thesakshi.com : పెళ్లికి ముందు ఫొటోషూట్ లంటూ కాబోయే వధూవరులు చేసే హంగామా అంతా ఇంతాకాదు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారింది. ప్రీ వెడ్డింగులు.. ప్రీవెడ్డింగ్ షూట్ లు అంటూ లక్షలు తగలేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏ చిన్న వేడుకైనా సరే ఫొటో షూట్ ఉండాల్సిందే. కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫొటోషూట్ లు ప్రస్తుతం ట్రెండ్ గా మారాయి.
పుట్టినరోజులు ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫొటో షూట్ పేరుతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటనే చోటుచేసుకుంది. కోహెడలో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో పెళ్లికొడుకు పెళ్లికూతురుపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే రెండు రోజుల్లో పెళ్లి ఉన్న సమయంలో ఇప్పుడు ఇలా జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రీ వెడ్డింగ్ షూట్ లు సాధారణంగా చెరువులు సరస్సులు డ్యాంల ప్రాంతాల్లో పార్క్ లలో చేస్తుంటారు. కానీ వీళ్లు వెరైటీగా అడవుల బాటపట్టడమే వీరిపై తేనెటీగల దాడికి కారణమయ్యాయి. అటువైపు వెళ్లకుంటే ఇప్పుడు ఈ జంటకు ఈ పరిస్థితి వచ్చేది కాదని బంధువులు వాపోతున్నారు.