thesakshi.com : భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌పై కేంద్రానికి కీలక నివేదిక..
కరోనా థర్డ్ వేవ్‌పై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కేంద్రానికి కీలక నివేదిక సమర్పించింది. దేశంలో కరోనా మూడోదశ ముప్పు సమీపంలోనే ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. అక్టోబరులో కరోనా వ్యాప్తి తారస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ వెల్లడించింది. నిపుణుల కమిటీ నివేదికను ఎన్‌ఐడీఎం పీఎంవోకు సమర్పించింది.
కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయితే ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు ఏమాత్రం సరిపోవని నివేదికలో పొందుపరిచారు. థర్డ్ వేవ్‌లో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని, పెద్దలకు కూడా ముప్పు ఉంటుందని తెలిపారు. చిన్న పిల్లలకు వైద్య కోసం డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెంచాలని సూచించారు.
పిల్లలు వ్యాక్సినేషన్ ప్రారంభం కాకపోవడంతో వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఆఫీసుకు నివేదికను అందజేశారు.
కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలతో ఎన్ఐఎండీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి, ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. అయితే రెండో దశతో పోల్చితే థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్న పిల్లల నిపుణుల కొరత 82 శాతం ఉందని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో వ్యాక్సిన్ల కొరత 63 శాతం ఉందని ఈ నివేదిక ఎత్తిచూపింది.
కరోనా తీవ్రతకు తగినట్టు చర్యలు తీసుకోకపోవడం, తగినంత వైద్య సదుపాయాలు లేకపోవడం.. వ్యాక్సినేషన్‌లో జాప్యం వంటి కారణాల వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు అని హెచ్చరించింది.
ఒకవైపు నివేదిక అలా ఉండగా.. భారత్‌లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి.