thesakshi.com : జగన్ఏది నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నమ్ముతున్నారు. అంతా తనతోనే అన్నదే ఆ నమ్మకం. తనను చూసి జనాలు ఓటేస్తున్నారు. తనను చూసే అధికారం అప్పగించారు. తనకూ జనాలకు మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది. ఈ రకమైన ఆలోచనల వల్లనే ఆయన అంతా లైట్ తీసుకుంటున్నారా అన్న సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
నిజమే వర్తమాన రాజకీయాల్లో చూస్తే ముఖ్యంగా ఏపీలో జగన్ కి పొలిటికల్ గా చరిష్మా బాగా ఉంది. జగన్ తో పోటీ పడగలవారు ఈ చరిష్మా విషయంలో ఈ రోజుకీలేరు. చిత్రమేంటి అంటే ఏపీలో మూడేళ్ల పాలన ముగిసాక జనాలకు వైసీపీ సినిమా ఏంటో అర్ధమయ్యాక కూడా జగన్ మంచోడే అంటున్నారు. ఆయన సీఎం గా ఓకే. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వారిదే తప్పు అన్నట్లుగా జనాల మూడ్ ఉంది.
ఆ రకమైన నివేదికలు ముఖ్యమంత్రి సర్వేలలో కూడా వచ్చాయట. ఆయన పాత మంత్రులతో చివరిసారిగా నిర్వహించిన క్యాబినేట్ మీటింగులో కూడా ఈ సర్వేల గురించే చర్చించారు. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు వారి నియోజకవర్గాల్లో పార్టీని చక్కదిద్దాలని మంత్రులను ఆయన కోరడం కూడా అందుకే. అలాగే కొందరి మంత్రుల విషయం కూడా పనితీరు బాలేదు అని ఆయన భావించినట్లున్నారు. అందుకే ఈ విస్తరణ మంత్రం.
అంటే రేపటి ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీని ముందు గాడిలో పెడితే జగన్ బొమ్మతోనే 2024లో గెలవవచ్చు అన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని అర్ధమవుతోంది. ఇక తొలి విడత మంత్రివర్గం తీసుకున్నా మలివిడత మంత్రివర్గం సంగతి చూసినా చాలా మంది కొత్తవారికి జగన్ కీలకమైన పదవులు ఇచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వంటి శాఖలను కూడా ఇచ్చారు. ఇంతకు ముందు కీలకమైన శాఖలలో పనిచేసిన వారు మాజీలు కాగానే ఆ వెలుగు కనిపించడంలేదు అంటే ఆ వెలుగు జగన్ ఆయన పవర్ అని అర్ధం.
రేపటి రోజున ఎంత మంది పదవులు నిర్వహించినా జగన్ వెలుగు ప్రసరించకపోతే చీకటే. మరి అలా అంతా తానుగా జగన్ పార్టీని ప్రభుత్వాన్ని డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారా అంటే ఆలోచిస్తే అదే నిజమేమో అనిపిస్తోంది. ఇక్కడ ఒక్కటి మెచ్చుకోవాలి. అది జగన్ ఆత్మవిశ్వాసం. వచ్చే ఎన్నికల్లో కూడా తానే గెలుస్తాను అని బలంగా నమ్ముతున్నారు.
అంతే కాదు తనకు ఎవరూ ఏపీలో పోటీలో లేరని కూడా ఆయన విశ్వసిస్తున్నారు. ఇక చంద్రబాబుకి ఇవి చివరి ఎన్నికలు అని బలంగా భావిస్తున్నారు. ఆయన్ని ఈసారి కూడా ఓడిస్తే ఇక తనకు ఏపీ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగే లేకుండా పోతుంది అని జగన్ స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉన్నారు.
రాజకీయ నాయకులకే కాదు ఎవరికైనా నమ్మకం అవసరం. ఆత్మ విశ్వాసం లేకపోతే ఏ రంగంలో అయినా ఇబ్బందే. ఇక ఏపీలో చూస్తే జగన్ లాగానే అతి విశ్వాసంతో అప్పట్లో ఎన్టీయార్ ఉండేవారు. ఆయన కూడా అహం బ్రహ్మస్మీ అన్న విధంగానే తానే అన్నీ అనేవారు. కానీ ఎన్టీయార్ రాజకీయం ఎలా సాగిందో చరిత్ర పుటలు తిరగేస్తే అర్ధమవుతాయి.
జగన్ రాజకీయంగా చూస్తే యువకుడు. చేయగలిగితే దశాబ్దాల పాటు రాజకీయాలను ఆయన ఒడిసిపట్టగలరు. కానీ ఆయన సైతం అంతా తానే అన్న భావనతో ఉన్నారు. జనాల మనసు తనకే తెలుసు అని అనుకుంటున్నారు. మరి ఆయన అంచనాలు కరెక్టో కాదో 2024 ఎన్నికలు చెబుతాయి.