thesakshi.com : జనరల్‌గా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా… డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం… భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు… మహోన్నత భావాల శక్తి. ఆయన జీవితం కన్నీటి సంద్రం. ప్రతి రోజూ పోరాటాల మయం. చుట్టూ అవమానాలు, హేళనలు చేసే సమాజం…. అంటరానివాడిగా ముద్ర. ఏం చేద్దామన్నా సమస్యే. ఒక్క అడుగు ముందుకు వేసేలోపు.. వెనక్కి లాగేసేలా వంద అడుగుల కుటిల యత్నాలు. అలాంటి చోట… అన్నింటినీ మౌనంగా భరిస్తూ, పర్వతమంత సహనంతో మెలగుతూ… ఉలి చెక్కిన శిల్పంలా తనను తాను మలచుకుంటూ… రాజ్యాంగ నిర్మాతగా మారి.. ఈ దేశానికి సరైన దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి
తమ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడికి ఏం చేసినా తక్కువే అని భారతీయులు శాశ్వతంగా కీర్తించే అంబేద్కర్… బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేశారు. సాధారణ నేతలైతే పేదలకు మాటలతో హామీలు ఇచ్చి… చేతల్లో చేయకపోవచ్చు అని భావించిన ఆయన.. రాజ్యాంగ నిర్మాణంలోనే పేదలకు కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని వాడవాడలా గుండెల్లో పెట్టేసుకుంటారు ప్రజలు. ఆయన జయంతిని తమ పుట్టిన రోజులా జరుపుకుంటారు….
ఏప్రిల్ 14, 1891లో పుట్టిన డాక్టర్ అంబేద్కర్… దేశ మొదటి ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. ఆర్థిక వేత్తగా, ప్రొఫెసర్‌గా, లాయర్‌గా, రాజ్యాంగ నిర్మాతగా ఇలా ఎన్నో సేవలు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో అపర మేధావిగా తనదైన మార్క్ చూపించారు. దీన జనులు, దళితుల హక్కుల కోసం పోరాడారు. ఇలా ఎన్నో చేశారు. మరి ఆయన జయంతి సందర్భంగా… విషెస్, మెసేజెస్ పంపుకొని ఆయన ఇచ్చిన సందేశాల్ని గుర్తుచేసుకుందాం…దీన జనుల కోసం పోరాడి వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్.
దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి..
నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు..
చూడాల్సినది కులం, మతం కాదు. వారి ఆశయం, అభిమతం. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు… కులం పునాదుల మీద దేనినీ సాధించలేం. ఒక జాతినీ, నీతినీ నిర్మించలేం..మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. దాని కోసం దేవుడిమీద ఆధారపడవద్దు అని తెలిపిన వ్యక్తి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్.
అంబేద్కర్ కోట్స్..
ఎంత కాలం జీవించామన్నది కాదు… ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం
సమానత్వం అనేది ఓ ఊహ కావచ్చు కానీ ప్రతి ఒక్కరూ దాన్ని పాలనా సిద్ధాంతంగా ఆమోదించాలి
స్వేచ్ఛాయుతంగా ఆలోచించగలగడమే అసలైన స్వేచ్ఛ. స్వేచ్ఛగా ఆలోచించలేకపోవడం అంటే బానిసత్వమే
ప్రముఖ వ్యక్తికీ గొప్ప వ్యక్తికీ తేడా ఉంటుంది. గొప్ప వ్యక్తి సమాజ సేవకు సన్నద్ధంగా ఉంటారు
స్వేచ్ఛ, సమానత్వం, సోదర సోదరీ భావాన్ని బోధించే మతం నాకు ఇష్టం
భార్యాభర్తల మధ్య సంబంధం.. అత్యంత సన్నిహిత స్నేహితులకు మల్లే ఉండాలి
చరిత్రను మర్చిపోయేవాళ్లు చరిత్ర సృష్టించలేరు
మహిళల ఉన్నతిని బట్టీ నేను సమాజ ఉన్నతిని అంచనా వేస్తాను
ఇలా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రతి మాట, ప్రతి సందేశం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. మనిషి ఎలా ఉండాలి అనేందుకు ఆయన జీవితమే నిదర్శనం.