thesakshi.com : వినడానికే ఇది బాధగా భయంగా ఉంది. కానీ జరుగుతున్న కధ చూస్తూంటే మాత్రం అమ్మో బాబోయ్ అనిపించకమానదు. పైలా పచ్చీస్ గా ఉండాల్సిన యువత మత్తుకు చిత్తు అవుతోంది. కాస్మోపాలిటిన్ సిటీ కల్చర్ విశాఖలో ఉంది. దాంతో మహా నగరాల నుంచి డ్రగ్స్ విశాఖకు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఉత్తరాంధ్రా ఒడిషాలోని చాలా ప్రాంతాలకు ముఖ్య కూడలి విశాఖ.
ఇక్కడకు విద్య ఉద్యోగార్ధులుగా యువత వస్తారు. చక్కని భవిష్యత్తుని వారు వెతుక్కోవాలని చూస్తారు. అలాంటి వారి జీవితాలను మాయదారి డ్రగ్స్ కబలిస్తోంది. ఎంతో జీవితం ముందు ఉన్నా కూడా ఈ మత్తుకు అలవాటు పడి నిస్తేజం అయిపోతున్నారు. విశాఖలోని కొన్ని కాలేజీలు క్యాంపస్ లను తమకు అడ్డాగా మార్చుకుని మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలు రెచ్చిపోతున్నాయి.
ఇక విశాఖ సిటీ నడిబొడ్డున ఉనన్ ఒక అపార్ట్మెంట్ లో లేటెస్ట్ గా పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ జరిపిన దాడుల్లో ముగ్గురు యువకులు డ్రగ్స్ తో పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని గాలించే పనిలో టాస్క్ ఫోర్స్ బృందం ఉంది. విశాఖలో ఒక వైపు మద్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక గంజాయి ఎగుమతులు దిగుమతుల గురించి వేరేగా చెప్పాల్సింది లేదు.
ఈ నేపధ్యంలో డ్రగ్స్ రవాణాకు ముఖ్య కేంద్రంగా విశాఖను చేసుకోవడం మాత్రం అలజడి రేకెత్తిస్తోంది అంటున్నారు. విశాఖ సిటీలో పాతిక లక్షల మంది దాకా జనాభా ఉంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలు చాలా ఉన్నాయి. ఇపుడిపుడే ఐటీ ఇక్కడ వేళ్ళూనుకుంటోంది. దాంతో పాటు ఈ డ్రగ్స్ కల్చర్ కూడా పాతుకుపోయేలా సీన్ కనిపిస్తోంది.
ఇక లేటెస్ట్ గా టాస్క్ ఫోర్స్ చేసిన దాడులలో కొత్త రకం డ్రగ్ క్రిస్టల్ మిత్ దొరకడంతో పోలీస్ వర్గాలే షాక్ తింటున్నాయి. విశాఖకు చెన్నై బెంగుళూరు కోల్ కటా ముంబై గోవాల నుంచి డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక డ్రగ్స్ లో రకాలు చూస్తే ఎండీఎం సింథటిక్ హ్యాషిస్ ఆయిల్ క్రిస్టల్ మిత్ లాంటి మత్తుని కలిగించే మాదక ద్రవ్యాలను పోలీసులు దాడులలో గుర్తిస్తున్నారు. డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్న యువత ఒక గొలుసుకట్టుగా ఏర్పడి వివిధ మార్గాల ద్వారా వీటిని తెప్పించుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ విశాఖ వంటి సిటీలో సాగుతోంది.
విశాఖలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం బీటెక్ చదువుతున్న విద్యార్ధి డ్రగ్స్ తో దొరికిపోవడంతో ఉలిక్కిపడుతున్నారు. అక్కడ డ్రగ్స్ కి ఎంతమంది బానిసలుగా మారుతున్నారు అన్న దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈజీ మనీగా కొందరు యువత డ్రగ్స్ ని అక్రమ రవాణా చేయడంలో ముందుకు వస్తున్నారు అని పోలీస్ వర్గాలు అంటున్నాయి. చిత్రమేంటి అంటే ఇంటర్ చదువుతున్న విద్యార్ధులు కూడా ఈ రాకెట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
విశాఖ నగర శివార్లతో పాటు బీచ్ రోడ్డులో ఉన్న అపార్ట్మెంట్స్ ని అద్దెకు తీసుకుని మరీ డ్రగ్స్ రాకెట్ ని విజయవంతంగా యువకులు కొందరు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలీసులు గతంలో విద్యా సంస్థలకు వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం మాదక ద్రవ్యాల విషయంలో విద్యార్ధులను చైతన్యం చేయడానికి కార్యక్రమాలు చేపట్టేవారు. ఇపుడు ఆ రకమైన కార్యక్రమాలు లేకపోవడంతో మరో మారు విశాఖలో డ్రగ్స్ దుమారం రేగుతోంది అంటున్నారు.
ఒక్క డ్రగ్స్ మాత్రమే కాదు గంజాయ్ తో సిగరెట్లలో గంజాయిని కూర్చి యువతకు కిక్కిచ్చే మత్తుగా ఇస్తున్నారు. మొత్తానికి విశాఖలోని సాగర తీరాలు బీచ్ రోడ్లలో యువత ఎక్కువగా రాత్రులలో డ్రగ్స్ తో విచ్చలవిడితనంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. దీని మీద గట్టి నిఘా పెట్టకపోతే విశాఖ డ్రగ్స్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడడం ఖాయమే అంటున్నారు.