thesakshi.com : ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ల సెక్యూరిటీ ఫీచర్లను మెరుగుపరుస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఆ సంస్థ ప్లే స్టోర్ యాప్స్ కోసం కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించింది. ఇప్పుడు ప్లే స్టోర్ ద్వారా ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే మొబైల్ యాప్స్ మన డివైజ్‌లోని సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉండదు.
ఈ సెక్యూరిటీ ఫీచర్లు మే 5 నుంచి అమల్లోకి వస్తాయని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇప్పటి వరకు ఉన్న “Query_All_Packages” పర్మిషన్.. ఇతర యాప్‌లకు డివైజ్‌లోని డేటాను రీడ్ చేసే అవకాశం కల్పిస్తోంది.
అంటే ఇది కస్టమర్ల వ్యక్తిగత అభిరుచులు, ప్రాధాన్యాలకు సంబంధించిన డేటాను యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల కస్టమర్ల ప్రైవసీ దెబ్బతింటోందని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఈ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఇప్పటి నుంచి ఎలాంటి యాప్‌లకు డేటా యాక్సెస్ కోసం అనుమతి ఇవ్వాలనేది గూగుల్ ప్రత్యేకంగా నిర్ణయిస్తుంది. ఇంతకు ముందు ప్లే స్టోర్‌లో నమోదైన అన్ని యాప్‌లకు ఈ అవకాశం ఉండేది. కానీ కొత్త ప్రైవసీ పాలసీలో ఈ పర్మిషన్‌లను మార్చింది.
ఇప్పటి నుంచి గూగుల్ రివ్యూ సిస్టమ్ సంబంధిత యాప్‌లకు అనుమతి ఇస్తేనే.. అవి కస్టమర్ల డివైజ్ డేటాను, ఇతర యాప్‌లకు సంబంధించిన డేటాను రీడ్ చేసే అవకాశం లభిస్తుంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
ప్రస్తుతం కొన్ని రకాల అధికారిక ఫైనాన్స్, బ్యాంకింగ్ యాప్‌లను కొత్త నియమ నిబంధనల నుంచి మినహాయిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. కానీ ఆర్థిక సంస్థలు సెక్యూరిటీ, వెరిఫికేషన్ కోసం గూగుల్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన
అవసరం ఉంది.
ఆండ్రాయిడ్ ఫైల్ సిస్టమ్‌కు యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేని యాప్‌ల జాబితాను గూగుల్ వర్గీకరించింది. పి టూ పి నెట్‌వర్క్‌ను ఉపయోగించే యాప్‌లకు గూగుల్ డేటా రీడింగ్ పర్మిషన్ ఇవ్వదు. కానీ పిటుపి నెట్‌వర్క్ కోసమే పనిచేసే యాప్‌లను గూగుల్ సమీక్షిస్తుంది.
అవసరం అనుకుంటేనే ఆండ్రాయిడ్ ఫైల్ యాక్సెస్ అనుమతిని మంజూరు చేస్తుంది. కొన్ని యాప్‌లు కేవలం డేటాను అమ్ముకునేందుకు మాత్రమే పనిచేస్తాయి.
ఇలాంటి డేటా సెల్లింగ్ యాప్‌లకు గూగుల్ డేటా యాక్సెస్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఏదైనా ఒక యాప్ పనితీరుకు కస్టమర్ల డేటా అవసరం లేదని భావిస్తే.. వాటికి ఫైల్ యాక్సెస్‌ను గూగుల్ నిషేధిస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో నమోదైన యాప్‌లు డివైజ్‌లోని మెస్సేజ్‌లు, కాల్ లాగ్‌ను రీడ్ చేయడానికి గూగుల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ వినియోగదారుల డేటా గోప్యతకు (ప్రైవసీ) భరోసానిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా వినియోగదారులను మోసం చేసే బ్లోట్ వేర్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి మినహాయించే అవకాశం కూడా కలుగుతుంది.