thesakshi.com : వైసీపీ అంటే ఏక వ్యక్త్రి నిర్మాణం పార్టీగానే అంతా చూస్తారు. అక్కడ ఒకే ఒక్కడుగా జగన్ ఉంటారు. అన్ని నిర్ణయాలకు ఆయనే కర్త కర్మ క్రియగా చెబుతారు. అలాంటి జగన్ నిర్ణయం ఒక్కసారి తీసుకుంటే అది శిలాశాసనమే. ఆయన ఎమ్మెల్సీలను మంత్రులను చేయగలరు ఇక వారిని మంత్రి పదవులకు రాజీనామాలు చేయించి నేరుగా రాజ్యసభకు పంపించగలరు.
ఏకమొత్తంగా మంత్రులు అందరి నుంచి రాజీనామాలు తీసుకోగలరు. అలా తీసుకున్న వారిని తాను ఎలాగైనా వాడుకుంటాను అని చెప్పగలరు. కానీ పన్నెండేళ్ల వైసీపీ చరిత్రలో జగన్ నిర్ణయాలు ఎపుడూ ఎస్ బాస్ అని మాత్ర్రమే క్యాడర్ అమలు చేసింది. నాయకులు సైతం శిరోధార్యంగా భావించేవారు. అయితే ఫస్ట్ టైమ్ వైసీపీ రోడ్డున పడింది.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పర్వంలో వైసీపీ పరువు బజారున పడింది. విపక్ష నేతల కంటే దారుణంగా జగన్ని సొంత పార్టీ వారే నిందిస్తున్నారు. మరీ ముఖ్యంగా వారిలో వైఎస్సార్ ఫ్యామిలీతో ఏళ్లకు ఏళ్ళు పైబడి సాన్నిహిత్యం ఉన్న వారే మొదట ఎదురుతిరగడం విశేషం.
ఈ జాబితాలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి మేకతో సుచరితలను తీసుకోవచ్చు. వారే ఇలా చేయడంతో మిగిలిన వారు కూడా రోడ్డెక్కారు. వారూ వీరూ తేడా లేకుండా పెద్ద ఎత్తున అనేక జిల్లాల్లో వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. జగన్ ఫ్లెక్సీలను చింపేశారు. వైసీపీ జెండాలను తొలగించారు. పార్టీ ఆఫీసుల వద్ద ఆందోళనలు చేశారు.
ఇదంతా చూస్తూంటే వైసీపీకి శత్రువు వైసీపీయే అని అర్ధం అవుతోంది. అదే టైమ్ లో పార్టీ గొప్పగా చెప్పుకునే క్రమశిక్షణ అన్నది నేతి బీర కాయ చందం అని అర్ధమవుతోంది. అలాగే విధేయత అన్న మాటే మాకు వేదం అని చెప్పే రొటీన్ డైలాగులకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది.
రాష్ట్ర మంత్రి వర్గం అంటే ఎలా ఉండాలి? సమన్యాయం సూత్రాన్ని పక్కాగా పాటించాలి. అదే సమయంలో అన్ని వర్గాలకు.. అన్ని జిల్లాలకు దాదాపుగా సమాన ప్రాతినిధ్యం అన్నట్లు ఉండాలే కానీ కొందరికి ఎక్కువ.. మరికొందరికి తక్కువ అన్నట్లు ఉండకూడదు. అంతకు మించి.. కొందరికి మీద అతి ప్రేమ చూపించి.. మరికొందరికి మొండిచేయి చూపించటం కూడా సరికాదు. తాజాగా జగన్ కేబినెట్ 2.0లో ఇలాంటి తప్పులు బోలెడన్ని కనిపిస్తున్నాయి.
ఉమ్మడి 13 జిల్లాల్ని ఈ మధ్యన 26 జిల్లాలుగా చేయటం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే.. దాదాపు అన్ని జిల్లాల్ని కవర్ చేసినా.. కీలకమైన క్రిష్ణా.. కడప.. ప్రకాశం.. నెల్లూరు జిల్లాలకు కేవలం ఒకరు చొప్పున మాత్రమే పదవి దక్కింది. అదే కొత్త జిల్లాల విషయానికి వస్తే.. దాదాపు ఎనిమిది కొత్త జిల్లాలకు జగన్ 2.0 టీంలో ప్లేస్ లేని పరిస్థితి. అంటే.. మొత్తం 26 జిల్లాలకు దగ్గర దగ్గర 30 శాతం వరకు అసలు ప్రాతినిధ్యం లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
అంతేకాదు.. సామాజిక వర్గాల విషయంలోనూ ఎంపిక పలు వర్గాల వారికి అశనిపాతంగా మారిందని చెప్పాలి. జగన్ 1.0లోనూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. ఇక.. 2.0లోనూ అలాంటి పరిస్థితే. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రమే కాదు.. 1.0లో ప్రాతినిధ్యం లభించిన వైశ్య సామాజిక వర్గానికి తాజా కేబినెట్ లో మొండిచెయి చూపించారు.
అదే విధంగా క్షత్రియ.. కమ్మ సామాజిక వర్గానికి చోటు లభించలేదు. ఓట్ల శాతాన్ని లెక్కలోకి తీసుకున్నా కనీసం ఒక్కొక్కటి చొప్పున అయినా పదవి ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలా.. అటు జిల్లాలకు సంబంధించి తీవ్ర నిరాశకు గురైన వారి వేదన ఒకలా ఉంటే.. కొన్ని సామాజిక వర్గాల్ని పిచ్చ లైట్ అన్నట్లుగా తీసుకోవటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. తాము సైతం జగన్ ను అభిమానించామని.. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము చేసిన ప్రయత్నాల్ని వదిలేసి.. ఇలా మొండి చేయి చూపిస్తారా? అన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అందరికి న్యాయం చేస్తానని చెప్పి.. కొందరిని అందలానికి ఎక్కించి.. మరికొందరిని ఐడెంటిటీ లేకుండా చేస్తారా? అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తున్న వారిని అనునయిస్తూ ఏం చెబుతారన్నది ఇప్పుడు కుతూహలంగా మారింది.
మనసులో ఎలాంటి శంకలు లేకుండా.. స్వేచ్ఛగా.. స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఎప్పుడైతే అలా చేస్తే ఏమవుతుందో? ఇలా చేస్తే ఇంకేమవుతుందో అన్న అనుమానం వచ్చిందంటేనే లెక్కలో ఏదో తేడా వచ్చిందనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల వేళలో టికెట్లను ఫైనల్ చేయటానికి పట్టిన సమయం చాలా తక్కువగా చెబుతారు. అంతేకాదు.. చారిత్రక విజయం అనంతరం కొలువు తీరే ప్రభుత్వంలో మంత్రలుగా ఎవరికి ఎంపిక చేయాలన్న దానిపైనా సింపుల్ గా లెక్క తేల్చేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
క్లిష్టమైన మంత్రివర్గ సభ్యుల ఎంపికను సులువుగా తేల్చేసిన ఆయన.. తిరుమల తిరుపతి దేవస్తానం బోర్డు సభ్యుల ఎంపిక కోసం ఆయన భారీ కసరత్తును చేయాల్సి వచ్చింది. అంతకుమించి.. తాజా కేబినెట్ కోసం ఆయన పడిన తర్జనభర్జన అంతా ఇంతా కాదని చెప్పాలి.
రోజుల తరబడి కసరత్తు చేయటం.. పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ముందుగా చెప్పినట్లే ఆదివారం మధ్యాహ్నానానికి జాబితా విడుదలైంది. ఇంతలా కసరత్తు చేసిన తర్వాత విడుదలైన జాబితాను చూసినోళ్లు విస్మయానికి గురవుతున్నారు. పలు జిల్లాలకు.. పలు సామాజిక వర్గాలకు ఏ మాత్రం ప్రాతినిధ్యం ఇవ్వకుండా లిస్టు ఫైనల్ చేసిన తీరుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
గడిచిన మూడేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో వైసీపీ వర్గాలు తమ నిరసనను అస్సలు దాచుకోలేదు. రోడ్ల మధ్యలో టైర్లు తగలబెట్టటం.. ద్విచక్ర వాహనాల్ని కాల్చేయటం మొదలు.. రాస్తారోకోలు.. ధర్నాలు.. ఆందోళనలు.. ఏడుపులు.. పెడబొబ్బలు ఇలాంటివెన్నో చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు ఓపెన్ గా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా అవకాశం లభించకపోవటమా? అంటూ నిర్వేదం వ్యక్తం చేసినోళ్లు ఉన్నారు.
ఓవైపు పదవులు రాని ఎమ్మెల్యే తీవ్ర వేదనతో ఉండగా.. వారి అనుచర వర్గం చెలరేగిపోయింది. వారిని ఎంతలా వారిస్తున్నా ఊరుకోకుండా మండిపడుతున్నారు. తమ నాయకుడికి అన్యాయం చేస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామాలు చేస్తామన్న మాట వినిపించటం గమనార్హం.
మరోవైపు.. మంత్రి పదవులు రాకున్నా పార్టీని వీడేది లేదంటూ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. పదవులు ఆశించిన రాని పలు జిల్లాల్లో వైసీపీ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదంతా చూసినప్పుడు ఎంతో కసరత్తు చేసిన కేబినెట్ వంటకం ఓకే అయినా.. రుచి దగ్గర మాత్రం తేడా కొట్టేసిందని చెప్పక తప్పదు.