thesakshi.com : రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టులను చేజిక్కించుకోవటంలో మేఘా ఇంజనీరింగ్.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కు సాటి రావటం చాలా సంస్థలకు సాధ్యం కాదని చెబుతారు. గడిచిన రెండు దశాబ్దాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది మేఘా సంస్థ. మూలాలు ఏపీ అయినా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల మీద మేఘా కన్ను పడితే.. ఆ ప్రాజెక్టు ఆ సంస్థ చేతికి చిక్కుతుందని చెబుతారు.
మేఘా వారి నెట్ వర్కును పొగడకుండా ఉండలేం. వ్యవస్థలపై వారికున్న పట్టును చూశాక.. ఆ ప్లానింగ్ ను అభినందించకుండా ఉండలేం.
అలాంటి ఈ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లకు సంబంధించి తాజాగా ఒక రాష్ట్ర ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం ఒక రోడ్డు రవాణా సంస్థకు 1400 ఎలక్ట్రిక్ బస్సుల్ని తయారు చేసే ఆర్డర్ ను సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. బస్సుల సరఫరాకు లోయెస్టు బిడ్డర్ గా నిలవటంతో.. 1400 బస్సుల్నిసరఫరా చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ బిడ్ విలువ రూ.2450 కోట్లుగా చెబుతున్నారు. ఇంత భారీ డీల్ ఆ సంస్థకు ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ ఆర్డర్ తో రవాణా రంగంలో మేఘా తన మార్కును చూపించటం ఖాయమంటున్నారు.
డీల్ లో భాగంగా 1400 బస్సుల్ని సరఫరాచేయటమే కాదు.. మరో 700 బస్సులను అందించేందుకు పోటీ పడనుంది. సదరు రవాణా సంస్థకు అద్దె ప్రాతిపదికన 12 ఏళ్ల పాటు బస్సులు నడిపేలా డీల్ కుదుర్చుకోనున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ.. సదరు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదన్న దానికి పలువురు.. తెలంగాణ ఆర్టీసీగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కానీ.. ప్రకటన కానీ వెలువడలేదు. త్వరలోనే అది కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఏమైనా.. పోటీలోకి మేఘా దిగితే.. మిగిలిన కంపెనీలు తోక ముడవాల్సిందేనన్న మాట మరోసారి నిజమైందని చెబుతున్నారు.