THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఉగాది రోజును ఎలా గడపాలి?

thesakshiadmin by thesakshiadmin
April 2, 2022
in Latest, Politics, Slider
0
ఉగాది రోజును ఎలా గడపాలి?
0
SHARES
41
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :    మానవ జీవనం కాలాధీనం. పుట్టుకనుండి మొదలుకొని పుడమి గర్భంలో కలిసేదాకా మనిషి కాలంతోనే ప్రయాణించాలి. కాల సముద్రాన్ని ఈదాలి. కాలశిఖరాన్ని అధిరోహించాలి. కాలగమ్యాన్ని చేరుకోవాలి. కాలం అనే వంతెన మీదుగానే కలకాలం ప్రయాణించాలి. ఇదే మానవ జీవన సత్యం.

భారతీయ కాలమానం ప్రకారం అరవై సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం పునరావృతమౌతుంది. ప్రభవనామ సంవత్సరం నుండి ప్రారంభమయ్యే సంవత్సర చక్రం అక్షయనామ సంవత్సరం వరకు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అరవై సంవత్సరాలపాటు జీవించే మనిషి ‘షష్టిపూర్తి’ చేసుకుంటాడు. అసలు మానవుని సంపూర్ణమైన ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. అందులో సగం పూర్తయితే అరవై సంవత్సరాలు నిండుతాయి. ఇలా కాల (సంవత్సర) చక్రం రెండుసార్లు తిరిగేదాక జీవించిన మనిషి సంపూర్ణాయుష్యంతో బ్రతికినవాడుగా కీర్తింపబడుతాడు. కనుక సంవత్సరాత్మక కాలానికి మనిషి జీవితంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది.

ప్రతి ఏడాదీ చైత్రమాసం తొలి రోజుతో సంవత్సరం ప్రారంభమౌతుంది. చైత్రమాసంలో ప్రకృతిలో వసంతం వెల్లివిరుస్తుంది. చెట్లు చిగురిస్తాయి. పచ్చని ఆకులు నేత్రపర్వం చేస్తాయి. కోకిలలు కూస్తాయి. ప్రకృతిలో కొత్తదనం పరచుకొంటుంది. నవవికాసం అంతటా ఆవిష్కృతమౌతుంది. మానవజీవితం వసంతంలాగే వికాసశీలం. చిగురు పుట్టుకకు, కాయలు ఎదుగుదలకు, పండ్లు అనుభూతులకు, కోకిల కూతలు మంగళధ్వనులకు సంకేతాలు. కనుక మానవజీవనం ప్రతినిత్య వసంతమే.

చైత్రమాసంలోని ప్రథమ దినాన్ని ఉగాది అనీ, యుగాది అనీ, సంవత్సరాది అనీ పిలవడం పరిపాటి. యుగం అంటే యోగం. మనిషి బ్రతుకు కాలంతో ముడివడి ఉండడమే యోగం. అలాంటి యోగానికి తొలినాడు కావడంవల్ల ‘యుగాది’ అనే పేరు ఈ పండుగకు సార్థకం.

మానవ జీవితం అనేక రుచుల కలయిక. అన్ని రుచులు కలిస్తేనే మనిషి శరీరం సమగ్ర వికాసాన్ని అందుకొంటుంది. మనస్సు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాదినాడు ఆరు రుచుల పచ్చడిని ప్రసాదంగా ఆరగిస్తారు. మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు మానవ జీవితంలో సహజ రుచులే. వీటిని సమన్వయం చేసుకొని అనుకూలంగా రంగరించుకొని ప్రయాణించడమే జీవనం. ఆశలు చిగురులవంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలని కోరుకోవడమే జీవన వసంతం. ఎల్లప్పుడూ మంగళధ్వనులనే వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిలకూత.ఇలా ఉగాది పండుగ మనిషి బ్రతుకులో కీలకంగానూ, మూలకంగానూ ఆవిర్భవించింది.

‘ఉగాది’ పండుగనాడు ఉషస్సులోనే మేల్కొని అభ్యంగన పుణ్యస్నానాలను ఆచరించాలి. నూతన వస్త్రాలను ధరించాలి. ఇష్ట దేవతలను ఆరాధించాలి. దేవాలయాలను సందర్శించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. ఆరు రుచుల పచ్చడిని ఆరగించాలి. ఇదీ సంప్రదాయం.

ఉగాదినాడు పంచాంగ శ్రవణానికి ప్రత్యేకత ఉంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాలను ప్రతినిత్యం అనుసరిస్తూనే మనిషి తన జీవితానికి కావలసిన శుభకర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఏ పనిచేసినా మంచిగా చేయాలి. మంచి ఫలితాలను సాధించాలి. అందరికీ మంచిని పంచాలి. ఇదే పండుగలోని పరమార్థం. ఉగాదినాడు చేసే పంచాంగ శ్రవణంలో అనంతమైన కాలంలో మానవుల ఉనికినీ, కాలగణననూ, కాలంలోని గుణదోషాలనూ తెలిపే అంశాలెన్నో ఉన్నాయి. కనుక పంచాంగాన్ని తెలుసుకోవడం ఈ పండుగనాడు అవశ్య విధి.

‘పంచాంగశ్రవణం’ ఎంతటి భాగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుపుతోంది ఈ ప్రాచీన శ్లోకం-

‘శ్రీకల్యాణగుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణామ్‌
ఆయుర్‌వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్‌’

ఓ మానవులారా! పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. సకల మంగళాలనూ ప్రసాదిస్తుంది. ఎన్నో గుణాలను అందిస్తుంది. శత్రువులను దూరం చేస్తుంది. పీడకలలను రాకుండా చేస్తుంది. దోషాలను తగ్గిస్తుంది. గంగాది పుణ్య నదులలో స్నానం చేసినంతటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. గోవులను దానం చేసినంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆయుష్యాన్ని పెంచుతుంది. ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తుంది. అనేక శుభాల ను అందిస్తుంది. చక్కని సంతా నాన్ని అందిస్తుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చడం ద్వారా అనేక ఫలితాలను అందిస్తుంది. కనుక పంచాంగాన్ని వినడం, చదవడం మనిషికి సముచితం. పంచాంగాన్ని తప్పక వినండి’ అని ఈ శ్లోకంలోని భావం.

ఇంతటి గొప్పతనాన్ని మనిషికి అనుగ్రహించే ఉగాది పండుగ అందరికీ ఆనందదాయకమే. తెలంగాణ జనపదాలలో ఉగాది పండుగనాడు నూతన వ్యాపారాలను ప్రారంభించడం, అభ్యుదయ కర్మలను ఆచరించడం, వ్యవసాయానికి ఉప యోగపడే సాధనాలను పూజించడం, పశువులను, బండ్లను అలంకరించి ఊరేగించడం, మామిడి ఆకులతో మంగళ తోరణాలను ఇంటింటికీ కట్టుకోవడం కనబడుతుంది. కుటుంబసభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ కలిసి భోజనం చేయడం, విందులూ, వినోదాలతో కాలక్షేపం చేయడం పరిపాటిగా కనబడుతుంది.

ఉగాది రోజును ఎలా గడపాలి?

మనం తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించాక, ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదువ ఆయురారోగ్యా శ్వర్యాలతో ఉండవలసిందని దీవిస్తూ మన మీద అక్షతల్ని వేసి తలకు (మాడు మీద) నువ్వుల నూనెను పెట్టాలి.

ఆ మీదట మనం ఒంటరిగా నువ్వుల నూనెని రాసుకుని, ఒక గంటసేపు నూనెతో నానాక సున్నిపిండితో తలంటు పోసుకోవాలి. నూనెతో నానే సమయంలో వ్యాయామం గానీ, దైవస్తోత్రాలుగాని రెండూగానీ చేసు కోవచ్చు. అభ్యంగన స్నానమయ్యాక నిత్యం మనం చేసుకునే పూజ ముగించుకుని దైవమందిరంలో ఉన్న అక్షతల్ని ఇంట్లో ఉన్న పెద్దవారికిచ్చి, వాళ్లకు పాదాభివందనం చెయ్యాలి. పసుపుబొట్టు పెట్టిన కొత్తబట్టల్ని మనకిస్తూ ఆశీర్వ దించాలి- వాళ్లు. మనం కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి అంతకు ముందే నైవేద్యం పెట్టిన వేపపూవు పచ్చడిని ఆరగించాలి.

సరిగా ఈ సమయానికి గుళ్లోనో లేక మరో ప్రదేశంలోనే పంచాంగ పఠనం ప్రారంభమవుతుంది. సంవత్సరంలో ‘మన జీవితం, మనల్ని పరిపాలించే పాలకుల రాజ్యం, మననందరినీ పరిపాలించే ఆ భగవానుని అభి ప్రాయం’ ఎలా ఉందో ఆ విషయమంతా దీనిద్వారా తెలుసుకోగలుగుతాం.

మనం చేసిన పాప పుణ్యాల కనుగుణంగా మనకు రావాల్సిన లాభనష్టాల్ని గమ నించిన భగవంతుడు, లాభాల్ని కల్గించేందుకు శుభగ్రహాలనూ, నష్ట పెట్టేందుకు అశుభగ్రహాలనూ నాయ కులుగా నియమిస్తూ కొత్త సంవత్సరాన్ని నిర్మిస్తాడు.

ఇంతకీ ఇలా అన్నిటికీ ప్రథమమైన ఉగాదినాడు శుభాకాంక్షలు ఇలా తెలపాలని మన పెద్దలు మనకు చెప్పారు. ‘ప్రజలందరికీ సుఖం కలుగుగాక! పరిపాలకులు న్యాయ మార్గంలో పాలింతురు గాక! హోమాలు చేయడానికై పాలనిచ్చే గోవులవల్లా- భూమిని దున్ని పంటనిచ్చే ఎద్దుల వల్లా-ఆవులవల్ల వచ్చే పాలనూ, ఎద్దులవల్ల వచ్చిన ధాన్యాన్నీ యజ్ఞంలో వినియోగించే వేదవేత్త అయిన బ్రాహ్మ ణుని వల్లా దేవతలు తృప్తిపడి సమస్తలోకాలనీ చల్లగా చూతురుగాక! సకాలంలో వర్షాలు పడునుగాక! భూమినిండా అందరికీ సంతానమూ ఉండుగాక! సంపదలేనివారికి సంపదలు కలిగి, దేశమంతా శాంతిమంతమై ఉండుగాక! ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండుదురుగాక! రాజులు నిర్భ యంగా తమ పరిపాలన చేయుదురుగాక!’- అనేవి మహర్షు లిచ్చిన శుభాకాంక్షలు.

పైగా శుభాకాంక్షలనగానే ఉగాది రోజున ఉదయాన్నే లేచి తల్లి దీవెన పొందుతూ మాడు (బ్రహ్మరంధ్రం) పైన నూనె పెట్టించుకుని తల్లికీ తండ్రికీ నమస్కరించి, తలంటుపోసుకుని కొత్త బట్టలు ధరించి దైవదర్శనం చేస్తే, తమ సంతానంమీద ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు ఫలిస్తాయి. పిల్లలబుద్ధి వికసిస్తుంది. కూడా! – ఇది ఋషులు చెప్పిన నిజం అనుభవంలో ఉన్న సత్యం!

Tags: #festival#telugupeople#ugadi#ugadifestival
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info