thesakshi.com : ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారిపోతోంది. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అవుతున్నాయి. కలెక్టర్లు.. ఎస్పీలు కూడా కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
రాజకీయాల్లో పై చేయి సాధించడమే నేతలకు కావాలి. ఫలానా వారి టైమ్ లో ఆ పని జరిగింది అని జనాలు తరతరాలకూ చెప్పుకోవాలి. అలా జరగలాంటే ఉన్న వాటిని అయినా మార్చాలి. కొత్త వాటిని అయినా చేర్చాలి. రెండవది బహు కష్టం. పైగా ప్రజలు ఇచ్చిన అయిదేళ్ల పుణ్య కాలంలో ఈ రోజుల్లో చేయడం అసలు కుదిరేది కాదు. అందుకే నేతాశ్రీలు షార్ట్ కట్ మెదడ్స్ లో చరిత్ర పురుషులు అవుతున్నారు.
ఆ విధంగా చూస్తే జగన్ చంద్రబాబును మించేశారు అనుకోవాలి. ఏపీలో ఏకంగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చేసి చరిత్రలో స్థానం సంపాందించుకున్నారు. దీనికి జగన్ పెద్దగా కష్టపడింది లేదు కానీ రిస్క్ అయితే భారీగానే చేసారు. నిజానికి సాహసికే విజయం లభిస్తుంది అన్న నీతి ఉంది. ఆ విధంగా జగన్ ఇపుడు కొత్త జిల్లాల ఏర్పాటు తో చరిత్రకు ఎక్కేశారు.
అక్కడ తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. జగన్ పాలన మూడేళ్ల కాలంలో సంక్షేమం తప్ప మరోటి చెప్పుకోవడానికి లేదు. కానీ పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చి జగన్ ముందు తరాలు కూడా చెప్పుకునే పని చేశారు. ఏపీలో చూసుకుంటే మద్రాస్ నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్రాగా ఏర్పడినపుడు ఉన్నవి పదకొండు జిల్లాలు మాత్రమే.
ఆ తరువాత మరో రెండు జిల్లాలు యాడ్ అయ్యాయి. అందుకో ప్రకాశం 1970 ప్రధమార్ధంలో ఏర్పడితే విజయనగరం అదే దశకం చివరలో ఏర్పడింది. అంటే ఈ రెండు కొత్త జిల్లాలు కూడా కాంగ్రెస్ ఏలుబడిలోనే ఏర్పాటు అయ్యాయి. ఇక గత నలభై ఏళ్ళుగా జనాభా విపరీతంగా పెరిగింది. హద్దులు సరిహద్దులూ మారక పెద్ద జిల్లాలు అలాగే ఉన్నాయి. కానీ ఏపీని 22 ఏళ్ల పాటు పాలించిన టీడీపీ కానీ ఆ తరువాత పదిహేనేళ్ళు పాలించిన కాంగ్రెస్ కానీ జిల్లాల విభజనకు పూనుకోలేకపోయాయి.
ఇక నవ్యాంధ్రలో ఫస్ట్ సీఎం గా చంద్రబాబుకు ఆ చాన్స్ వచ్చింది. పొరుగున ఉన్న కేసీయార్ దారి కూడా చూపారు. తెలంగాణాలో పదిని కాస్తా 33కి కేసీయార్ తీసుకుపోయారు. మరి చంద్రబాబు 13 నుంచి మరో పదో పన్నెండో చేయాలనుకోలేదు. ఆయన చూపు నాడు రాష్ట్ర రాజధాని అమరావతి మీదనే ఉంది. ప్రపంచ రాజధానిగా దాన్ని చేసి తాను చరిత్రలో నిలవాలని అనుకున్నారు.
కానీ అది ఆచరణలో ఎంత అసాధ్యమో బాబుకు దిగిపోయేనాటికి కూడా తెలిసిరాలేదు. అయితే అక్కడే జగన్ కొత్త ఆలోచన చేసారు. రాజధానికి మూడు అంటూ ఎటూ కాకుండా చేసిన వైసీపీ పెద్దలు జిల్లాల విషయంలో మాత్రం చురుకుదనం చూపించారు. ఏకంగా రెట్టింపు జిల్లాలను ఏపీలో ఏర్పాటు చేయడం ద్వారా జగన్ దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని నిర్ణయం తీసుకున్నారు.
ఇక రాజధాని నిజంగా కట్టినా అది రాష్ట్ర స్థాయిలోనే ఏ కొందరికో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కానీ జిల్లాలు అలా కాదు మొత్తం అయిదు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం. దాంతో జగన్ గురించి ఇపుడే కాదు రేపటి రోజునా చర్చించుకునే వీలు అయితే కచ్చితంగా ఉంటుంది.
ఇక ఎన్టీయార్ తో పాటు అన్నమయ్య శ్రీ సత్యసాయి అల్లూరి ఇలా చాలా మంది ప్రముఖుల పేరు మీద జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎమోషనల్ కనెక్టివిటీకి జగన్ తెర తీశారు. మొత్తానికి చూస్తే విభజన ఏపీలో ఏది సులువుగా చేయగలమో అది చేసి జగన్ తన పేరును సీఎంగా చరితార్ధం చేసుకున్నారు. బాబు మాదిరిగా రాజధాని అంటూ భారీ కాన్వాస్ మీద డిజైన్లు గీస్తూ టైమ్ వేస్ట్ చేసుకోలేదు. సో బాబు మీద జగన్ పై చేయి సాధించారు అనే చెప్పాలి.