thesakshi.com : ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దు అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన తరుణంలో సోమవారం నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎస్ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు.
అనంతరం సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశమై సీపీఎస్ రద్దు అంశంపై చర్చలు జరపనుంది. చర్చల అనంతరం ప్రభుత్వానికి కమిటీ తుది నివేదికను సమర్పిస్తుంది.
సమావేశంలో సీపీఎస్ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు. సీపీఎస్ బదులుగా జీపీఎస్ ను ప్రతిపాదించింది ప్రభుత్వం. గ్యారెంట్ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ను ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది ఏపీ సర్కారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. కొత్త స్కీం నమ్మదగినదిగా లేదని ప్రభుత్వానికి చెప్పామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ చర్చల్లో ఇచ్చిన హామీలు అమల్లోకి రాకపోవడంపై.. కమిటి దృష్టికి తీసుకెళ్లామని బండి శ్రీనివాసరావు చెప్పారు. పాద విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.