THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ: గల్లీ రౌడీ

thesakshiadmin by thesakshiadmin
September 18, 2021
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ: గల్లీ రౌడీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   చిత్రం : ‘గల్లీ రౌడీ’

నటీనటులు: సందీప్ కిషన్-నేహాశెట్టి-రాజేంద్ర ప్రసాద్-బాబీ సింహా-వెన్నెల కిషోర్-శివన్నారాయణ-మీమ్ గోపి-నాగినీడు-పోసాని కృష్ణమురళి-వైవా హర్ష తదితరులు
సంగీతం: సాయికార్తీక్-రామ్ మిరియాల

ఛాయాగ్రహణం: సుజాత సిద్దార్థ్
కథ: భాను భోగవరపు
మాటలు: నందు
స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వరరెడ్డి-కోన వెంకట్
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

మంచి హిట్టు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈసారి ‘గల్లీ రౌడీ’ అవతారం ఎత్తాడు. ఇంతకుముందు సందీప్ తో ‘తెనాలి రామకృష్ణ’ తీసి నిరాశ పరిచిన జి.నాగేశ్వరరెడ్డి ఈసారి కోన వెంకట్ సహకారంతో ‘గల్లీ రౌడీ’ని తీర్చిదిద్దాడు. టీజర్.. ట్రైలర్లలో మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వాసు (సందీప్ కిషన్) వైజాగ్ లో ఓ పెద్ద మనిషికి మనవడు. బైరాగి (మీమ్ గోపి) అనే రౌడీ చేస్తున్న అరాచకాల్ని అడ్డుకోబోయిన వాసు తాత అతడి చేతుల్లో అవమాన పడటంతో మనవడిని పెద్ద రౌడీగా తయారు చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. వాసుకు మాత్రం రౌడీ కావడం ఇష్టముండదు. తాను ఇష్టపడ్డ సాహిత్య (నేహా శెట్టి) కోసం వాసు రౌడీ అవతారం ఎత్తుతాడు. సాహిత్య కుటుంబం ఇబ్బందుల్లో ఉండటం చూసి.. బైరాగిని కిడ్నాప్ చేయడానికి కూడా రెడీ అవుతాడు. కానీ ఈ కిడ్నాప్ ప్రయత్నాల్లో ఉండగానే బైరాగిని ఎవరో చంపేస్తారు. దీంతో వాసు.. సాహిత్య కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడతారు. మరి ఈ సమస్య నుంచి వీళ్లెలా బయటపడ్డారు.. ఇంతకీ బైరాగిని చంపిందెవరు అన్నది మిగతా కథ

కథనం-విశ్లేషణ:

గల్లీ రౌడీ’ టైటిల్ కార్డ్ పడేటపుడు.. ముందు 80.. 90 దశకాల్లో వచ్చిన రంగూన్ రౌడీ.. రౌడీ అల్లుడు.. రౌడీ ఇన్ స్పెక్టర్.. లాంటి సినిమాల టైటిళ్లు చూపించి చివర్లో ఈ సినిమా పేరు వేస్తారు. అప్పటికిది బాగానే అనిపిస్తుంది కానీ.. ‘‘ఇది ఈనాటి సినిమా కాదు’’ అని ఈ టైటిల్స్ ద్వారా దీని మేకర్స్ పరోక్షంగా ఇచ్చిన హింట్ సినిమా కొంచెం ముందుకు కదిలాక కానీ అర్థం కాదు. ఒక గూండా తనను అవమానించాడని ప్రతీకారం కోసం మనవడిని రౌడీలా తయారు చేయాలనుకోవడం.. అతను ముందు తేలిగ్గా తీసుకుని.. ఆ తర్వాత తన కుటుంబానికి ఆ గూండా చేసిన నష్టం తెలుసుకుని సీరియస్ గా రివెంజ్ పూర్తి చేయడం.. ఇదీ సింపుల్ గా ‘గల్లీ రౌడీ’ కథ. ఈ ఫార్మాట్లో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కల్లో చెప్పడం కష్టం. కథ పాతదైనా కథనమైనా కొత్తగా.. ఎంగేజింగ్ గా ఉందా అంటే అదీ లేదు. కామెడీ పేరుతో ఇందులో పెట్టిన సన్నివేశాలు.. పేల్చిన డైలాగుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎన్నో సినిమాలు చూసిన సన్నివేశాలనే తిప్పి తిప్పి చూపించి.. ఎక్కడా జెన్యూన్ లాఫ్స్ అన్నవే లేకుండా ఆద్యంతం అసహనానికి గురి చేస్తుంది ‘గల్లీ రౌడీ’.

‘గల్లీ రౌడీ’ సినిమాను ఎంత సిల్లీగా తీశారో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఇందులో హీరో తండ్రిగా కనిపించేది ప్రకాష్ రాజ్. అలాగని ఆయనేమీ ఈ సినిమాలో నటించలేదు. బడ్జెట్ ప్రాబ్లెమో ఏమో తెలియదు మరి. కేవలం ఫొటోలో మాత్రమే కనిపిస్తారు. ఆయన్ని విలన్ చంపించే షాట్ ఒకటి ఇందులో వేశారు. అదేమీ ఈ సినిమా కోసం చిత్రీకరించింది కాదు. ‘దూకుడు’ సినిమాలో ప్రకాష్ రాజ్ కారును లారీతో గుద్దించే సీన్ తీసుకొచ్చి ఇక్కడ వాడేశారు. ఏదో కామెడీ కోసం ఇలా ఒక షాట్ తీసుకొచ్చి పెట్టుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో హీరో తన తండ్రిని చంపినందుకు విలన్ మీద చాలా సీరియస్ గా ప్రతీకారం కూడా తీర్చేసుకుంటాడు. ‘దూకుడు’ సినిమాలో చూసిన షాట్ ను ఇలా వాడుకున్నాక.. హీరో రివెంజ్ ను ప్రేక్షకులు ఎంత సీరియస్ గా తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఔట్ డేటెడ్ విషయాలు ‘గల్లీ రౌడీ’లో చాలానే ఉన్నాయి.

‘గల్లీ రౌడీ’ సినిమా మొదలు కాగానే హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలెడతాడు. విలన్ తో తన కుటుంబానికి ఉన్న వైరం గురించి వివరించి.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలనుకున్న తనను ఎలా బలవంతంగా రౌడీని చేసింది వివరిస్తాడు. ఈ సందర్భంగా బ్యాగ్రౌండ్లో ‘తమ్ముడు’ సాంగ్ వేసి అందులో పవన్ కళ్యాణ్ మాదిరి హీరోను ట్రైన్ చేయడం చూపిస్తుంటే ఇలాంటి స్పూఫులతో అయినా సరే.. సినిమా ఫన్నీగా ఉంటుందేమో అన్న ఆశలు పుడతాయి. కానీ అంత బిల్డప్ తర్వాత హీరోకు రౌడీగా తొలి టాస్క్ ఇస్తే అతను సింపుల్ గా సైడైపోవడంతో ఉత్సాహం అంతా చల్లారిపోతుంది. ఆ తర్వాతి సీన్లోనే హీరోను ఇలా చూడ్డం.. అలా ప్రేమలో పడిపోవడం.. తన కోసం ఫైటింగ్ చేయడం.. ఇలా రొటీన్ ఫార్మాట్లోకి వెళ్లిపోతుంది ‘గల్లీ రౌడీ’. ఇక హీరోయిన్ ఫ్యామిలీకి చెందిన స్థలాన్ని విలన్ కబ్జా చేయడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు పూర్తిగా సినిమా మీద ఆసక్తిని తగ్గించేస్తాయి. ఐతే విలన్ని కిడ్నాప్ చేయడానికి హీరోయిన్ ఫ్యామిలీతో హీరో రెడీ అయి.. ఆ కిడ్నాప్ ప్లాన్ అమలు చేసే దగ్గర ‘గల్లీ రౌడీ’ తొలిసారి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఒక్కటి సినిమాలో ఎంగేజ్ చేసేలా తీర్చిదిద్దారు.

కిడ్నాప్ కోసం వెళ్లిన వాళ్లు మర్డర్ కేసులో ఇరుక్కోవడం.. వీళ్లు వదిలిన సాక్ష్యాలు పరమ కిరాతకుడైన పోలీస్ చేతికి చిక్కడంతో ఇక్కడి నుంచి కథనం ఉత్కంఠభరితంగా మారుతుందని ఆశిస్తాం. కానీ ద్వితీయార్ధమంతా సిల్లీ సీన్లతో లాగించేశారు. బాబీ సింహా పాత్రను పరిచయం చేస్తూ ఇచ్చిన బిల్డప్ అయితే మామూలుగా లేదు. కానీ తర్వాతి సీన్ నుంచే ఆ పాత్రను తేల్చిపడేశారు. ఇలాంటి మామూలు పాత్రను అతనెందుకు చేశాడన్నది అర్థం కాని విషయం. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ ఇంకెప్పుడు క్లైమాక్స్ వస్తుందనే ఎదురు చూపుల్లోకి వెళ్లేలా చేస్తుంది ద్వితీయార్ధం. వెన్నెల కిషోర్ పాత్ర ప్రవేశించాక ఒక ఐదు నిమిషాలు మినహాయిస్తే సెకండాఫ్ లో ఎంగేజ్ చేసే సీనే లేదు. అతడి మెరుపులు కూడా కాసేపే. తర్వాత ఆ పాత్రనూ పక్కన పడేశారు. ఈ పాత్రను పక్కన పెడితే మిగతా వాటితో కామెడీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. ఇటు క్రైమ్ డ్రామాలో ఉత్కంఠ లేక.. ఇటు కామెడీ కూడా పండక ‘గ్లీ రౌడీ’ రెంటికీ చెడ్డట్లయింది. క్లైమాక్స్ లో సైతం మెరుపులేమీ లేవు. చివర్లో రివీలయ్యే ట్విస్టులోనూ ఏ విశేషం లేదు. మొత్తంగా చూస్తే సినిమా అంతా హడావుడి తప్ప కామెడీ వర్కవుట్ కాలేదు. పాత చింతకాయ పచ్చడి కథాకథనాలు.. సిల్లీ సీన్లు ‘గల్లీ రౌడీ’ని నీరుగారిపోయేలా చేశాయి.

నటీనటులు:

గల్లీ రౌడీగా సందీప్ కిషన్ ఓకే అనిపించాడు. వాసు పాత్రలో అతడి లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. కానీ అతను నటన పరంగా ప్రత్యేకంగా ఏమీ చేయడానికి ఈ పాత్ర అవకాశం ఇవ్వలేదు. సందీప్ ఏం చూసి ఈ కథ ఒప్పుకున్నాడన్నది అర్థం కాని విషయం. హీరోయిన్ నేహా శెట్టి చాలా సాధారణంగా కనిపించింది. గ్లామర్.. నటన రెండింట్లోనూ ఆమె అంతగా ఆకట్టుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర.. నటన చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఇలాంటి పాత్రలు లెక్కలేనన్ని చేశారు. ఇక ఇలాంటివి ఆపేస్తే బెటర్ అనిపిస్తుంది. విలన్ పాత్రలో మీమ్ గోపి.. పోలీస్ పాత్రలో చేసిన బాబీ సింహా టాలెంట్ ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ రెండు పాత్రలకు ఆరంభంలో తెగ బిల్డప్ ఇచ్చి తర్వాత తేల్చి పడేశారు. వెన్నెల కిషోర్ కాసేపు నవ్వించాడు. అతణ్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. వైవా హర్ష.. పోసాని.. నాగినీడు ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘గల్లీ రౌడీ’ ఏమంత ఇంప్రెస్ చేయదు. సాయికార్తీక్.. రామ్ మిరియాల అందించిన పాటల్లో ఏవీ అంత ప్రత్యేకంగా లేవు. పుట్టెనే ప్రేమ కాస్త పర్వాలేదు. నేపథ్య సంగీతం చాలా లౌడ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది చాలా చోట్ల. సుజాత సిద్దార్థ్ ఛాయాగ్రహణంలోనూ ఏమంత విశేషం లేదు. నిర్మాణ విలువలు ప్రమాణాలకు తగ్గట్లు లేవు. ఒక ఔట్ డేటెడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి ప్రొడక్షన్ వాల్యూస్. భాను భోగవరపు అందించిన కథ చాలా రొటీన్. నందు మాటలు కూడా అంతే. ‘‘మా డెత్ లు ఏమైనా రైల్వే బెర్తులా వాడు కన్ఫమ్ చేయడానికి’’.. ఈ డైలాగ్ సినిమా ఏ తరహాలో నడుస్తుందనడానికి ఒక ఉదాహరణ. కోన వెంకట్ పూర్తిగా టచ్ కోల్పోయాడనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. నాగేశ్వరరెడ్డితో కలిసి ఆయన అందించిన స్క్రీన్ ప్లే చాలా పాత స్టయిల్లో నడుస్తుంది. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం గురించి చెప్పడానికేమీ లేదు. ఆయన నరేషన్ ఈ రోజులకు సూటవ్వదు.

చివరగా: గల్లీ రౌడీ.. పాత కామెడీ పచ్చడి

రేటింగ్-2.5/5

Tags: # Posani Krishna Murali# Vennela Kishore#Bhanu Bhogavarapu#Bobby Simha#Cinematography Sujatha Siddharth#Editor Chota K Prasad#FILM NEWS#Gully Rowdy#Gully Rowdy Review#Music Sai Karthik#MVV Cinema and Kona Film Corporation#Neha Hariraj Shetty#Producers MVV Satyanarayana#Rajendra Prasad#Screenplay-Direction G Nageswara Reddy#Sundeep Kishan#TELUGU CINEMA#TOLLYWOOD#Viva HarshaCVNanduRam Miriyala
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info