thesakshi.com : మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరెవరరూ బెర్త్‌లు కోల్పోనున్నారు..? కొత్తగా అవకాశం దక్కించుకునేవారు ఎవరనేదానిపై వైసీపీ సర్కిల్స్‌లో తెగ చర్చ సాగుతుంది. మంత్రివర్గంలో నుంచి ఉద్వాసన తప్పదేమోనని చాలా మంది మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడుతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడే ఆ దిశలోనే మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు తెలిపాయి.
అంతకుముందు వైఎస్ఆర్‌ఎల్పీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇక మంత్రి వర్గంలో మార్పులపై మరోసారి స్పష్టత ఇచ్చారు జగన్. కేబినెట్‌లో నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, అలాగే రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మీరు గెలిచి, పార్టీని గెలిపించుకుని రావాలని.. అప్పుడు మళ్లీ అవకాశాలు వస్తాయని అన్నారు.
రెండు సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోందని చెప్పారు. ఎవరు పనితీరు చూపించకపోయినా సరే.. ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇంటింటికి వెళ్లకపోతే సర్వేల్లో పేర్లు రావని హెచ్చరించారు. సర్వేల్లో రాకపోతే.. మొహమాటం లేకుండా టికెట్లు ఇవ్వబోనని తేల్చిచెప్పారు.
మూడు రోజుల్లోనే మంత్రులుగా ఎవరుంటారు.. ఎవరు పదవులు కోల్పోతారనే దానిపై స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయాల్సి వస్తోంది. ఒకరిద్దర్ని కూడా ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది.. ఇలా అన్ని విషయాల్లో మంత్రులకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో ఏ అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలి.. ప్రతిపక్షాలను ఎదుర్కొనాలి.. ఇలా అన్ని విషయాల్లోనే మాజీలు అవుతున్న మంత్రులకు.. కొత్తగా ఎంపిక అవుతున్న మంత్రులకు ఆయనే స్వయంగా దిశా నిర్దేశం చేయనున్నారు.
మంత్రి వర్గ విస్తరణ అన్నది.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారన్నదానిపై పూర్తి క్లారిటీ వచ్చినట్టే. ఆ దిశగానే మంత్రి వర్గ కూర్పు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారందరినీ తప్పించబోతున్నారని, వారి స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణ ఎవరు ఊహించని విధంగానే ఉంది. సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కులాల ఆధారంగా మంత్రులకు పదవులను కట్టబెట్టారు. దీనికోసం తనకు అత్యంత సన్నిహితులైన వారిని సైతం అధినేత పక్కన పెట్టారు. ఎలాంటి మొహమాటానికి పోలేదు. తొలి సారి తమను పక్కన పెట్టిన అధినేత రెండో విడత తప్పక అవకాశం ఇస్తారని భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సారి జనగ్ మనసులో లెక్కలు వేరే ఉన్నాయని ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఈ విస్తరణ చేపడుతున్నట్టు సమాచారం.
ముఖ్యంగా టీడీపీకి కాస్త అనుకూలంగా ఉంటారని భావిస్తున్న సామాజిక వర్గాలనే జగన్ దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త మంత్రివర్గంలో దాదాపు 10 మంది వరకు బీసీ మంత్రులు ఉండబోతున్నారని టాక్. బీసీ సామాజిక వర్గం ఎక్కువ టీడీపీ వైపు మొదటి నుంచి ఉన్నా.. 2019 ఎన్నికల్లో చీలిక ఏర్పడి.. ఓ వర్గం వైసీపీ వైపు నిలబడినా, పూర్తిస్థాయిలో వారి అండదండలు వైసీపీకి ఉండాలనే ఉద్దేశంతో బీసీల ప్రాధాన్యాన్ని జగన్ పెంచాలని చూస్తున్నారని టాక్. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి కొత్త మంత్రివర్గంలో చోటు ఇస్తారని తెలుస్తోంది.
ఇక మైనారిటీలు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూనే మొత్తం పంతొమ్మిది మంది వరకు ఉండే అవకాశం ఉందని కొంతమంది వైసీపీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం పెంచే క్రమంలో సొంత సామాజిక వర్గానికి చెందిన తనకు అత్యంత సన్నిహితులైన వారిని జగన్ పక్కన పెడుతూ ఉండడం పై ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.