thesakshi.com : ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌళిక సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో ఈ అంశానికి ఆమోదం తెలిపారు.
ఇప్పటికే జిల్లాల పేర్లు, హద్దులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం.. కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందించింది. తాజాగా జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది.
దీనికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.వర్చువల్‌గా సమావేశమైన కేబినెట్.. దీనికి ఆమోదం తెలిపింది.. త్వరలో గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ రాబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని లేని గవర్నర్ బిశ్వభూషణ్ . ఏప్రిల్ 1వ తేదీన భువనేశ్వర్ నుంచి తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.. ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వనున్నారు.
మొత్తంగా 26 జిల్లాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులోనూ 26 జిల్లాల్లో 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.. ప్రస్తుతం 13 జిల్లలు ఉండగా.. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
నియోజకవర్గం.. కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కాబోతోంది.. దీంతో పాటు పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర కేబినెట్.
గతంలో చంద్రబాబు నాయుడు.. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ గా చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన విన్నపాన్ని సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని.. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ గా చేసి.. ప్రతిపక్ష నేతకు గిఫ్ట్ ఇచ్చారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే అయితే హిందూపురాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలి అంటూ.. ఆందోళనలను చేశారు. అవసరమైతే జగన్ ను కలుస్తానని కూడా చెప్పారు. కానీ తుది డ్రాఫ్ట్ చూస్తే.. బాలయ్యకు నిరాశ తప్పేలా లేదు. మరి ఆయన ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మరోవైపు ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల అతరణకు ముహూర్తం నిర్ణయించడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల కోసం ఇప్పటికే భవనాల ఎంపిక పూర్తైంది. ఎంపిక చేసిన భవనాల్లో వసతులకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.