thesakshi.com : గోదావరి జలాలు తెచ్చి.. కొమురవెల్లి మల్లన్న పాదాలు కడిగాం :
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
గోదావరి జలాలు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. చెప్పినట్లుగానే.. నేడు గోదావరి జలాలతో మల్లన్న పాదాలను అభిషేకం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ జీవనాడి మల్లన్నసాగర్ అనీ, ఇది రాష్ట్ర ప్ర‘జల’ హృదయమని, మన ప్రాంతాన్ని జలాలతో అభిషేకం చేసే సాగరమని సీఎం పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును బుధవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంతోపాటు సస్యశ్యామల తెలంగాణను కూడా చూస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమైన ఘట్టమని, ఈ మహాయజ్ఞంలో ప్రని చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
కేవలం మూడేళ్ల కాలంలోనే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 58 వేల మంది కార్మికులు పని చేస్తున్నపుడు కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారి, దాదాపు 600 పైగా కేసులు వేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీర్లు రిటైరైనా కూడా ఈ ప్రాజెక్టు కోసం పని చేశారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారని కొనియాడారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
చివరి రక్తపుబొట్టు ధారపోసైనా సరే.. దేశాన్ని చక్కదిద్దుతా..
‘‘ ఆరునూరైనా సరే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే, ఈ దేశాన్ని చక్కదిద్దుతాను, ముందుకు పోతాను’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందుకోసం దేవుడు నాకిచ్చిన శర్వశక్తులూ ఒడ్డుతానని, సకల మేథోసంపత్తిని ఉపయోగిస్తానని సీఎం అన్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును బుధవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ దేశంలో దుర్గార్మమైన వ్యవస్థ నడుస్తున్నదని, దీంతో దేశం కూడా దారితప్పి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మతకల్లోలాల పేరిట విధ్వంసం సృష్టిస్తూ చిచ్చు పెడుతున్నారని, ఈ దుర్మార్గాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కులాలు, మతాల పేరు మీద చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పరిస్థితులుంటే పరిశ్రమలు రాకుండా, వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉన్నదని సీఎం హెచ్చరించారు. కుల, మత కల్లోలాల క్యాన్సర్‌ను ఈ దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలకు చేటు చేసే వారిని ఎక్కడికక్కడ నిలదీసి ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగు పడాలంటే.. కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
దేశ పురోభివృద్ధి కోసం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి లక్షా 50 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్రతి రోజూ 580 వరకు విమానాలు ల్యాండ్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎక్కడా పోయినా ఎకర భూమి 20 లక్షలకు పైగానే ఉంది. మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. అద్భుతమైన పరిశ్‌మలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో మనసు పెట్టి ముందుకు పోయామని, హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిదని, ముంపునకు గురైన గ్రామాల భూనిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు.
నిర్వాసితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మంజూరు చేయాలి. ఉపాధి కలిపించేలా చర్యలు తీసుకోవాలి అని మంత్రి హరీశ్‌రావుకు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మల్లన్నసాగర్ కేవలం సిద్దిపేట జిల్లాకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.