thesakshi.com : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్ లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన 13.5 లక్షల దర్శన టికెట్లను టిటిడి విడుదల చేసింది. రోజుకు 25 వేల చొప్పున టిక్కెట్లను విడుదల చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. అందుకే శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా టీటీడీ టోకెన్లను విడుదల చేస్తుటుంది. తాజాగా రెండు నెలలకు సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేసింది.
శనివారం జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రెండునెలలకు మొత్తం 13 లక్షల 35వేల దర్శనం టికెట్లను జారీ చేసింది. విడుదలైనగంటలోనే దాదాపు 3లక్షల టికెట్లను భక్తులు బుక్ చేశారు. దాదాపు 10లక్షల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ తెలిపింది.
కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో గతంలోనే మాదిరిగానే భక్తులను అనమతిస్తోంది టీటీడీ. గత నెలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో టోకెన్ లేకపోయినా దర్శనానికి అనుమతించింది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
సర్వదర్శనం టోకెన్లకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ టోకెన్ల విధానాన్ని కూడా ఎత్తివేసి వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి రెండు, మూడు నెలలకు సంబంధించిన టోకెన్లను విడుదల చేస్తోంది.
మార్చినెలలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టోకెన్లను మూడు రోజుల్లో విడుదల చేయగా.. ఈసారి జూలై, ఆగస్టు నెలల టోకెన్లను ఒకేసారి విడుదల చేసింది. ఇక గత నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టోకెన్లను విడుదల చేసింది టీటీడీ, లాటరీ పద్దతిలో భక్తులకు కేటాయిస్తోంది.
ఇదిలా ఉంటే సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలను రద్దు చేసింది. దీని వల్ల సామాన్య భక్తులకు అదనంరా 2గంటల పాటు దర్శనం కల్పించే అవకాశముందని టీటీడీ పేర్కొంది.