thesakshi.com : ముఖ్యమంత్రి జగన్ లో ఆకస్మిక మార్పు. సీఎంగా మూడేళ్లుగా ఆచి తూచి మాట్లాడుతున్న సీఎం..ఇక్క సారిగా మాట తీరు మార్చేసారు. ప్రతిపక్షాల పై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అందులో తీవ్ర పదాలను ప్రయోగిస్తున్నారు. సీఎం జగన్ తన ప్రసంగాల్లో ఎక్కడా సహనం కోల్పోలేదు. కానీ, ఇప్పుడు ఒక్క సారిగా ఈ రకంగా మాటల దాడి చేయటం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. సీఎం జగన్ నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా ఏపీకి చెందిన పాలనా వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక, వస్తూనే.. తన రాజకీయ వ్యూహాలను పదును పెట్టారు.
ఒక వైపు మంత్రి వర్గ విస్తరణ కసరత్తు చేస్తూనే..మరో వైపు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో మూడేళ్ల కాలంగా అప్పుడప్పుడు మినహా ప్రజల్లోకి రాలేకపోయారు. క్యాంపు కార్యాలయం వేదికగా అన్ని పథకాలను ప్రారంభించారు. కానీ, ఈ వారంలోనే రెండు జిల్లాల్లో పర్యటించారు.
బహిరంగ సభల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. తన ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూనే..ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు. ప్రధానంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూనే..కనీసం పవన్ పేరెత్తకుండా..దత్త పుత్రుడు అని ప్రచారం చేయటం ద్వారా.. వారిద్దరూ కలిసే ఉన్నారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అసూయతో రగిలిపోతే తొందరగా బీపీ వస్తుందని, టికెట్ తీసుకుంటారు అంటూ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
దీనికి మరింత వేడి పెంచుతూ నంద్యాల కేంద్రంగా.. మరింత పరుష పదాలతో ఫైర్ అయ్యారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉంటే తనని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.. అంతెందుకు.. ఏమీ పీకలేరని కూడా వ్యాఖ్యానించారు. పార్టీలో క్షేత్ర స్థాయిలో స్తబ్దుత నెలకొని ఉందని..ప్రతిపక్షాల ప్రచారంతో నెలకొన్న డైలమాను తొలిగించి..కొత్త ఊపు తెచ్చేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
టార్గెట్ 2024 లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా తన పైనా..తన ప్రభుత్వం పైన ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మకుండా చేసేందుకే పక్కా వ్యూహంతో ఇక ప్రజల సమక్షంలోనే వాటిని తిప్పి కొట్టాలని సీఎం డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే…తాను మంచి చేసానని నమ్మిస్తే ఆశీర్వదించండి… లేదంటే ద్వేషించండి ..అంతే కానీ, వారి మాటలు మాత్రం నమ్మవద్దంటూ సెంటిమెంట్ జోడిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో సమావేశమైన సమయంలో తాను రాజకీయంగా తీసుకోబోతున్న నిర్ణయాల గురించి సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని అధికార పార్టీ నేతలు చెబుతున్నా.. సీఎం జగన్ దూకుడు చూస్తుంటే… పరిస్థితులు తనకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయనే నమ్మకం కలిగిన వెంటనే ఏ నిర్ణయం తీసుకోవటానికి అయినా జగన్ వెనుకాడే పరిస్థిడి ఉండదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన రాజకీయంగా చంద్రబాబు కోసమే పని చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలతో పాటుగా..జనసేన కేడర్ లో కలిగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
వైసీపీ వ్యూహాలు సైతం కొంత మేర సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశం లో పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు..తాము ఎవరి పల్లకి మోయమని చెప్పటం వెనుక ఇదే కారణమని తెలుస్తోంది. అయితే, ఇక వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వైసీపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్దేశించారు. సీఎం సైతం సాధ్యమైనంత వరకు జిల్లాల పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కేబినెట్ ప్రక్షాళన..పార్టీ పదవులు ఖరారు చేసిన తరువాత సీఎం జగన్ తన వ్యూహాలను అమలు చేసేందుకు కొత్త వ్యూహాలతో ముందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో..సీఎం జగన్ వేయబోయే అడుగుల పైన ఆసక్తి పెరుగుతోంది.