thesakshi.com : నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థల్లో క్రమశిక్షణారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించరాదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ అధికారులను ఆదేశించారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, అంబులెన్స్‌లు మరియు మందుల కొరతతో కూడిన ఇటీవలి సంఘటనలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయని, చిన్న సమస్యలు కూడా ప్రజలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని మంత్రి అన్నారు.
ఒక వ్యక్తి చేసే ఒక్క పొరపాటు అనేక జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది, కాబట్టి నిబంధనలను ఉల్లంఘించిన మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, నిబంధనలను ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టవద్దని ఆమె అధికారులను కోరారు.
మార్చురీలు, మృతదేహాలను అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అన్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి ఆదిలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఘటనలు మహిళా మంత్రి రజినిని వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన దిశగా పయనించాల్సిన అవసరాన్ని సూచించాయి.
అతి పిన్న వయసులో మంత్రిగా అవకాశం దక్కించుకుని వరుస ఘటనలతో ఇబ్బంది పడిన మహిళా మంత్రి విడదల రజిని ఇప్పుడు కార్య క్షేత్రంలోకి దిగి ఆస్పత్రుల్లో అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించి వైద్య ఆరోగ్య శాఖను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా ఏపీని తీర్చి దిద్దుతామని, ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని బాధ్యతలు చేపట్టిన తొలి నాడు చెప్పారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి ఆస్పత్రుల్లో వరుసగా దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అయ్యారు.
దీంతో తాజాగా మంత్రి విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖను గాడిలో పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్వో లు, డిసిహెచ్ఎస్ లు, టీచింగ్, జిల్లా ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్ళు పాల్గొన్నారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమస్యలపై లోతుగా సమీక్షించి ఇటీవల చోటు చేసుకున్న ఘటనల వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో మందులు లేవు, అంబులెన్స్ లు అందుబాటులో లేవు అంటూ వార్తలు మళ్ళీ రాకుండా జాగ్రత్త వహించాలి అంటూ అధికారులకు సూచించారు మంత్రి విడదల రజిని.
ఇక ఇదే సమయంలో ఇటీవల జరిగిన అనేక ఘటనలపై చర్చించిన మంత్రి విడదల రజిని చిన్న చిన్న సంఘటనలు కూడా రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఏ ఒక్కరు తప్పు చేసినా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లేనని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
త్వరలోనే తాను అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, ఆసుపత్రులలో పరిస్థితులను సమీక్షిస్తామని విడదల రజిని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవా దృక్పథంతో పని చేశారని మంత్రి వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు.
కానీ ఇటీవల జరిగిన అనేక ఘటనల నేపథ్యంలో కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించాలని, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలని విడదల రజిని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సీఎం జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక అని, ఆ శాఖకు మంచిపేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని విడదల రజిని పేర్కొన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖకు కావలసినంత బడ్జెట్ ను కేటాయించారని పేర్కొన్న మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ఆసుపత్రులలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందరం బాధ్యులం అవుతామంటూ తేల్చి చెప్పారు. కింది స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె వెల్లడించారు. ఉన్నతాధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్న మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. మొత్తానికి వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయడానికి విడదల రజిని అధికారులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని అన్ని ఆసుపత్రులను తాను పరిశీలిస్తానని ప్రకటించారు.
దీంతో ఆమె కార్యక్షేత్రంలోకి దిగుతున్నట్టు అర్థమవుతుంది. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించిన విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖను గాడిలో పెట్టడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాలి.