thesakshi.com : భవనం బేస్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిన ఏడుగురు మంటల్లో కాలిబూడిదయ్యారు. ఈ ప్రమాదం నుంచి మరో 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విషాదకర ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అగ్ని ప్రమాద నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇండోర్ నగరంలోని ఓ రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు రక్షించినట్టు ఇండోర్ కమిషనర్ హరినారాయణ చారీ మిశ్రా తెలిపారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఇండోర్‌లోని స్వర్న్ బాగ్ కాలనీలో ఉన్న భవనం బేస్‌మెంట్‌లో శనివారం ఉదయం 3.10 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
7 die in fire at Indore building, nine rescued, the fire was triggered by short circuit in main electric supply system in the basement 5 people still hospitalized @ndtv @ndtvindia pic.twitter.com/Qtq89HYX95
— Anurag Dwary (@Anurag_Dwary) May 7, 2022
మంటలు అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు అంటుకుని రెండతస్తుల భవనం మొత్తం దగ్ధమైంది. అగ్ని ప్రమాదాన్ని నివారించే చర్యలు చేపట్టకపోవడంతోనే తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాణాలు పాటించని కారణంగా భవనం యజమాని అన్సార్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు గాఢనిద్రలో ఉండగా మంటలు వ్యాపించడంతో బయటకు రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. చనిపోయినవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రమాదంలో బేస్‌మెంట్‌లో ఉన్న డజనుకుపైగా ద్విచక్రవాహనాలు, ఒక ఎస్‌యూవీ వాహనం కాలిబూడిదయ్యాయి. వీటి వల్లే తీవ్రత ఎక్కువగా ఉంది. మంటలు అంటుకోవడంతో భారీ శబ్దాలతో పేలిపోయాయి. అటు, అగ్ని ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ప్రమాదంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందజేయాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.