THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మెరుగైన రీతిలో విద్యాసంస్థలు నడిపేందుకేనా..?

thesakshiadmin by thesakshiadmin
October 29, 2021
in Latest, Politics, Slider
0
ఆంధ్రప్రదేశ్ లో పట్టాలెక్కతున్న ఆర్ధిక వ్యవస్థ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఎయిడెడ్ సంస్థల పాత్ర చాలా ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రైవేటు విద్యా సంస్థలు పని చేస్తున్నాయి. అయితే రానురాను విద్యారంగంలో వచ్చిన మార్పుల కారణంగా ఎయిడెడ్ సంస్థల పరిస్థితి మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఎయిడెడ్ విద్యాసంస్థలకు రెండు ఆప్షన్లు ఇచ్చి ప్రభుత్వ రంగంలో కలిపేయడమా లేక ప్రభుత్వ సహాయం లేకుండా సొంతంగా నడుపుకోవడమా అనేది తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము నష్టపోతామని కొందరు నిరసనలకు దిగుతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఎయిడెడ్ సంస్థల భవితవ్యం అగమ్యగోచరంగా మార్చేస్తున్నారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం ఎవరినీ బలవంతం చేయబోమని, మెరుగైన రీతిలో ఆయా విద్యాసంస్థలు నడిపేందుకే ఈ నిర్ణయమని చెబుతోంది.

ఎయిడెడ్ విద్యాసంస్థలు బ్రిటిష్‌ కాలం నుంచీ ఉన్నాయి. 1853లోనే థామస్ బాబింగ్టన్ మెకాలే నివేదిక ఆధారంగా ఆనాటి ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో విద్యావిధానం రూపొందించారు. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం సిద్ధమైంది.

బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా సొంతంగా విద్యాసంస్థల నిర్వహణకు ముందుకొస్తే వారికి కొంత సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఎయిడెడ్ విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యంగా క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలు నడిచాయి. వాటికి తోడుగా జమీందార్లు కూడా కొందరు విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రయత్నించారు.

అలా ఏపీలో కూడా వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లిష్ విద్యాబోధనతో పాటుగా సామాన్యులకు కూడా చదువులు అందుబాటులోకి రావడంలో ఎయిడెడ్ సంస్థల పాత్ర ఉంది.

ఏపీలో మొత్తం 1,972 ఎయిడెడ్ విద్యాసంస్థలున్నాయి. వాటిలో సుమారుగా 2 లక్షల మంది చదువుతున్నారు.

క్రిస్టియన్ మిషనరీలతో పాటుగా కొందరు సంఘ సంస్కర్తలు కూడా విద్యావ్యాప్తికై తమ ఆస్తులను ట్రస్టులకు అప్పగించి కొత్తగా పాఠశాలలు ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం వంటి వారు ఈ కోవలోకి వస్తారు.

అంతేకాకుండా ఎయిడెడ్ విద్యాసంస్థల ఏర్పాటు వేటికవే ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఉదాహరణకు స్వతంత్ర్యానంతరం 1948లోనే ఎస్టేట్స్‌ అబాలిషన్‌ యాక్ట్‌ వచ్చిన తర్వాత పలు చోట్ల ట్రస్టుల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.

ఉదాహరణకు విజయనగరం సంస్థానం ఆధ్వర్యంలో మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సుమారు 20వేల ఎకరాల భూమి ఉండగా, ఆ ట్రస్ట్ విద్యాసంస్థలను ప్రారంభించింది.

ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో విద్యాదానం చేస్తామంటూ అప్పట్లో ప్రకటించింది.. ఆ తర్వాత ఆయా సంస్థలు ఎయిడెడ్ సంస్థలుగా ఆవిర్భవించాయి.అదే జిల్లాలోని బొబ్బిలి సంస్థానాధీశుల ఆధ్వర్యంలో ఏర్పడిన పి.యు.సి. హైస్కూలు, ఎలిమెంటరీ స్కూలును కూడా ఎయిడెడ్ సంస్థలుగా నడిపారు.

1970 లలో బొబ్బిలిలో డిగ్రీ కాలేజీ కట్టాలని నిర్ణయించారు. దానికి అవసరమైన నిధుల కోసం సీతానగరం, బొబ్బిలి షుగర్‌ ఫ్యాక్టరీలకు వచ్చే చెరుకుపై టన్నుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

ఆ రోజుల్లో రెండు ఫ్యాక్టరీల్లో కలిపి రోజుకు 2.5 వేల టన్నులు క్రషింగ్‌ జరిగేది. అంటే రోజుకు రూ. 5 వేల చొప్పున రైతుల నుండి వసూలు చేసి కాలేజి బిల్డింగులు, ఫర్నిచర్‌, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి వినియోగించినట్టు ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘంలో పనిచేసిన కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఎయిడెడ్ వి కూడా ప్రముఖంగా ఉన్నాయి. ఒక్కో సంస్థ ఏర్పాటు వెనుక ఒక్కో కారణం కూడా ఉంది. ఏమైనా ఎయిడెడ్ విద్యాసంస్థలు దశాబ్దాల పాటు విద్యారంగంలో ముఖ్య భూమిక పోషించాయి.

ప్రభుత్వం అందించే ఎయిడ్ (సహాయం)లో ముఖ్యంగా వేతనాలు, ఇతర రూపాల్లో నిధులు అందించడం ఉండేవి. దాతల సహాయంతో భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావడం, సిబ్బందికి సర్కారు ద్వారా జీతాలు అందడంతో నామ మాత్రపు ఫీజులతోనే ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు నడిపేవారు.

కానీ, గడిచిన 20 ఏళ్లుగా వరుసగా వస్తున్న ప్రభుత్వాలు ఎయిడెడ్ విద్యా సంస్థలకు నిధుల కేటాయింపులో కోత పెడుతూ వచ్చాయి. ఫలితంగా ఆయా సంస్థలు నిధుల లేమితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏటా 10% ఎయిడ్‌ కోత మొదలయ్యింది. తరువాత వచ్చిన వైఎస్సార్‌ ప్రభుత్వం కూడా దానినే కొనసాగించింది. అందుకు తోడుగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాలు నిలిచిపోయాయి.

ఫలితంగా రిటైర్‌ అయిన టీచర్లు, సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఇతర పద్ధతుల్లో తక్కువ వేతనాలతో సిబ్బందిని నియమించుకోవాల్సి వచ్చింది. తాత్కాలిక సిబ్బంది సహాయంతోనే విద్యాసంస్థలు నడుపుతూ వస్తున్నారు.

ఎయిడెడ్ సంస్థల నిర్వహణ విషయంలో నిధుల కోత, సిబ్బంది నియామకాల విషయంలో ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు స్పందించలేదు. ఫలితంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఒకనాటి వెలుగులు మాయమయ్యాయి.

జగన్ సీఎం అయిన తర్వాత విద్యారంగంలో పలు మార్పులు వస్తున్నాయి. అదే పరంపరలో ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వానికి ఇచ్చేస్తారా లేక సొంతంగా నడుపుకుంటారా తేల్చుకోవాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.

ఆ సంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తే విద్యార్థుల సంఖ్య ఆధారంగా సిబ్బంది బదిలీలు, ఇతర మార్పులు ఉంటాయని చెబుతోంది. లేదంటే ప్రైవేటు స్కూళ్ల మాదిరిగా ఫీజులు వసూలు చేసుకుని మొత్తం నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలే స్వీకరించాలనే షరతు పెట్టింది.

వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన ఎయిడ్‌ తోనే సుదీర్ఘకాలం పాటు నెట్టుకొచ్చిన ఎయిడెడ్ సంస్థలు కొంతకాలంగా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

కొన్నిచోట్ల సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. కొందరు ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా నడుపుతున్నారు. తద్వారా విద్యా సంస్థల విస్తరణ, కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ కూడా చేశారు.

ఇప్పుడు వీటిని ప్రభుత్వపరం చేయడం, లేదంటే ప్రైవేటుగా మారాలనే నిబంధన రావడంతో ఎయిడెడ్ సంస్థలకు సర్కారు ముగింపు పలుకుతున్నట్టుగా భావిస్తున్నారు.

”ఒకటిన్నర శతాబ్దకాలంగా కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను ఎందుకు నీరుగార్చుతున్నారు.? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని ఎయిడెడ్ వ్యవస్థను కొనసాగించాలి. విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన పెద్దఎత్తున పోరాటం తప్పదు” అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.

ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో.42ను రద్దు చేయాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

”ఎయిడెడ్ సంస్థలన్నీ ప్రభుత్వ, ప్రజల సొమ్ముతో ప్రారంభించినవే. ఆప్షన్ల పేరుతో ప్రైవేటు ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. ఒకప్పుడు ఎయిడెడ్ సంస్థలు పట్టణాలు, నగరాల్లో శివారు ప్రాంతాల్లో స్థాపించారు. కానీ ఇప్పుడు విస్తరణతో ఆయా సంస్థల భూముల విలువ పెరిగింది.

ఇన్నేళ్లు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించిన బిల్డింగులు, గ్రంథాలయం, లేబరేటరీలు, ఫర్నిచర్‌ మొత్తం ట్రస్టుల పరం అవుతాయి. అంటే ప్రైవేటు సంస్థల మాదిరిగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి విద్యార్థులకు వస్తుంది.

ఒక్కసారిగా ఫీజులు పెరిగితే భరించడం సామాన్యుల తరం కాదన్న వాదన వినిపిస్తోంది.

”అమ్మ ఒడి పేరు చెబుతున్నా అది ఇంట్లో ఒక్కరికే ఏడాదికి రూ.14వేలు ఇస్తారు. పిల్లలందరి చదువులకు అది సరిపోతుందా అనేదానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి”.

విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం నిరసనలకు పూనుకున్నారు. సెయింట్ జోసఫ్ విద్యాసంస్థల సొసైటీ విషయంలో ఆందోళనకు దిగారు.

నిజానికి నగరంలో వందేళ్ల కిందటే అక్కడ సెయింట్ జోసఫ్ సంస్థలు విద్యాలయం నడపడంతో ఆ ప్రాంతానికి కాన్వెంట్ జంక్షన్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు అలాంటి సంస్థ కూడా మూతపడితే మా పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడలోని ప్రతిష్టాత్మక మాంటిస్సోరి సంస్థలను కూడా మూతవేస్తున్నట్టు ఆయా సంస్థల నిర్వాహకులు ప్రకటించారు. 67 ఏళ్ల కిందటి పాఠశాల మూతపడడంతో అక్కడ చదివే పిల్లలు కూడా వివిధ స్కూళ్లు, కాలేజీలు వెదుక్కోవాల్సి వచ్చింది.

బాలికా విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పాఠశాలకి గ్రాంట్ నిలిపివేయడంతో 13 మంది ఉపాధ్యాయులను యాజమాన్యం ప్రభుత్వానికి అప్పగించింది.

”మా ఆయన ఆటో డ్రైవర్. మా పిల్లలు మాంటిస్సోరి హైస్కూల్లో చదివేవారు. కరోనా తర్వాత స్కూల్ తెరిచారని పంపించాము. కానీ ఒకరోజు నోటీసు ఇచ్చి మీ పిల్లలను వేరే స్కూల్లో వేసుకోండి అని మేనేజ్‌మెంట్ చెప్పింది. ప్రైవేటు స్కూల్లో ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 24వేల చొప్పున ఫీజులు కడుతున్నాం. ఇలా మధ్యలోనే బడిలో మూసేయడం ఎవరికైనా ఇబ్బందే” అని విజయవాడ పున్నమ్మతోటకు చెందిన ఎం.శశికళ వాపోయారు.

విశాఖలో ఆందోళన సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కూడ ఇదే రీతిలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

విద్యాసంస్థల నిర్వాహకుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మాంటిస్సోరి సంస్థల ఆధ్వర్యంలో హైస్కూల్ మూతవేయడంతో అది రాష్ట్రంలోనే మొదటిదిగా నిలిచింది. ప్రభుత్వ నిర్ణయం వల్లనే తమ స్కూల్ నిర్వహణ సాధ్యం కాదని నిర్ణయించుకున్నామని, ఈ విషయంపై తాము నేరుగా స్పందించలేమని స్కూలు నిర్వాహకులు చెబుతున్నారు.

అదే సమయంలో మూత వేయాల్సిన అవసరం లేకుండా ఎయిడెడ్ విద్యాసంస్థలు యథావిధిగా నడుపుకునే అవకాశం ఉందని కొందరు యజమానులు చెబుతున్నారు.

”మా కాలేజీలో సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో చేరిపోయారు. ప్రైవేటు కాలేజీగా మారిన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు వసూలు చేస్తున్నాము. మా సంస్థను మాత్రం యథావిధిగా నడుపుతాము” అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వై.ఎన్.కాలేజ్ నిర్వాహకులు డాక్టర్ పార్థసారధి తెలిపారు.

ఏపీలోని నెల్లూరు, గుంటూరు, చీరాల సహా వివిధ ప్రాంతాల్లో ప్రముఖ ఎయిడెడ్ విద్యాసంస్థలు కూడా ఇదే పద్ధతిలో రూపాంతరం చెందుతున్నాయి.

కాగా, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుపై వైసీపీ ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందో ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో బయటపడిందని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు.

శుక్రవారం సర్క్యులర్ ఇచ్చి, సోమవారం ఎయిడెడ్ విద్యా సంస్థలు సొంతంగా నడుపుకుంటాయా లేక ప్రభుత్వానికి అప్పగిస్తాయా చెప్పాలని ఆదేశించారని, విద్యా సంవత్సరం మధ్యలో అర్థంతరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులు ఎంత ఇబ్బందిపడతారో అనేది ఆలోచించలేదని ఆరోపించారు.

ఎయిడెడ్ విద్యావ్యవస్థను పాతపద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని ప్రభుత్వం చెబుతోంది. మెరుగైన పద్ధతిలో వాటిని నిర్వహించేందుకు మాత్రమే విధాన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

”ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించడం పూర్తి స్వచ్ఛందం. చాలా విద్యాసంస్థల్లో పరిస్థితులు దెబ్బతిన్నాయి శిథిలావస్థలో, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశం ప్రభుత్వం పరంగా కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది” అని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో నిర్వహించిన సమావేశంలో సందర్భంగా సీఎం జగన్ అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవితవ్యంతో ఆటలొద్దని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై విష ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు.

‘‘ఎయిడెడ్ విద్యాసంస్థలను తామే నడుపుకుంటామంటే ఏ ప్రైవేటు విద్యా సంస్థనూ ఇబ్బంది పెట్టం. ఎవరినీ బలవంతంగా తీసుకునే ప్రసక్తే లేదు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళన్నీ దుస్థితిలో ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ విధానాలే వాటికి మూలం. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పోస్టులు భర్తీ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది నాటి టీడీపీ ప్రభుత్వం కాదా..? అందుకే వాటిని సరిదిద్దాలని నిర్ణయించాం. విద్యా వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణలలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా నిర్ణయం తీసుకున్నాం. రెగ్యులేటరీ కమిషన్‌ ఫిక్స్‌ చేసిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ఆయన మీడియాకు తెలిపారు.

ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా కొన్ని చోట్ల నిర్వహణ కొనసాగుతుండగా కొన్నిచోట్ల మాత్రం మూసివేత దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకు దారితీస్తోంది.

Tags: #AIDED SCHOOLS#AIDED SCHOOLS ANDHRA PRADESH#AP AIDED SCHOOLS#AP CM YS JAGAN#GOVERNMENT OF ANDHRA PRADESH#YS JAGAN GOVERNMENT#YS JAGAN MOHAN REDDY
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info