thesakshi.com : జగన్ కొత్త కేబినెట్లో స్థానం లభించలేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయంతెలిసిందే. ఈ నేపథ్యంలో నేతల అనుచరులు ఇప్పటికే రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. అయితే అసంతృప్తిజ్వాలలను తగ్గించేందుకు వైసీపీ అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు.
పదవుల పుష్పక విమానం అన్నది రెడీ చేసి ఉంచితే నో అన్న మాటే లేకుండా అంతా ఎక్కేస్తారు. ఏపీలో ఇపుడు అదే జరుగుతోందా అన్న చర్చ కూడా ఉంది. తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణతో చాలా మంది అడిగి లేదనిపించుకున్నారు. మరి కొందరు అలిగి పక్కకు వెళ్లారు. ఇంకొందరు నిరసనలతో తమ డిమాండ్లను చెబుతున్నారు.
ఇలాంటి వారందరినీ బుజ్జగించే ప్రక్రియ అయితే జోరుగా ఇపుడు సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇపుడు ఈ పని మీదనే ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రితో భేటీ తరువాత మనసు తేలికపడింది. మబ్బు విడిచిన ఆకాశం మాదిరిగా ఆయన హృదయం తేలిక అయింది. తాను వైసీపీ ఫ్యామిలీ అని మాజీ మంత్రి గారు చెప్పేసి ఫుల్ హ్యాపీ మూడ్ లో కారెక్కారు.
ఇదే వరసలో మాచర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కూడా సీఎం తో భేటీ అయ్యారు. ఆ తరువాత ఆయన కూడా మెత్తబడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మేకతోటి సుచరిత సామినేని ఉదయభాను. మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి కరణం ధర్మశ్రీ శిల్పా చక్రపాణిరెడ్డి వంటి వారు చాలా మంది ఇపుడు అలకల బ్యాచ్ లో ఉన్నారు.
వీరితో పాటు మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నానికి ఒక కీలకమైన పదవిని క్రియేట్ చేసి ఇస్తారు అంటున్నారు. బాలినేనికి కూడా అతి కీలకమైన పదవి దక్కనుందని తెలుస్తోంది. అలాగే మరింతమంది మాజీ మంత్రుల కోసం ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళకు తెరలేవనుంది. ప్రతీ మూడు జిల్లాలకు వంతున ఏకంగా తొమ్మిది ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు అవుతాయని తెలుస్తోంది. వీటి చైర్మన్లకు క్యాబినేట్ హోదా ఉంటుంది అని చెబుతున్నారు.
ఇక ప్రాంతీయ బోర్డులలో అరడజన్ దాకా మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి చాలా మందిని అకామిడేట్ చేయవచ్చు. ఇంకా వీలైతే కొత్తగా నామినేటెడ్ పదవులు ఏ ఏ విభాగాల్లో క్రియేట్ చేయవచ్చో చేసి మరీ అలకలను సంతృప్తి పరుస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పుష్పక విమానం లాంటి పదవులు ఉండగా ఎవరికీ నో అన్న మాటే ఉండదుగా అంటున్నారు. అక్కడ అందరికీ చోటు ఉంది మరి..