Tuesday, April 13, 2021

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి

thesakshi.com    :    అనూహ్య పరిణామాలేమీ చోటు చేసుకోలేదు.. అందరూ ఊహించిందే జరిగింది.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డిని ఎన్నుకున్నారు. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో.. ఎక్స్ అఫిషియా ఓట్లతో సంబంధం లేకుండానే మేయర్ ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీల్డు కవర్ తెరిచి.. మేయర్గా విజయలక్ష్మి డిప్యూటీ మేయర్గా శ్రీలత రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించడంతో ఎన్నిక లాంఛనమైంది.

సభ్యుల ప్రమాణం..
మేయర్ ఎన్నికకు ముందు ఎన్నికైన కార్పొరేటర్లంతా ప్రమాణం చేశారు. 11.10 గంటలకు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సమావేశాన్ని ప్రారంభించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం.. సభ్యులు చాలా మంది ఉండడంతో.. పార్టీల వారీగా గ్రూపుగా ఏర్పడి ప్రమాణం చేస్తామని చెప్పారు. దీనికి.. కలెక్టర్ శ్వేతామహంతి అంగీకరించారు.

మేయర్ ఎన్నిక..
అనంతరం 12.35 గంటలకు మేయర్ ఎన్నిక జరిగింది. టీఆర్ ఎస్ తరపున మేయర్ గా విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ ప్రతిపాదించారు. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. మేజిక్ ఫిగర్ తో సంబంధం లేకుండా.. సాధారణ మెజారిటీతో.. సభ్యులు చేతులెత్తి మేయర్ను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ సభ్యులు మెజార్టీగా ఉండంతో విజయలక్ష్మి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.

మహిళలు ధైర్యంగా ఉంటారు – మేయర్
మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్గా గెలిచారు. ఎల్ఎల్బీ జర్నలిజం చదివిన విజయలక్ష్మి.. చాలా కాలం అమెరికాలో ఉన్నారు. 2007లో భారత్కు తిరిగొచ్చేశారు. ఎన్నిక తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై హైదరాబాద్ లో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వనని చెప్పారు.