thesakshi.com : ఏపీలో సీఎం జగన్ టార్గెట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా వైసీపీతో యుద్దం మొదలైందని ప్రకటించారు. ఇక, పార్టీ ప్లీనరీ ద్వారా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా కార్యచరణ ప్రకటనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత సైతం రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా.. వైసీపీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడటమే తన లక్ష్యమని చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు.
గోదావరి జిల్లాల్లో వైసీపీ అన్ని సామాజిక వర్గాల మద్దతు కోల్పోయిందంటూ పవన్ వ్యాఖ్యానించారు. జగన్ వర్గ రాజకీయాలు చేస్తూ ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నారని తెలిపారు. వైసీపీకి కమ్మ, కాపు, బీసీ వర్గాలు ఇప్పటికే దూరమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా దూరమవుతున్నాయని… చివరికి జగన్ ఒంటరిగా మిగులుతారని పవన్ పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో పవన్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కౌలు రైతు యాత్ర కొనసాగింపుతో పాటుగా..తాజా రాజకీయాల పైన చర్చించి పార్టీ నేతల అభిప్రాయం సేకరిస్తున్నారు. పొత్తుల విషయంలో అంతిమ నిర్ణయం తీసుకొనే వరకూ ఎవరూ కింది స్థాయిలో వ్యాఖ్యలు చేయవద్దంటూ నిర్దేశించనున్నారు.
ఇక..పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు నిర్ణయించారు. అక్కడ బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలో కౌలు రైతు యాత్ర నిర్వహించి..పులివెందులలో సభకు డిసైడ్ అయ్యారు. అక్కడి నుంచే ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల పైనా.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా తాను తీసుకోబోయే బాధ్యత పైన పవన్ క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యులతో ఇప్పటికే పవన్ చర్చించి.. పులివెందుల సభ పైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. వైసీపీ ఓటు బ్యాంకు గా భావించే వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయంటూ కొత్తగా వ్యాఖ్యలు ప్రారంభించారు. కోనసీమ విధ్వంసం వెనుక సైతం వైసీపీ ఉందంటూ ఆరోపించారు.
ఇక, సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ.. కొన్ని వర్గాలను వైసీపీ దూరం చేసుకుందని..మిగిలిన వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయంటూ విశ్లేషణలు చేస్తున్నారు. కొద్ది కాలం క్రితం పవన్ తో పొత్తు పైన ముందే స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తరువాత ఆ అంశం ప్రస్తావన చేయటం లేదు. ఇటు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కటీఫ్ చెప్పటం లేదు..అదే సమయంలో వారితో కలిసి ముందడుగు వేయటం లేదు. పులివెందుల సభ ద్వారానే తన రాజకీయ లక్ష్యం సీఎం జగన్ అని ప్రకటన చేసేందుకు పవన్ సిద్దం అవుతున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..పవన్ కళ్యాణ్ పులివెందుల పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది