలో ఫేక్ ఐడీలతో ఓట్లు వేయడానికి వచ్చినట్టు తెలిసింది. పోలీసుల తనిఖీల్లో ఐడీ కార్డులు లేవని గుర్తించి ఆ మహిళలను పోలింగ్ కేంద్రం నుంచి వెనక్కి పంపించారు.
ఇక ఎస్ వెంకటాపురంలో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీలు చేసి కొంత మంది మహిళలకు సరైన గుర్తింపు కార్డు లేవని గుర్తించారు. వారిని వెనక్కి పంపించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇక ఉప ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు బారులు తీరారు. మరోవైపు గోపవరం మండలం బేతాయపల్లి లోని 261 పోలింగ్ కేంద్రంలో గర్భవతి ఓటు వేసేందుకు వచ్చింది. క్యూలో నిలుచొని సొమ్మసిల్లి పడిపోయింది. ఎన్నికల సిబ్బందిప్రాథమిక చికిత్సనందించారు.