thesakshi.com : రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు హైకోర్టు ధిక్కార కేసులో పడుతున్న జైలు శిక్షల్ని నిశితంగా గమనిస్తే ఇందులో వారి నిర్లక్ష్యం కంటే కూడా ఉద్దేశపూర్వక ధిక్కారమే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా వ్యవహారాల్లో తాము చెప్పినట్లే వినాలని ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు ఇస్తోంది. తమ మాట వినకపోతే ఎక్కడ మంచి పోస్టింగ్ లు పోతాయన్న భయం ఓవైపు, హైకోర్టు కంటే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే కెరీర్ బావుంటుందనే ధోరణితో వారంతా ఇలా ధిక్కారానికి సైతం తెగిస్తున్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే బిజినెస్ రూల్స్ స్పష్టంగా ఉన్నా వాటిని లెక్కచేయకుండా ఐఏఎస్ అధికారులు ఇలా హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడం అయితే జరగదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఐఏఎస్ ల పనితీరు కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది.
తాజాగా వ్యవసాయ శాఖలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో విఫలమైన ముగ్గురు ఐఏఎస్ అధికారులు వీరపాండియన్, పూనం మాలకొండయ్య, అరుణ్ కుమార్ లకు హైకోర్టు జైలుశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురికి ఓ ధిక్కార కేసులో నెల రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 వేల రూపాయల చొప్పున జరిమానా కూడా విధిస్తూ నిన్న ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐఏఎస్ లకు పడుతున్న జైలుశిక్షలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జైలు శిక్షలు పడిన తర్వాత మాత్రం హైకోర్టును బతిమాలుకుని ఆయా ఐఏఎస్ అధికారులు బయటపడేందుకు ప్రయత్నిస్తుండటం ఇక్కడ మరో విశేషం.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టు ధిక్కార కేసులో జైలుశిక్షలు పడుతున్న అధికారుల చిట్టా అంతకంతకూ పెరుగుతోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ ల తీరు చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి ఐఏఎస్ ల విషయంలో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందిస్తోంది. అంతిమంగా ఇప్పటివరకూ దాదాపు 15 మంది ఐఏఎస్ లపై హైకోర్టు జైలు శిక్షలు విధించింది. కొన్నింటిలో ఆ తర్వాత మార్పులు చేసింది. తాజాగా మరో ముగ్గురు ఐఏఎస్ లపై విధించిన జైలు శిక్ష కలకలం రేపుతోంది.
ఏపీలో ఐఏఎస్ ల హైకోర్టు ధిక్కారం పెరుగుతోంది. గతంలో హైకోర్టు ఓ ఆదేశఁ జారీ చేస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని అమలుచేసేందుకు ముందుకు రావడంలేదు. ఇలాంటి కొందరు అధికారులు హైకోర్టు ధిక్కార కేసులో ఎదుర్కోవడమే కాకుండా వాటిలో జైలు శిక్షలు కూడా విధించే పరిస్ధితి తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం వారి కింద పనిచేసే అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకుండా, వాటిపై హైకోర్టు నుంచి స్పష్టత కూడా కోరకుండా, వాటిని అమలు చేసేందుకు అదనపు గడుపు కూడా కోరకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం కొరడా ఝళిపిస్తోందిు. ఇప్పటికే దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ధిక్కార కేసులు నమోదు చేసి జైలు శిక్షలు కూడా విధించింది. ఇందులో తాజాగా నిన్న ధిక్కార కేసులో శిక్ష పడిన ముగ్గురు ఐఏఎస్ లు కూడా ఉన్నారు. వీరిలో రాష్ట్రంలో వివిధ కీలక హోదాల్లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య వంటి వారు కూడా ఉండటం విశేషం.