THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ : మేజర్

thesakshiadmin by thesakshiadmin
June 3, 2022
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ : మేజర్
0
SHARES
298
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   మూవీ రివ్యూ : మేజర్

నటీనటులు: అడివి శేష్-సయీ మంజ్రేకర్-ప్రకాష్ రాజ్-రేవతి-మురళీ శర్మ-శోభిత ధూళిపాళ్ల తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల

ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
మాటలు: అబ్బూరి రవి
కథ-స్క్రీన్ ప్లే: అడివి శేష్
నిర్మాతలు: మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్-అనురాగ్ రెడ్డి-శరత్ చంద్ర
దర్శకత్వం: శశికిరణ్ తిక్కా

క్షణం.. గూఢచారి.. ఎవరు లాంటి సినిమాలతో తన పేరును ఒక బ్రాండుగా మార్చుకున్నాడు అడివి శేష్. అతడి సినిమా అంటే కొత్తగా.. ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఆ నమ్మకంతోనే 26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శేష్ అండ్ టీం చేసిన ‘మేజర్’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. ‘మేజర్’ థియేటర్లలోకి దిగింది. మరి ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుంది.. శేష్ బ్రాండును ఏమేర నిలబెట్టింది.. చూద్దాం పదండి.

కథ:

సందీప్ (అడివి శేష్) ఇస్రో అధికారి అయిన ఉన్నికృష్ణన్ తనయుడు. తన కొడుకు బాగా చదువుకుని డాక్టరో ఇంజినీరో కావాలన్నది ఉన్నికృష్ణన్ కోరిక కాగా.. సందీప్ మాత్రం ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనుకుంటాడు. అందులో అవకాశం రాకపోయేసరికి సైనికుడు కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా.. తాను కోరుకున్నట్లే సైన్యంలో చేరతాడు సందీప్. తర్వాత తాను కాలేజీ రోజుల్లో ప్రేమించిన ఇషా (సయీ మంజ్రేకర్)ను పెళ్లి చేసుకుంటాడు. ఐతే కుటుంబం కంటే కూడా సైనికుడిగా దేశాన్ని రక్షించడమే ముఖ్యం అనుకునే సందీప్ కు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. తన భార్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ సమయంలోనే ముంబయిలో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి జరిపారని.. హోటల్లో వందల మందిని బందీలుగా తీసుకున్నారని సందీప్ కు తెలుస్తుంది. తన టీంతో కలిసి అక్కడ అడుగు పెట్టిన సందీప్ ఉగ్రవాదులతో ఎలా పోరాడాడు.. బందీలను ఎలా రక్షించాడు.. ఈ పోరాటంలో అతను ఎలా వీరమరణం పొందాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

నిజ జీవిత కథలు వెండితెరకు ఎక్కినపుడు కొంత మేర సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం.. ఎంతో కొంత అతిశయోక్తులు జోడించడం కామన్. ఎందుకంటే రెండు రెండున్నర గంటల నిడివితో తెరకెక్కే సినిమాకు సినిమాకు అవసరమైనంత డ్రామాను నిజ జీవిత వ్యక్తుల జీవితాల్లోంచి బయటికి తీయడం చాలా కష్టం. అందులోనూ కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి.. చరిత్రలో బాగా పేరుపడ్డ వ్యక్తుల గురించి సినిమా తీయడంలో కొంత వెసులుబాటు ఉంటుంది కానీ.. మన కాలంలోనే జీవించి.. మనకు తెలిసిన ఒక దారుణ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ఒక సైనికుడి గురించి సినిమా తీస్తూ.. రెండున్నర గంటల పాటు డ్రామాను పండించడం.. ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టడం.. తెరపై కనిపిచేందంతా నమ్మశక్యంగా అనిపించేలా చేయడం.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేయడం తేలికైన విషయం కాదు. కానీ ఈ ప్రయత్నాన్ని ‘మేజర్’ టీం చాలా సిన్సియర్ గా.. నిజాయితీగా చేసింది కాబట్టే.. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువైనట్లు.. అతిశయోక్తులు హద్దులు దాటినట్లు అనిపించినా.. మన్నించబుద్దేస్తుంది. తెరమీద చూపించిందంతా కూడా నిజం కాదేమో అనిపించినా.. నిజమని నమ్ముదాం అనిపించేలా మ్యాజిక్ చేయడం కచ్చితంగా ‘మేజర్’ టీం ఘనతే.

రేప్పొద్దున ఇండియాలో బెస్ట్ బయోపిక్స్ జాబితా తీస్తే.. అందులో ‘మేజర్’కు కూడా కచ్చితంగా స్థానం దక్కేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని అత్యుత్తమ స్థాయిలో వెండితెరపై ప్రెజెంట్ చేసింది అడివి శేష్ బృందం. సినిమాలో చూపించింది ఎంత వరకు నిజం అన్నది చర్చనీయాంశమే కానీ.. ఆ చర్చను పక్కన పెట్టేసి చూస్తే ‘మేజర్’ ప్రేక్షకుల భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లే సినిమానే. 26/11 ముంబయి దాడుల మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి కానీ.. వాటిని మించి అత్యంత ఉత్కంఠభరితంగా ఆ ఎపిసోడ్ ను తెరపై ప్రెజెంట్ చేసి.. నాటి హీరో వీరోచిత విన్యాసాలను రోమాలు నిక్కబొడుచుకునేలా.. తన వీర మరణాన్ని గుండె బరువెక్కేలా చూపించడంలో శేష్-శశికిరణ్ అండ్ టీమ్ విజయవంతం అయింది. ముంబయి తాజ్ హోటల్ మీద ఉగ్రదాడి.. దీన్ని ఎదుర్కోవడానికి స్పెషల్ కమాండోలు చేసిన ఆపరేషన్.. అందులో సందీప్ వీరోచిత విన్యాసాలు.. ఈ క్రమమే ‘మేజర్’లో మేజర్ హైలైట్. దాదాపు గంటన్నర నిడివితో సాగే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయి.. కన్నార్పకుండా చూసేలా చేస్తుంది.

ఐతే ఇది కేవలం ముంబయి దాడుల మీద తీసిన సినిమా కాదు. సందీప్ బయోపిక్. దీంతో బాల్యం నుంచి ముంబయి ఎటాక్స్‌ ముందు వరకు సందీప్ జీవితాన్ని ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా.. అది సినిమాలో ఒక ఫిల్లింగ్ వ్యవహారంలా అనిపిస్తుందే తప్ప.. ఎగ్జైట్మెంట్ ఇవ్వదు. సందీప్ కుటుంబంతో ముడిపడ్డ సన్నివేశాలు సోసోగానే సాగిపోతాయి. ప్రేమకథ కూడా జస్ట్ ఓకే అనిపిస్తుందంతే. సందీప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించేటపుడు ఎక్కువ లిబర్టీ తీసుకున్నా బాగోదనో ఏమో.. మామూలుగానే నడిపించేశారు. ప్రేమకథలో హద్దులు దాటిపోలేదు. అతను సైన్యంలో చేరాక డ్రామా మొదలై కథనం వేగం పుంజుకుంటుంది. ఒక సైనికుడు తన వృత్తిని.. కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఎలా సతమతం అవుతాడో.. అతనెలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో.. ఈ క్రమంలో ఎంత సంఘర్షణకు లోనవుతాడో.. కుటుంబ సభ్యులు అతడికి దూరమై అనుభవించే బాధ ఎలాంటిదో ఉద్వేగభరితంగా చూపిస్తూ ప్రేక్షకులను సందీప్ పాత్రతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు దర్శకుడు శశికిరణ్.

దీంతో ఉగ్రదాడి మొదలుకావడానికి పర్ఫెక్ట్ మూడ్ లోకి వస్తారు ప్రేక్షకులు. ఇక ఎటాక్ మొదలైన దగ్గర్నుంచి అత్యంత ఉత్కంఠభరితంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. అసలా రోజు తాజ్ హోటల్ లోపల.. బయట ఏం జరిగిందనే విషయాలను.. అలాగే ఉగ్రవాదుల క్రూరత్వాన్ని.. బందీలుగా చిక్కిన వారి బాధను.. వారిని కాపాడేందుకు- ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సైన్యం చేసిన పోరాటాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఇది సందీప్ బయోపిక్ కావడంతో ఆద్యంతం అతణ్ని ఎలివేట్ చేస్తూ.. అతడి కోణంలోనే కథను నడిపించారు. సందీప్ పోరాటాన్ని.. అతడి వీర మరణాన్ని తక్కువ చేయడం కాదు కానీ.. కాస్త తర్కంతో ఆలోచిస్తే ఇలాంటి ఆపరేషన్లలో ఏ ఒక్కరో అంతా చేసినట్లు చూపించడం కరెక్ట్ అనిపించదు. అయినా లోపల నిజంగా ఎప్పుడేం జరిగిందో కచ్చితంగా ఎవరు చెప్పగలరు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ రకమైన ఆలోచన వచ్చినపుడు మనం తెరపై చూస్తున్నది నిజమేనా అన్న సందేహాలు కొంత వెనక్కి లాగుతుంటాయి. కానీ ఎక్కువ ఆలోచించే అవకాశం ఇవ్వకుండా తెరమీద ఉత్కంఠ రేకెత్తిస్తూ.. రోమాలు నిక్కబొడుకునేలా చేస్తూ.. భావోద్వేదాలను పతాక స్థాయికి తీసుకెళ్తూ సన్నివేశాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. కథనం పరుగులు పెడుతుంటుంది. ఇలా ప్రేక్షకులను మరిపించడంలో.. మురిపించడంలో ‘మేజర్’ టీం సూపర్ సక్సెస్ అయింది. ముగింపు తెలిసిందే అయినా.. ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా దాన్ని తీర్చిదిద్ది ‘మేజర్’కు వారి గుండెల్లో చోటిచ్చేలా చేయగలిగింది చిత్ర బృందం. సందీప్ కు ఎలివేషన్లు ఇచ్చే క్రమంలో కథ విషయంలో ఎక్కువ స్వేచ్చ తీసుకున్నట్లు.. అతిశయోక్తులు జోడించినట్లు అనిపించినా.. అవి లేకుంటే సినిమా అంత ఎగ్జైటింగ్ గా ఉండేది కాదన్నది కూడా వాస్తవం. కాబట్టి ‘మేజర్’ కచ్చితంగా ఒక స్పెషల్ మూవీనే.

నటీనటులు:
క్షణం.. గూఢచారి.. ఎవరు సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులకు బాగా చేరువ అయిన అడివి శేష్.. ఈ సినిమాతో వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదిస్తాడు. సందీప్ పాత్రలో ఒదిగిపోయిన అతను.. నిజంగా ఆ వ్యక్తినే చూస్తున్న భావన కలిగించాడు. ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు. చాలా త్వరగా అతడి పాత్రకు అలవాటు పడేలా చేయడంలో అతను విజయవంతం అయ్యాడు. పాత్రకు అవసరమైన ఫిజిక్ తో కనిపించడమే కాక.. ఎక్కడా మోతాదు మించకుండా కొలిచినట్లుగా హావభావాలు పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తన పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేసేలా.. దాంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో శేష్ పాత్ర కీలకం. నటుడిగా అతడి కెరీర్లో నిలిచిపోయే పాత్రల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. ‘గని’ సినిమాలో చాలా పేలవంగా కనిపించిన సయీ మంజ్రేకర్.. ఇందులో చాలా భిన్నంగా కనిపించింది. తనకు సూటయ్యే మంచి పాత్రలో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని చూపించాడు. పతాక సన్నివేశాల్లో స్పీచ్ ఇచ్చేదగ్గర తనకు తానే సాటి అనిపించాడు. రేవతికి పెద్దగా అవకాశం దక్కలేదు. ఉన్నంతలో బాగానే చేసింది. సందీప్ పై అధికారి పాత్రలో మురళీ శర్మ బాగా చేశాడు. ఆ పాత్రలో ఆయన పర్ఫెక్ట్ అనిపించాడు.

సాంకేతిక వర్గం:

‘మేజర్’లో సాంకేతిక నిపుణులంతా గొప్ప ఔట్ పుట్ ఇచ్చారు. థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం అందించడంలో మంచి నైపుణ్యం ఉన్న శ్రీ చరణ్ పాకాల.. తన కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. ఉగ్రవాదుల దాడి మొదలైన దగ్గర్నుంచి ఆర్ఆర్ వేరే లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రేక్షకుల్లో ఉద్వేగం.. ఉత్కంఠ రేకెత్తించేలా అద్భుతమైన నేపథ్య సంగీతంతో అతను సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. ప్రొడక్షన్ డిజైన్.. యాక్షన్ కొరియోగ్రఫీ.. ఎడిటింగ్ కూడా అత్యుత్తమ ప్రమాణాలతో సాగాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేశారు. రిచ్ గా తీర్చిదిద్దారు. అబ్బూరి రవి మాటలు ఆకట్టుకుంటాయి. కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన శేష్.. రచయితగానూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. కేవలం సందీప్ జీవితం గురించి తెలుసుకుంటే సరిపోదు.. ఉన్న సమాచారంతో కథాకథనాలను తీర్చిదిద్దడంలో శేష్ చూపించిన నైపుణ్యం ప్రశంసనీయం. అతడితో చక్కటి సమన్వయం ఉన్న శశికిరణ్ తిక్కా.. ‘గూఢచారి’ తర్వాత మరోసారి దర్శకుడిగా తన పనితనాన్ని చూపించాడు. సాంకేతిక నిపుణుల నుంచి గొప్ప ఔట్ పుట్ రాబట్టుకోవడంతో పాటు.. పేపర్ మీద ఉన్నదాన్ని అత్యుత్తమంగా తెరపై ప్రెజెంట్ చేశాడు.

చివరగా: మేజర్.. అమరవీరుడికి ఘన నివాళి
రేటింగ్-3.5/5

Tags: # bollywood movie review# bollywood news#Adivi Sesh#Entertainment News#major#Major movie review#majormovie#Saiee Manjrekar#Sashi Kiran Tikka#Sobhita Dhulipala#Vijay Sethupathi
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info