THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఫేస్‌బుక్‌ వనరుల కొరత ఎదుర్కుంటోందా..?

thesakshiadmin by thesakshiadmin
October 27, 2021
in Latest, National, Politics, Slider
0
ఫేస్‌బుక్‌ వనరుల కొరత ఎదుర్కుంటోందా..?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   “నేను నా జీవితంలో ఇప్పటి వరకు చూసిన వాటికంటే, గత మూడు వారాల్లో చూసిన శవాలు ఎక్కువ” అని ఇండియాలో ఫేస్‌బుక్ మీద పరిశోధన వ్యక్తి ఒకరు 2019లో ఓ నివేదికలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన 3 వారాలపాటు సోషల్ మీడియా అల్గారిథమ్స్‌ మీద పరిశోధన చేశారు.

ఈ పరిశోధనాంశాలు అంతర్గత సమాచారం కోసం తయారు చేయగా, ‘ఫేస్‌బుక్ పేపర్స్’ పేరుతో న్యూయార్క్ టైమ్స్‌ సహా పలు అమెరికా పబ్లికేషన్లు దీనిని ప్రచురించాయి.

తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలను, రెచ్చగొట్టే ప్రకటనలను కంట్రోల్ చేయలేక ఫేస్‌బుక్ నానా కష్టాలు పడుతోందని ఆ పత్రికల కథనాలు పేర్కొన్నాయి. భారతదేశం వెలుపల కూడా సెలబ్రేషన్స్ ఆఫ్ వయోలెన్స్ కంటెంట్‌ను నియంత్రించడానికి ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది.

ఇండియాలో అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో తగినంత వనరులను వినియోగించడంలో వైఫల్యం, సాంస్కృతిక సున్నితత్వం లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని ‘న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది.

ఈ పరిశోధన ఫలితాల తర్వాత కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిందని, లోతైన విశ్లేషణ చేపట్టిందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు నాకు చెప్పారు.

అంటే, భారతదేశంలో ఫేక్‌ న్యూస్, రెచ్చగొట్టే విద్వేష పూరిత వార్తలను కంట్రోల్ చేయడంలో ఫేస్‌బుక్‌ను వనరుల కొరత ఎదుర్కుంటోందా?

ఫ్యాక్ట్‌చెక్ కోసం ఫేస్‌బుక్ భారతదేశంలో పది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సోషల్ నెట్‌వర్క్‌లలో ఫ్లాగ్ చేసిన అంశాలను ఇంగ్లీషుతోపాటు 11 భారతీయ భాషలలో వాస్తవాలను తనిఖీ చేస్తారు.

అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు అతి పెద్ద నెట్‌వర్క్‌ భారతదేశమే. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం మరింత సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి.

ఇండియాలో ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేస్తున్న ఫ్యాక్ట్‌చెక్ సంస్థలు అనుమానాస్పద వార్తలు, యూజర్లు ఫ్లాగ్ చేసిన పోస్టులను క్రాస్‌చేసి ట్యాగ్ చేస్తున్నాయి.

‘‘మేము ఒక వార్త లేదా పోస్ట్‌ను ట్యాగ్ చేసిన తర్వాత ఫేస్‌బుక్ దానిని ఏం చేస్తుందనే దానిపై మాకు ఎటువంటి నైతిక లేదా చట్టపరమైన అధికారం ఉండదు’’ అని ఫ్యాక్ట్‌చెక్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి నాతో అన్నారు.

తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో ఫేస్‌బుక్ చేస్తున్న ప్రయత్నాల్లో ఫ్యాక్ట్‌చెక్ అనేది ఒక భాగం మాత్రమే.

కానీ, భారతదేశంలో సమస్య చాలా పెద్దది: ఇక్కడ విద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని రాజకీయ పార్టీలు, నాయకులతో ముడిపడిన బాట్‌లు, నకిలీ ఖాతాలు పుష్కలంగా ఉన్నాయి.

ముస్లింలు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని శోధించే అంశాలతో యూజర్ల పేజీలు, గ్రూపులు నిండిపోయాయి. తప్పుడు సమాచారం ఇక్కడ వ్యవస్థీకృతంగా, జాగ్రత్తగా సాగిస్తున్న ఆపరేషన్. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వైరస్ వంటివి నకిలీ వార్తలను ప్రేరేపిస్తాయి.

అలాగే, ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల గౌరవం” అనే ప్రాతిపదికన రాజకీయ నాయకులు పోస్ట్ చేసిన అభిప్రాయాలను, ప్రసంగాలను ఫేస్‌బుక్ ఫ్యాక్ట్‌ చెక్ తనిఖీ చేయదు.

“భారతదేశపు సోషల్ మీడియాలో ఎక్కువ భాగం తప్పుడు సమాచారం పాలక పార్టీకి చెందిన రాజకీయ నాయకులే సృష్టిస్తారు. వారు ప్రభావవంతమైన వ్యక్తులు. కాబట్టి ఫేస్‌బుక్ వాటిని ఫ్యాక్ట్‌చెక్ చేయదు” అని ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా చెప్పారు. ఆల్ట్‌న్యూస్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్ సైట్.

భారతదేశంలోని ఫ్యాక్ట్‌చెక్ సంస్థలకు, హక్కుల కార్యకర్తలకు ఈ విషయాలు కొత్తకాదు. ”ఇది మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఏ సోషల్ మీడియాను నిందించే పరిస్థితి లేదు” అని ప్రతీక్ సిన్హా అన్నారు. .

ద్వేషపూరిత ప్రసంగాలు, ట్రోలింగ్, మైనారిటీలు, మహిళలపై దాడులతో భారతీయ ట్విట్టర్ ఒక చీకటి వ్యవస్థగా మారింది. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడంలో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ అతిపెద్ద క్యారియర్‌గా మారింది. అయితే, గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌లో కూడా తప్పుడు వార్తలు, వివాదాస్పద అంశాలు ప్రచారమవుతున్నప్పటికీ, వాట్సాప్, ఫేస్‌బుక్‌లపై వచ్చిన వివాదాలు రాలేదు.

గత సంవత్సరం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసే సైట్‌లో 12 గంటల నిడివి గల ప్రత్యక్ష ప్రసార వీడియోలు ఉన్నాయి. (సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తర్వాత పోలీసులు నిర్ధారించారు.)

ఫేస్‌బుక్‌లో ఎక్కడో సమస్య ఉంది. 34 కోట్లమంది యూజర్లతో భారతదేశంతో అతిపెద్ద మార్కెట్ ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఇది జనరల్ పర్పస్ సోషల్ మీడియా. యూజర్లు వ్యక్తిగత పేజీలను, గ్రూపులను ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తుంది.

“విస్తృత శ్రేణి ఫీచర్లు తప్పుడు సమాచారం, ద్వేష పూరిత ప్రసంగాలకు మరింత కారణమవుతాయి” అని సిన్హా చెప్పారు.

సోషల్ నెట్‌వర్క్‌లో ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారంలో అధిక భాగాన్ని అంతర్గతంగా పని చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్లకు, కంటెంట్ మోడరేటర్లకు సేకరించి పెడుతుందని చెబుతారు.

2016 నుంచి ఫేస్‌బుక్ 1300 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.7,400 కోట్లను ఖర్చు చేసిందని, 40,000మందిని ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీ కోసం వినియోగించుకున్నట్లు పేర్కొంది.

15,000కంటే ఎక్కువ మంది వ్యక్తులు 20 భారతీయ భాషలతో సహా 70 కంటే ఎక్కువ భాషలలో కంటెంట్‌ను సమీక్షించారని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు నాకు తెలిపారు.

యూజర్లు ద్వేషపూరిత ప్రసంగాలను రిపోర్ట్ చేసినప్పుడు, ఆటోమేటెడ్ క్లాసిఫైయర్‌లు థర్డ్ పార్టీ చెక్ పాయింట్‌ వెళ్లక ముందే వాటిని పరిశీలిస్తాయి. ”ఈ క్లాసిఫైయర్స్ సవ్యంగా ఉంటే ఇంకా మరిన్ని ద్వేష ప్రసంగాలను అడ్డుకోవచ్చు. కానీ పరిస్థితి అలా లేదు” అని సిన్హా అన్నారు.

”మా సంస్థ హిందీ, బెంగాలీతో సహా వివిధ భాషలలో ద్వేషపూరిత ప్రసంగాలను కనుగొనడానికి టెక్నాలజీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది” అని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు నాతో చెప్పారు.

“ఈ కారణంగానే మేం ఈ సంవత్సరం ప్రజలు చూసే ద్వేష పూరిత ప్రసంగాలను సగానికి తగ్గించాము. ఇప్పుడది 0.05%కి పడిపోయింది. ముస్లింలతో సహా అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటి అమలును మెరుగు పరుస్తున్నాము. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నాం” అని ఆ ప్రతినిధి చెప్పారు.

ఇక ఫేస్‌బుక్ పాలక పక్షానికి మద్ధతుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018లో జర్నలిస్టులు సిరిల్ సామ్, పరంజోయ్ గుహా ఠాకుర్తా లు వీటిపై వరస కథనాలు రాశారు.

ఇందులో ”ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మిత్రుల సాయంతో ఫేస్‌బుక్ భారతదేశంలో ఆధిపత్య స్థానాన్ని పొందింది” అని కూడా పేర్కొన్నారు. (ఈ కథనాలు కాంగ్రెస్ పార్టీ, ఫేస్‌బుక్‌తో సంబంధాల గురించి కూడా పరిశీలించాయి.)

“వైరాలిటీ పై పని చేసే బిజినెస్ మోడల్‌తో ఫేస్‌బుక్ అధికార పార్టీలకు మిత్రురాలిగా వ్యవహరిస్తుంది” అని ‘ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్‌బుక్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం సహ రచయిత గుహా థాకుర్తా చెప్పారు.

ఒక సబ్జెక్ట్ కోసం శోధించినప్పుడు, అతనికి ఏమి చూపించాలో నిర్ణయించే సోషల్ నెట్‌వర్క్ అల్గారిథమ్స్ పై ఎక్కువమంది విమర్శలు చేస్తున్నారు. ఈ అల్గారిథమ్స్ వారిని వివిధ గ్రూపులలో చేర్చడానికి, వీడియోలు చూడటానికి, కొత్త పేజీలను సెర్చ్ చేయడానికి ప్రోత్సహిస్తాయి.

“ఈ అల్గారిథమ్‌లు కమ్యూనిటీలను పోలరైజ్ చేసి ఎమోషనల్ వ్యసనపరులుగా మారుస్తాయి” అని జర్నలిస్ట్, ఫేస్‌బుక్ పర్యవేక్షణ బోర్డు సభ్యుడు అలాన్ రస్‌బ్రిడ్జర్ వ్యాఖ్యానించారు.

”ఎక్కడో మూలన ఉన్న కంటెంట్‌ను కూడా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి తీసుకురాగలిగేది ఈ అల్గారిథమ్సే” అని ఒకప్పుడు ఫేస్‌బుక్‌లో పని చేసిన డేటా సైంటిస్టు రోడీ లిండ్సే అన్నారు.

విజిల్ బ్లోయర్‌గా మారిన ఫేస్‌బుక్ ప్రోడక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్ హౌజెన్ చెప్పినట్లు: “మనకు మానవీకరణ చెందిన సాఫ్ట్‌వేర్ ఉండాలి. ఇక్కడ మనుషులు కలుసుకుని సంభాషణలు జరపాలి. మనం ఏం చేయాలో కంప్యూటర్‌లు నిర్ధరించడం సరికాదు”

Tags: #FACEBOOK#FACEBOOK INDIA#FACEBOOK SOCIAL MEDIA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info