thesakshi.com : పాలనా పరంగా నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం పార్టీ నూతన అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రీజినల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా కొత్తగా నియమితులైన ఇన్‌చార్జ్ మంత్రులు పనిచేయనున్నారు. అలాగే పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ముందుకు వెళ్లనున్నారు. రెండు జిల్లాలకు సుపరిచితులైన వీరు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు వారిని మరింత సమన్వయపరుస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
జగన్ ఒక్కసారిగా జోరు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ వ్యవధి ఉండగానే ఆయన ఇంటిని చక్కబెడుతున్నారు. రచ్చకు కూడా రెడీ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణతో వివాదాలు ముదిరి కొంప కొల్లేరు అవుతుంది అన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ మొత్తానికి సాఫీగానే కధను ముగించారు. ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన పార్టీని కూడా గాడిన పెడుతున్నారు. సీనియర్లకు పగ్గాలు అప్పగించారు.
ఇక వైసీపీ ప్లీనరీ ఒకటి ముందు ఉంది. జూలైలో దాన్ని పూర్తి చేసిన మీదట జగన్ జిల్లా టూర్లు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. రానున్న రెండేళ్ళూ జనంలోనే ఉండాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. జగన్ జిల్లా టూర్ల కోసం బుల్లెట్ ప్రూవ్ బస్సులను రెడీ చేస్తున్నారు. ఇప్పటిదాకా పర్యటనల కోసం కార్లతో జగన్ కాన్వాయ్ తిరిగేది.
ఇపుడు బుల్లెట్ ప్రూవ్ బస్సుల్లో జగన్ జిల్లాలలో కలియతిరుగుతారు అని అంటున్నారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడంతో పాటు జనాల సమస్యలను నేరుగా తెలుసుకుంటారని అంటున్నారు. ఈ మేరకు ఆర్టీసీ రెండు బుల్లెట్ ప్రూవ్ బస్సులను ఒక పాంట్రీ వాహనాన్ని రెడీ చేయాలై ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది.
భద్రతాపరమైన చర్యలలో భాగంగానే బుల్లెట్ ప్రూవ్ బస్సులను సీఎం ఉపయోగిస్తారు అని అంటున్నారు. ఈ బుల్లెట్ ప్రూవ్ బస్సులను గతంలో ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది. మొత్తానికి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ముహూర్తం తేదీ అన్నది తొందరలో చెబుతారు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.