THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ : ‘మహాసముద్రం’

thesakshiadmin by thesakshiadmin
October 15, 2021
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ : ‘మహాసముద్రం’
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   చిత్రం : ‘మహాసముద్రం’

నటీనటులు: శర్వానంద్-సిద్దార్థ్-అదితిరావు హైదరి-అను ఇమ్మాన్యుయెల్-జగపతిబాబు-రావు రమేష్-గరుడ రామ్-శరణ్య మోహన్-వైవా హర్ష తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: రాజ్ తోట
మాటలు: సయ్యద్

నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అజయ్ భూపతిఈసారి దసరా కానుకగా ప్రేక్షకులను పలకరించిన తొలి సినిమా ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఘనవిజయాన్నందుకున్న అజయ్ భూపతి రూపొందించిన చిత్రమిది. శర్వానంద్-సిద్దార్థ్ ల క్రేజీ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాల్ని ఈ సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.కథ:అర్జున్ (శర్వానంద్).. విజయ్ (సిద్దార్థ్) విశాఖపట్నంలో చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన ప్రాణ స్నేహితులు. అర్జున్ ఏదైనా వ్యాపారం చేసి జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఉంటే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన విజయ్ కు మాత్రం ఎస్ఐ అవ్వాలన్న కోరికతో అడుగులేస్తుంటాడు. మహాలక్ష్మి (అదితి రావు హైదరి) అనే అమ్మాయితో విజయ్ ప్రేమలో ఉంటే.. శ్వేత (అను ఇమ్మాన్యుయెల్)తో అర్జున్ పరిచయం ప్రేమ దిశగా మారుతుంది. ఇలా వీళ్లిద్దరి జీవితాలు సాఫీగా సాగిపోతున్న టైంలో విశాఖపట్నాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్న స్మగ్లర్ ధనుంజయ్ (గరుడ రామ్).. విజయ్ కారణంగా తీవ్రంగా గాయపడతాడు. అతడు చనిపోయాడనుకుని భయంతో ఊరు విడిచి పారిపోతాడు విజయ్. కానీ తన వెంట మహాను పంపించడానికి అర్జున్ చేసిన ప్రయత్నం ఫలించదు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల్లో ధనుంజయ్.. అర్జున్ చేతుల్లో హతమవుతాడు. అర్జున్.. అతడి స్థానంలోకి వచ్చి వైజాగ్ కు డాన్ అవుతాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత వైజాగ్ కు తిరిగొచ్చిన విజయ్.. అర్జున్ ను అపార్థం చేసుకుని అతడి కార్యకలాపాలకు అడ్డం పడతాడు. ఇంతకీ అన్నేళ్లు విజయ్ ఏమైపోయాడు.. అర్జున్ తో అతడి వైరం ఎక్కడిదాకా వెళ్లింది.. ఈ క్రమంలో మహా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.కథనం-విశ్లేషణ:ఇమ్మెజరబుల్ లవ్.. ‘మహాసముద్రం’ క్యాప్షన్ ఇది. అంటే కొలవలేనంత ప్రేమ అని అర్థం. ఆ ‘ప్రేమ’ ఎక్కడుందా అని సినిమా అంతా వెతుకుతూనే ఉంటాం. ఇందులో ఎవరు ఎవరిని ప్రేమిస్తారో.. ఎందుకు ప్రేమిస్తారో.. ఎవరికి దేనిమీద ప్రేమో.. ఎవరు ఎవరిని ఎందుకు వదిలేస్తారో.. కూడా అర్థం కాదు. తనను ఎంతో ఇష్టంగా ప్రేమించే అమ్మాయి.. అన్ని రకాలుగా సాయపడే అమ్మాయి తనకు భారం అనుకుని తనను వదిలేసి వెళ్లిపోతాడో అబ్బాయి. మళ్లీ కొన్నేళ్లకు తిరిగొచ్చి ఆ అమ్మాయి తన ఫ్రెండుతో ఉందని పగబట్టేస్తాడు. ఆ ఫ్రెండేమో ఆమెను కన్నెత్తి చూసినట్లు కూడా కనిపించడు. కానీ మధ్యలో తను ప్రేమించిన అమ్మాయిని కారణం లేకుండా వదిలేస్తాడు. ఆ అమ్మాయి మళ్లీ ఎప్పుడో తిరిగొస్తే ఇద్దరూ కలిసి ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తారు. కొన్ని రోజులు పోయాకేమో నీ ఫ్రెండు వదిలేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి వెళ్లిపోతుంది. తన చేతుల్లో దెబ్బ తిన్న వాడు చచ్చాడో బతికాడో కూడా తెలుసుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయి నాలుగేళ్లు బతికేసినోడు.. నీ ఫ్రెండు నిన్ను మోసం చేశాడని ఇంకెవడో నాలుగు మాటలు చెప్పగానే వచ్చేసి ఆ ఫ్రెండుతో గొడవ పెట్టేసుకుంటాడు. అతడికి ఈ ఫ్రెండు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం కూడా చేయడు. ఇలాంటి చాలా తేలికైన కథాకథనాలు.. పాత్రలతో ‘మహాసముద్రం’ అనే బరువైన టైటిల్ పెట్టి సినిమా తీశాడు అజయ్ భూపతి.ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య గొడవ తలెత్తి బద్ధ శత్రువుల్లా మారాలి అంటే.. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ చాలా చాలా బలంగా ఉండాలి. లేకుండా వారి మధ్య పోరు చాలా కృత్రిమంగా తయారవుతుంది. ‘మహాసముద్రం’లో సరిగ్గా ఇదే జరిగింది. ఏదో సమస్య వచ్చి తన ఫ్రెండు ఊరు విడిచి వెళ్లిపోతుంటే.. వెంట నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకెళ్లమని అంటాడు ఇంకో ఫ్రెండు. ఆ అమ్మాయిని వెంట తీసుకెళ్లడంలో ఇబ్బంది ఉన్నపుడు ఆ విషయం తన ఫ్రెండుకే అతను చెప్పొచ్చు. కానీ రాత్రి వేళ.. వర్షంలో ఆ అమ్మాయిని వెంట బెట్టుకుని స్నేహితుడు స్టేషన్ కు పరుగెత్తుకొస్తే.. విలన్ మాదిరి ఒక చూపు చూసి వెళ్లిపోవడం ఏంటో అర్థం కాదు. పోనీ ఈ పాత్ర చాలా కన్నింగ్ అని చూపించి విలన్ లాగా మార్చారా అంటే అదీ లేదు. ఒక ముప్పావు గంట అసలు ఈ పాత్రే తెరపై కనిపించదు. కేవలం చెప్పుడు మాటలతో అపార్థం చేసుకున్న అతడు.. ఉన్నట్లుండి ఊడిపడి నీ అంతు చూస్తానని ఫ్రెండుతో సవాలు చేస్తాడు. ఇద్దరి మధ్య కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఇంత పేలవంగా ఉన్నపుడు ప్రేక్షకులు ఈ కథలోని ఎమోషన్ కు ఎలా కనెక్టవుతారు?‘మహాసముద్రం’ రిలీజ్ ముంగిట ఒకటికి రెండు ట్రైలర్లు కట్ చేసి వదిలాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇక్కడ అతను చేసిన తెలివైన పనేంటంటే.. రెండింట్లోనూ కథేంటో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ట్రైలర్లోనే కథ చెప్పి ఉంటే.. ఏముంది ఇందులో విశేషం అని తీసి పడేసేవాళ్లు జనాలు. కానీ ఇందులో ఏదో ఉందనే భ్రమలు కల్పించి థియేటర్లకు రప్పించిన అజయ్.. తెరపై అతి సాధారణమైన కథను చూపించి పూర్తిగా నిరాశకు గురి చేశాడు. చాలా బలమైన పాత్రలు.. లోతైన పాత్రలు.. సినిమా చూసిన రెండు మూడు రోజుల వరకు వెంటాడే పాత్రలు అంటూ.. ఇందులో లీడ్ క్యారెక్టర్స్ గురించి అతను చెప్పిన మాటల్లో తెరపైన తేలిపోయాయి. ఇది అసలు ప్రేమకథా చిత్రమా.. యాక్షన్ మూవీనా అంటే ఎటూ చెప్పలేని విధంగా ఈ సినిమా తయారైంది. ప్రేమకథకు.. యాక్షన్ కు పెట్టిన లంకె ఎంతమాత్రం కుదరలేదసలు. తన ఫ్రెండు మోసం చేసి పారిపోతే.. అతడి ద్వారా కన్న బిడ్డను తాను ఓన్ చేసుకుని కథానాయికను ఆదరించే హీరో పాత్రను ఉన్నతంగా చూపించాలని.. అతడి ప్రేమకు సూచికగా ‘ఇమ్మెజరబుల్ లవ్’ అని క్యాప్షన్ పెట్టాలని అజయ్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. అర్జున్-మహాల ప్రేమను ఏ దశలోనూ ప్రేక్షకుడు ఫీల్ కాని పరిస్థితి. అందులో ప్రేమ కంటే కూడా జాలి.. బాధ్యత లాంటి విషయాలే హైలైట్ అయ్యాయి. దీనికంటే ముందు చూపించే విజయ్-మహాల ప్రేమకథలోనూ ఏ విశేషం లేదు. ఇక అర్జున్-శ్వేతల ప్రేమాయణం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.‘ప్రేమ’ సంగతులు పక్కన పెట్టేసి యాక్షన్ పరంగా అయినా ‘మహాసముద్రం’ ఆకట్టుకుందా అంటే అదీ లేదు. గరుడ రామ్ పాత్రకు ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చి రంగంలోకి దించారు కానీ.. ఆ తర్వాత దాన్ని తేల్చిపడేశారు. రామ్ పాత్ర విజయ్ వల్ల చనిపోయినట్లుగా చూపించే చోట కొంచెం ఉత్కంఠ రేగి తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి రేగుతుంది. అలాగే రామ్ పాత్రకు తెరపడే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఓకే అనిపిస్తుంది. తొలి గంటలో ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేకపోయినా.. ఇంటర్వెల్ దగ్గర కథ కొంచెం మలుపు తిరగడంతో ద్వితీయార్ధంలో ఏదో ఉంటుందన్న అంచనాలు కలుగుతాయి. ‘ఆర్ఎక్స్ 100’లో మాదిరి అజయ్ ఏమైనా షాకులిస్తాడేమో అనుకుంటే అదేమీ జరగలేదు. రెండో అర్ధంలో సిద్ధు పాత్రను మాయం చేయడం.. విలన్ స్థానంలోకి హీరో వచ్చి డాన్ గా ఎదిగే క్రమాన్ని చాలా రొటీన్ గా చూపించి కథ పరంగా పూర్తిగా ఆసక్తి కోల్పోయేలా చేశాడు అజయ్. సిద్ధు తిరిగొస్తే మళ్లీ పుంజుకుంటుందేమో అనుకుంటే.. మరింత నీరసమే వస్తుంది. కాన్ ఫ్లిక్ట్ పాయింటే బలంగా లేకపోవడంతో వీరి మధ్య పోరును ఏమాత్రం ఆస్వాదించలేం. ఇక ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి సన్నివేశాలైతే మరీ రొటీన్. సిద్ధు పాత్రకు ఇచ్చిన ముగింపు కూడా ఏమీ బాగా లేదు. చివరికొచ్చేసరికి ‘మహాసముద్రం’ గ్రాఫ్ బాగా పడిపోయి.. ఈ కథలో ఏముందని అజయ్ అండ్ కో ఇంతగా ఎగ్జైట్ అయ్యారు అన్న అనుమానాలతో థియేటర్ల నుంచి బయటకి కదలడమే మిగలుతుంది. ఇటు ప్రేమకథలను మెచ్చే వాళ్లకూ రుచించక.. అటు యాక్షన్ ప్రియులనూ మెప్పించక రెంటికీ చెడ్డట్లు తయారైంది ‘మహాసముద్రం’.నటీనటులు:మాస్.. యాక్షన్ టచ్ ఉన్న చిత్రాలు శర్వానంద్ ఎప్పుడు చేసినా అతడికి చేదు అనుభవాలే మిగిలాయి. కానీ తన పాత్రకు మాత్రం శర్వానంద్ ప్రతిసారీ న్యాయమే చేశాడు. ‘మహాసముద్రం’లోని అర్జున్ పాత్ర కూడా ఇందుకు మినహాయింపు కాదు. పాత్రకు తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్టింగ్ తో శర్వా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఎక్కడా అతను బాగా చేయలేదు అనిపించదు. పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు పడేది అతడికే. సిద్దార్థ్ మాత్రం నిరాశ పరిచాడు. అసలు ఈ పాత్రే అతడికి సూటవ్వలేదు. ఒక స్పష్టత లేకుండా ఎలా పడితే అలా తీర్చిదిద్దిన పాత్రలో సిద్ధు ఇమడలేకపోయాడు. అతనీ సినిమాలో హీరోనో విలనో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంది. కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న అతడి పాత్ర ఒక దశలో ఆసక్తి రేకెత్తించినా తర్వాత తేలిపోయింది. ద్వితీయార్ధంలో సిద్ధు లుక్ బాగుంది తప్ప పాత్ర మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తుంది. నటన పరంగా సిద్ధు పెద్దగా చేసిందేమీ లేదు. మహా పాత్రలో అదితిరావు రాణించింది. ఆ పాత్ర కూడా మధ్యలో దారి తప్పినప్పటికీ అదితి మాత్రం తన అందంతో, అభినయంతో చాలా వరకు ఆకట్టుకుంది. అను ఇమ్మాన్యుయెల్ గురించి చెప్పడానికేమీ లేదు. అన్ని రకాలుగా ఆమెది నిరాశ పరిచే పాత్రే. గరుడ రామ్ క్యారెక్టర్ గురించి ఎంతో ఊహించుకుంటాం కానీ.. అది కూడా మధ్యలోనే తుస్సుమనిపించేసింది. గూని బాబ్జీ పాత్రలో రావు రమేష్ తన ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన నటన బాగున్నా ఆ పాత్ర కూడా సాధారణమే. చుంచు మామగా జగపతిబాబు పెద్దగా చేసిందేమీ లేదు. శరణ్య మోహన్ కూడా నామమాత్రమైన పాత్ర చేసింది.సాంకేతిక వర్గం:‘ఆర్ఎక్స్ 100’లో అంచనాలు లేనపుడు అదరగొట్టిన సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్.. ‘మహాసముద్రం’కు ఆశించినంత మంచి సంగీతం అందించలేకపోయాడు. ఒకట్రెండు పాటలు ఓకే కానీ.. ఆర్ఎక్స్ 100.. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మాదిరి మళ్ల ీమళ్లీ పాడుకునే.. హుషారు పుట్టించే పాటలేవీ ఇందులో లేవు. నేపథ్య సంగీతంతో మాత్రం చైతన్ ఆకట్టుకున్నాడు. రాజ్ తోట ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా సాగాయి. సినిమా ఆద్యంతో రిచ్ గా అనిపిస్తుంది ఇక. పెద్దగా బడ్జెట్.. వనరులు లేనపుడు ‘ఆర్ఎక్స్ 100’తో సంచలనం రేపిన అజయ్ భూపతి.. ఈసారి తాను కోరుకున్నవన్నీ అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోలేకపోయాడు. అతను ఆహా ఓహో అంటూ చెప్పుకున్న కథలోనే విషయం లేదు. చెప్పుకోదగ్గ మలుపులేమీ లేక.. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ బలంగా లేక.. ప్రధాన పాత్రలను సరిగా తీర్చిదిద్దక ‘మహాసముద్రం’ సాధారణంగా మార్చేశాడు మలిచాడు అజయ్. స్క్రీన్ ప్లే విషయంలో అతను పూర్తిగా నిరాశ పరిచాడు. రచయితగా.. దర్శకుడిగా తొలి సినిమాలో అతను చూపించిన మెరుపులు ఇందులో లేవు.చివరగా: మహాసముద్రం.. పైపై మెరుగులేరేటింగ్- 2.50/5

Tags: #FILM NEWS#Maha Samudram#Maha Samudram movie#Maha Samudram movie review#TOLLYWOOD
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info