thesakshi.com : హిమనీనదాలు కరగడం వల్ల హిమాలయాల్లోని గ్లేసియర్ సరస్సుల స్థాయి ప్రమాదకరంగా పెరగడమే కాదు, అది వేరే ప్రమాదాలకు కూడా కారణం కావచ్చని, కానీ.. వాటిని పర్యవేక్షించడం లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గ్లోబల్ వార్మింగ్ వల్ల కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. ఇలాంటి ప్రమాదాల గురించి మనకు ఎంత తెలుసనడానికి, ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇటీవల వచ్చిన జలప్రళయమే ఒక తాజా ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు.
“ఇలాంటి విపత్తులు వచ్చినపుడు, నిజానికి ఏం జరుగుతోంది అనేదాని గురించి మన దగ్గర సమగ్ర సమాచారం ఏదీ లేదు. ఉత్తరాఖండ్ లాంటి ఘటనలు జరిగినపుడు మనం ఉలిక్కిపడతాం. హిమానీనదాల వల్ల జరిగే ఇలాంటి ప్రమాదాలపై మనం నిఘా పెట్టడం ఉండదు” అని హిమాలయాల్లోని ఎన్నో ప్రమాదాలపై పరిశోధనలు చేస్తున్న అమెరికా సీనియర్ జియాలజిస్ట్ జెఫ్రీ కర్జల్ అన్నారు.
హిమనీనదాలు కరిగినప్పుడు లేదా పలచబడినప్పుడు చాలా గ్లేసియర్స్ ప్రమాదకరంగా మారుతాయని వాలుగా ఉండే పర్వతాల గోడలకు అంటుకుని ఉండే అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పలచబడిన హిమనీనదాలు కొండల కింద, వాటి చుట్టుపక్కల భూమిని అస్థిరంగా చేసే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల కొండచరియలు, బండరాళ్లు పడడం లాంటివి జరగవచ్చు. దానివల్ల పర్వతం వాలు మొత్తం కూలిపోయే అవకాశం కూడా ఉంది.
అలాంటి ఘటనలు నదులు, కాలువల్లో అడ్డంకులు సృష్టిస్తాయని, కొంత సమయం తర్వాత ఆ నదులు విధ్వంసాన్ని తీసుకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే, ఉత్తరాఖండ్ ఘటనకు సంబంధించిన ప్రాథమిక రిపోర్టుల్లో అదే జరిగిందని తేలింది.
హిమాలయాల్లో ఉండే కఠిన భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ నిఘా పెట్టడం చాలా సవాలుతో కూడినదని భావిస్తున్నారు.
“హిమాలయాల్లోని హిందూకుష్ ప్రాంతంలో 50 వేలకు పైగా హిమానీనదాలు ఉన్నాయి. వాటిలో కేవలం 30ని మాత్రమ నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటిలో ఫీల్డ్ స్టడీ కూడా ఉంది” అని ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్లేషియాలజిస్ట్ మహమ్మద్ ఫారూఖ్ ఆజం అన్నారు.
ఈ స్టడీలో కేవలం 15 మాత్రమే ప్రచురించారు. మన గ్లేసియర్లను మనం మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, దీనిలో ఎన్నో కారకాల పాత్ర చాలా కీలకం.
ప్రపంచంలోనే అత్యాధునిక పర్వత శ్రేణి అయిన హిమాలయాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, భూకంపం వల్ల చాలాసార్లు ఆ పర్వతాల వాలు అస్తవ్యస్తం అవుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాతావరణ మారడం వల్ల హిమపాతం, వర్షపాతంలో మార్పులు ఈ పర్వతాలను చాలా బలహీనంగా మారుస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమానీనదాల్లో వచ్చే మార్పులు వాటిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి.
2016లో టిబెట్‌లోని అరూ పర్వతంపై ఒక గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. దానివల్ల భారీగా మంచుచరియలు పడ్డాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మందితోపాటూ వందలాది పశువులు చనిపోయాయి.
తర్వాత కొన్ని నెలలకే అదే పర్వతంపై మరో గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. 2012లో పాక్ పాలిత కశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్ దగ్గర జరిగిన ఒక ప్రమాదంలో దాదాపు 140 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులే.
దానిని నిపుణులు ఐస్-రాక్ మంచుచరియలుగా చెప్పారు. కానీ, ఆ ఘటనకు కారణం ఏంటి అనేది ఇప్పటివరకూ పక్కాగా నిర్ధరించలేకపోయారు.
పశ్చిమ హిమాలయాలతోపాటూ పామీర్, కారాకోరమ్ తూర్పు భాగంలో, హిందూకుష్ పర్వత శ్రేణి దక్షిణ భాగం, ఆసియాలోని కొన్ని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇటీవల ఒక అద్యయనం జరిగింది.
అందులో, 1999 నుంచి 2018 మధ్య కొండచరియలు కూలిపోవడం పెరగడానికి హిమానీనదాలు కరగడమే ఒక పెద్ద కారణం అని చెప్పారు.
అమెరికా జియాలాజికల్ సర్వే శాటిలైట్ చిత్రాల ఆధారంగా చైనా సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు.
అందులో 2009 నుంచి 2018 మధ్య మొత్తం 127 కొండచరియలు పడినట్లు గుర్తించారు.
“మా ఫలితాల్లో కొత్త రకం మార్పులు వెలుగులోకి వచ్చాయి. గత దశాబ్దంగా పెద్ద కొండచరియలు పడడం పెరిగాయి. హిమానీనదాలు తగ్గడానికి, కొండచరియలు పెరగడానికి నేరుగా సంబంధం ఉంది” అని గత జనవరిలో ప్రచురించిన దాని పీఆర్ రివ్యూలో చెప్పారు.
కొండచరియలపై పరిశోధనలు చేసిన డాలియా కిర్ష్‌బౌమ్ నాసా హైడ్రలాజికల్ సైన్స్ ల్యాబ్ చీఫ్‌గా ఉన్నారు. గ్లేసియర్లు కరగడంవల్ల ముంచుకొచ్చే ముప్పు కనిపించడం మొదలయ్యిందని ఆమె అన్నారు.
“మొదట పర్వతాల వాలు గ్లేసియర్ల వల్ల అతుక్కుని ఉండేవి, కానీ, ఇప్పుడు అవి గ్లేసియర్లుగా లేవు, అందుకే, అవి అలా నిలబడి ఉన్నాయి అంతే. అవి కిందకు కుప్పకూలే ప్రమాదం ఉంది” అన్నారు.
2018లో వాతావరణ మార్పులు, క్రయోస్పియర్‌పై.. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇచ్చిన ఒక ప్రత్యేక రిపోర్టులో “గ్లేసియర్లు కరగడం, పెర్మాఫ్రాస్ట్(శీతర ప్రాంతాల్లో గడ్డకట్టిన భూమి, వీటిలో నీళ్లు మంచులా గడ్డకట్టుకుపోతుంది)లోపల గడ్డకట్టిన మంచు కరగడం వల్ల కొండ వాలులో స్థిరత్వం, మూలాలు బలహీనంగా అవుతాయి” అని చెప్పారు.
ఇప్పటివరకూ హిమాలయాల్లోని గ్లేసియర్లపై జరిగిన పరిమిత అధ్యయనాల్లో అవి వేగంగా కరగడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. గ్లేసియల్ సరస్సులు ప్రమాదకర స్థాయిలో నిండిపోతుండడంతో అలా చేశారు. అందరి దృష్టినీ గ్లేసియర్ సరస్సులు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని, వేగంగా కరిగిపోతున్నగ్లేసియర్ల వల్ల తలెత్తే మిగతా ప్రమాదాలను పట్టించుకోవడం లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
“వాటిపై తక్కువ దృష్టి పెట్టారు. మంచు చరియలు, హిమపాతం లాంటి విపత్తులు అరుదుగా జరగడమే దానికి కారణం కావచ్చు” అని యుటా విశ్వవిద్యాలయంలో హిమాలయాల్లోని గ్లేసియర్లలో మార్పులపై అధ్యయనం చేస్తున్న జాగ్రఫీ ప్రొఫెసర్ సమర్ రూపర్ అన్నారు.
మరోవైపు హిమాలయ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచీ పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ నిపుణులు మాత్రం గ్లేసియర్ సరస్సులకు సంబంధించిన వరదల వల్ల, ఆ ప్రాంతంలో చారిత్రక స్థాయిలో సమస్యలు వచ్చాయని అన్నారు.
ఈ హెచ్చరికలపై భారత ప్రభుత్వ ఏజెన్సీలు తగినంత దృష్టి పెట్టకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ నుంచి రిటైర్ అయిన సీనియర్ గ్లేసియాలజిస్ట్ డాక్టర డీపీ డోభల్ వాడియా దానిని వివరించారు.
“మేం 2009లో గ్లేసియర్లపై అధ్యయనం కోసం ఒక కేంద్రం ప్రారంభించాం. భారత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లేసియర్స్ దానిని అభివృద్ధి చేయాల్సింది. కానీ, అది ఎప్పుడూ జరగలేదు. ఫలితంగా గ్లేసియర్లకు సంబంధించిన అధ్యయనాలపై ప్రభావం పడింది. మేం శిక్షణ ఇచ్చిన పది మందికి పైగా గ్లేసియాలజిస్టులు ఇప్పుడు పనిలేకుండా ఉన్నారు” అన్నారు.
వాతావరణ మార్పులపై భారత ప్రభుత్వం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద ఎనిమిది జాతీయ మిషన్లు ఉన్నాయి. వీటిలో ‘హిమాలయ పర్యావరణ వ్యవస్థ నిర్వహణ’ ఒకటి.
గ్లేసియర్ల గురించి తెలుసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగించడం, వాటిని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడం లాంటివి దీని పనులు.
భారత్, దాని పొరుగు దేశాలు(చైనా, పాకిస్తాన్) హిమాలయాల్లో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతాలు ఒక పెద్ద సమస్యగా మారాయని మహాసముద్రాలు, క్రయోస్పియర్‌పై ఐపీసీసీ ప్రత్యేక రిపోర్టు ఇచ్చారు.
“ఈ దేశాలు కలిసిరావాల్సిన అవసరం ఉంది. సరిహద్దులు దాటి గ్లేసియర్ల గురించి పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే గ్లేసియర్లు కరగడం వల్ల వచ్చే ప్రమాదాలపై మనం విస్తృత నిఘా పెట్టగలుగుతాం. ఆ ప్రమాదాలను ఎదుర్కోడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోగలం”.