thesakshi.com : మెగాస్టార్ చిరంజీవితో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న చిరు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి నటించిన శుభగృహ గ్రూప్ యాడ్ ను అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ తో పాటు సోషల్ మీడియాలో ప్రసారం చేశారు నిర్వాహకులు. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఈ ప్రకటనలో చిరుతో పాటుగా ఖుష్బూ – అనసూయ భరద్వాజ్ కూడా కనిపించారు.
ఇందులో చిరంజీవి – ఖుష్బూ భార్యా భర్తలుగా.. శుభ గృహ ఏజెంట్ గా యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించారు. ‘కలవరమాయే మదిలో నా మదిలో..’ అంటూ హమ్ చేస్తూ హడావిడిగా చిరు రెడీ అవుతుండగా.. ‘ఈరోజు ఏంటో గుర్తుందా మీకు?’ అంటూ ఖుష్బూ హారతి పట్టుకొని రావడంతో ఈ ప్రకటన ప్రారంభమైంది.
అదే సమయంలో అనసూయ నుంచి ఫోన్ రావడంతో భార్యతో అబద్ధం చెప్పి ఖంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిరంజీవి. అనుమానంతో ఖుష్బూ కూడా భర్త వెనకాలే వెళ్తుంది. ఓ అపార్ట్మెంట్ వద్ద అనసూయను కలవడం.. ఆమెతో చిరు చనువుగా ఉండటాన్ని చూస్తుంది.
ఆగ్రహంతో వాళ్లు వెళ్లిన రూమ్ లోకి వెళ్లిన ఖుష్బూ.. అక్కడ వారిద్దరి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటిని కొనుగోలు చేసి బహుకరిస్తాడు చిరు. తన సొంతింటి కలను నెరవేర్చినందుకు ఖుష్బూ ఆనందబాష్పాలతో భర్తను హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఆ రోజు తన భార్య బర్త్ డే అని తెలిసినప్పటికీ విష్ చేయకుండా.. ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని చిరంజీవి ఇలా ప్లాన్ చేసాడన్నమాట. అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో సుకుమార్ తీసిన సుభగృహ యాడ్ ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో మెగాస్టార్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ క్రెడిట్ సుకుమార్ కి దక్కుతుంది.
ఇప్పటికే చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా సుకుమార్ డైరెక్షన్ ను చాలా ఎంజాయ్ చేసినట్టు తెలిపారు. ‘దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిలిం కోసం ఆయన దర్శకత్వంలో షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్.. చిరంజీవితో కూడా ఓ మూవీ చేయాలని మెగా అభిమానులు కోరుతున్నారు. మరి త్వరలో ఈ క్రేజీ కాంబోలో మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.