thesakshi.com : గత కొన్ని నెలలుగా కరోనా నివారణ వ్యాక్సినేషన్ ఎగుమతులను నిషేధించిన భారత ప్రభుత్వం ఇప్పుడు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి దేశం నుంచి మళ్లీ ఈ వ్యాక్సిన్లు ఎగుమతి కానున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నెలకు ముందే దేశం నుంచి కొన్ని కోట్ల వ్యాక్సిన్ డోసులు ఎగుమతి అయ్యాయి. రెండో వేవ్ ను పట్టించుకోకుండా కేంద్రం విదేశాలకు వ్యాక్సిన్లను పంపిందంటూ తీవ్ర విమర్శలు ఆ తర్వాత వచ్చాయి. ఆ వ్యాక్సిన్ డోసులను మహారాష్ట్ర వంటి చోట వాడి ఉంటే.. రెండోవేవ్ అంత తీవ్ర రూపం దాల్చేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.
అలాగే మే నెల నుంచి ప్రజలు వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. అయితే అవసరమైన స్థాయిలో అందుబాటులో లేకపోయింది. దీంతో వ్యాక్సినేషన్ పాలసీ విషయంలో మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. ప్రజలకూ వ్యాక్సిన్ పట్ల ఇప్పుడు పెద్దగా ఆసక్తి లేకుండా పోతోంది. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల అనాసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున డోసులు మిగులుతున్నాయి కూడా. అలాగే ఉత్పత్తి కూడా పెరిగింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఎగుమతులకు కేంద్రం రెడీ అవుతోంది.
అక్టోబర్ నుంచినే మన దేశం నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో అమెరికా ఒత్తిడి కూడా ఉంది. ఇటీవలే అమెరికా ఈ విషయంలో భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చింది. కరోనా నివారణ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న ఇండియా వాటిని కొంతమేర ఎగుమతి కూడా చేయాలంటూ అమెరికా సూచించింది. వెంటనే భారత ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం విశేషం.
అయితే దేశంలో ఇప్పటి వరకూ 80 కోట్ల వ్యాక్సిన్ డోసులను వాడినట్టుగా కేంద్రం చెబుతోంది. వయోజనులందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ జరగడం అంటే.. 190 కోట్ల డోసులు కావాలి. అయితే ఇప్పటి వరకూ అందులో సగం టార్గెట్ కూడా పూర్తి కాలేదని స్పష్టం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ ఎగుమతికి రెడీ అవుతోంది.
వచ్చే నెల నుంచి నెలకు ముప్పై కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం చెబుతోంది. రానున్న మూడు నెలల్లో వంద కోట్ల డోసులు రెడీ అవుతాయని కూడా అంచనా వేస్తోంది. ఆ మేరకు అందులో కొంత భాగాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం రెడీ అయినట్టుగా ఉంది.