thesakshi.com : ఖాళీగా ఉన్న సమయంలో మొబైల్ లో నెట్ బ్రౌజ్ చేస్తున్నాడో యువకుడు. సడన్ గా అతడు వాడుతున్న యాప్ లో ఓ యాడ్ ప్రత్యక్షమయింది. ఇక్కడ కనిపిస్తున్న ’అందమైన అమ్మాయితో మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకండి వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఆ యాడ్ లో వివరాలు కనిపించాయి. ఆ అమ్మాయిని చూసిన ఆ యువకుడికి ఆశ పుట్టింది. వెంటనే ఆ యాడ్ పై క్లిక్ చేశాడు. కాస్త తక్కువ మొత్తంలోనే మసాజ్ ఫీజును చూపించారు.
తక్కువే కదా అని అతడు కూడా ఓకే చెప్పాడు. ఆ తర్వాత అక్కడ కనిపించిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి అమ్మాయి చెప్పినట్టు ఓ ఖాళీ బంగళాకు వెళ్లాడు. అంతే అక్కడ కనిపించింది ఒక్క అమ్మాయి కాదు, ఏకంగా నలుగురు అమ్మాయిలు. ఆ కిలేడీ లేడీలు అతడిని బంధించి దారుణానికి తెగించారు. దుబాయిలో ఓ భారతీయ యువకుడికి ఎదురైన ఊహించని అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ కు చెందిన ఓ యువకుడు ఉఫాధి కోసం దుబాయికి వెళ్లాడు. ఖాళీ సమయంలో ఓ యాప్ ను బ్రౌజ్ చేస్తుండగా అతడికి ఓ యాడ్ కనిపించింది. దాదాపు 4000 రూపాయలకు మాత్రమే ఈ అందమైన అమ్మాయితో మసాజ్ అంటూ కనిపించి యాడ్ ను చూసి అతడు ఆకర్షితుడయ్యాడు. దాన్ని క్లిక్ చేసి అక్కడ కనిపించిన ఫోన్ నెంబర్ ను తీసుకున్నాడు.
ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే ఓ యువతి ఫోన్ లిఫ్ట్ చేసింది. యాడ్ వివరాలను ఆ యువకుడు కన్ఫామ్ చేసుకున్నాక డబ్బులు చెల్లించడానికి కూడా ఆ యువకుడు రెడీ అయ్యాడు మసాజ్ పూర్తయ్యాకే డబ్బులు తీసుకుంటామంటూ ఆ యువతి చెప్పింది. దీంతో ఆమె చెప్పినట్టుగానే గతేడాది నవంబర్ నెలలో ఆ యువకుడు దుబాయిలోని అల్ రెఫా అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఓ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లాడు.
అపార్ట్మెంట్ లో ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుందనుకుంటే, ఏకంగా నలుగురు నైజీరియా యువతులు కనిపించారు. ఆ యువకుడు అపార్ట్మెంట్ లోపలికి రాగానే ఆ నలుగురు యువతులు అతడిపై దాడి చేశారు. చేతులు కాళ్లు బంధించారు. నోటికి ప్లాస్టర్ వేసి కత్తులతో బెదిరించారు. అతడి వద్ద ఉన్న పర్సులోని ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్ లాంటి వివరాలు తెలుసుకున్నారు. అతడి క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా 55 లక్షల 30 వేల రూపాయలను దోచుకున్నారు.
ఒక రోజంతా బంధీగా ఉంచిన తర్వాత అతడి వద్ద ఉన్న ఐ ఫోన్ ను కూడా లాక్కుని మరుసటి రోజు అతడిని వదిలి పెట్టారు. అతడు బయటకు రాగానే స్నేహితుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తాజాగా ఆ కేసులో ఆ నలుగురు యువతులను అరెస్ట్ చేశారు.