thesakshi.com : వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త మంత్రివర్గం ఏర్పాటు తర్వాత మంత్రి విడదల రజినీ తో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.
అలాగే డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను పరిశీలించారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని.., ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమన్నారు. వైద్య రంగం విషయానికొస్తే.. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేసినట్లు సీఎం అన్నారు.
విలేజ్/వార్డు క్లినిక్స్ దగ్గరనుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జగన్ వివరించారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని., ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నట్లు జగన్ గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామని.. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నామన్నారు.
ఒక ముఖ్యమంత్రిగా నేను లక్ష్యాలను నిర్దేశిస్తానని., కానీ, ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది ఛాలెంజ్‌గా స్వీకరించాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమావేశంలో సీఎం ఆరాతీశారు. మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్న సీఎం.., ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదన్నారు.
ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని.. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించినట్లు జగన్ తెలిపారు.
ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌కాలేజీల నిర్మాణంపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని స్పష్టంచేసిన సీఎం.., అన్ని చోట్లా మెరుగైన వసతులుండాలన్నారు. పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతిని అధికారులు వివరించారు. 16 మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.