thesakshi.com : వైసీపీ కీలక నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై విపక్ష టీడీపీ నేతలు వరుసబెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే అంబటి తగ్గకుంటే ఆయనకు చెందిన మరిన్ని వీడియోలు విడుదల చేస్తామంటూ హెచ్చరించారు. అయినా కూడా అంబటి రాంబాబు తగ్గకపోవడంతో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టుతో అంబటి అసభ్యంగా మాట్లాడారని కూడా అయ్యన్న గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ ఆరోపణలు, హెచ్చరికలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. “నన్ను అంటారు.. తిరిగి అంటే… టీడీపీతో పాటు ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా నా మీద పడి ఏడుస్తారు. ఎంత ఏడ్చినా.. ఎంత మొరొగినా… తగ్గేదేలే!!” అంటూ అంబటి రాంబాబు ప్రతిస్పందించారు.
బట్టబయలు చేస్తాను..
బద్దలుకొడతాను.. బర్తరఫ్ చేయిస్తానని
ట్విట్టర్ లోనే మొరుగుతూ
సైడ్ అయిపోయిన సన్నాసి ఎవడు ?— Ambati Rambabu (@AmbatiRambabu) May 15, 2022
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఒక ట్వీట్ చేశారు. అందులో ఏపీ క్యాబినెట్ మంత్రి ఒకరు ఒక మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని, దానికి తగ్గ సాక్ష్యాలు ఇప్పటికే చేరవల్సినవారికి చేరాయని, త్వరలోనే ఆయన మంత్రి పదవి ఊడిపోనుందనేది ఆ ట్వీట్ లోని సారాంశం. ఆ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన మాట వాస్తవమని, ఆ మంత్రిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
అయ్యన్నపాత్రుడు తన ట్వీట్ లో మంత్రి అన్నారేకానీ ఆయన పేరు వెల్లడించలేదు. కాకపోతే కాంబాబు అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చివర్లో తన ట్వీట్ ను అయ్యన్నపాత్రుడికి ట్యాగ్ చేశారు. దీన్నిబట్టి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న రీతిలో మంత్రి అంబటి రాంబాబు అయ్యన్న పాత్రుడికి కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ఆ మంత్రి అంబటి రాంబాబు అనే విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లైందని ట్రోలింగ్ చేస్తున్నారు.
చింతకాయ పచ్చడి అయ్యిందని
వంకాయ గాళ్ళు చాల మంది బయల్దేరారు@KalavaTDP @GaddeRamamohan @NAmaranathReddy
ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా
కట్టకట్టుకుని వచ్చినా పీకేది లే !— Ambati Rambabu (@AmbatiRambabu) May 15, 2022
గతంలో కూడా ఆ మంత్రిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. అవి తనవి కావంటూ ఆయన వాటిని ఖండించారు. మార్ఫింగ్ చేసి వాటిన విడుదల చేశారని, నేరస్తులను పట్టుకొని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన మంత్రిగా లేరు.