thesakshi.com : గుంటూరు లో మరో ఘోరం జరిగింది. ఓ ఇంట్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతమ్మ స్థానికంగా పొలాలకు నీళ్లు పెట్టే పైపులను అద్దెకిస్తూ జీవిస్తోంది. ఎలక్ట్రికల్ పనులు చేసే ఆమె భర్త.. పనికోసం తిరుపతి కి వెళ్లాడు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సమీప బంధువైన యువకుడు ఇంటికెళ్లి చూడగా ఆమె ఇంట్లోనే మృతి చెంది పడి ఉంది. ఒంటిపై దుస్తులు కూడా లేకపోవడం, గోళ్లతో రక్కిన గాయాలు, పంటి గాట్లు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఇంట్లో బీరువా కూడా తెరిచి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఘటనాస్థలిలో తాగిపడేసిన మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జరిగిన ఘటనపై తిరుపతిలో ఉన్న భర్తకు పోలీసులు సమాచారం అందించారు. అతడు గత ఏడాది డిసెంబర్లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర ఎలక్ట్రికల్ పనులు చేసేందుకు వెళ్లినట్లు చెప్పాడు. మృతిపై అనుమానాలున్నాయని అతడు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తిరుపతమ్మపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.