thesakshi.com : గురువు అంటే విద్యాబుద్ధులతో పాటు సంస్కారం నేర్పాల్సిన వ్యక్తి. పిల్ల భవిష్యత్తుకు దిక్సూచి. కానీ ఓ అధ్యాపకుడు మాత్రం ఆ స్థానానికే మాయన మచ్చను తెచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడు వక్రబుద్ధిని తలకు ఎక్కించుకున్నాడు. కామంతో కళ్లుమూసుకుపోయి అమ్మాయిలతో పశువులా ప్రవర్తించాడు. చివరికి తన్నులు తిన్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలోని ఆర్కేఎన్ఆర్ జూనియర్ ప్రభుత్వ కళాశాల ఉంది. చుట్టూ పక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అదే కాలేజీలో సోమయ్య అనే వ్యక్తి కాంట్రాక్టు పద్దతిలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. కార్వేటి నగరంలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన సోమయ్య విద్యార్థినిలపై కన్నేశాడు.
నిత్యం వారితో అసభ్యంగా ప్రవర్తించడం, కోరిక తీరిస్తే ఎక్కువ మార్కులు వేస్తానంటూ వారిని ప్రలోభపెట్టేవాడు. అతడి ఆగడాలు శృతిమించడంతో విద్యార్థిను మహిళా లెక్చర్లలకు చెప్పారు. దీనిపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా బుద్ధి మార్చుకోవాలని హెచ్చిరించారు. తొలుత తాను మారిపోయినట్లు అందర్నీ నమ్మించిన సోమయ్య.. మళ్లీ వంకర బుద్ధిని ప్రదర్శించారు. బోర్డుపై రాయించే వంకతో విద్యార్థినులపై చేయి వేయడం వంటి వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. ఒళ్లుమండిని విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అమ్మాయి తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి సోమయ్యకు దేహశుద్ధి చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ బాలసుబ్రహ్మణ్యం రాజు, తోటి అధ్యాపకులు, విద్యార్ధిని, విద్యార్ధులు చూస్తుండగానే సోమయ్యను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కాంట్రాక్టు అధ్యాపకుడు సోమయ్యను విధుల నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆడపిల్లలను చదివించాలని కాలేజీలకు పంపిస్తుంటే ఇలాంటి కీచకుల చేతిలో ఎక్కడ బలైపోతుందో అనే భయం వెంటాడుతోందని విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీచక అధ్యాపకుడు సోమయ్యపై కేసు నమోదు చేసిన కఠినంగా శిక్షించాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధిని, విద్యార్ధులను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సిన అధ్యాపకులే బుద్దిని కోల్పోయి వక్ర బుద్దితో ప్రవర్తించడం సరైనా విధానం కాదని స్ధానికులు అంటున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని స్ధానికులు కోరుతున్నారు. గతంలో స్కూళ్లలోనూ ఉపాధ్యాయులు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. వయసు బేధాలు మరచి పశువుల్లా మారుతున్నవారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.