thesakshi.com : ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా.. సానుకూలత ఉందా..? ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది.. సీఎం జగన్ మాత్రం.. ప్రజా ప్రతినిధులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. గెలవాలంటే ప్రజల్లో ఉండాల్సిందే అంటూ హెచ్చరించారు.
గెలవాలంటే ప్రజల్లో ఉండాల్సిందే అని.. లేదంటే ఎంత గొప్ప ఎమ్మెల్యే అయినా ఓటమి తప్పదనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సీఎం జగన్ వ్యాఖ్యలకు ఒక్కొక్కరు ఒక్కొలా అర్థం చెబుతున్నారు. ఎవరి విశ్లేషణ ఎలా ఉన్నా.. సీఎం జగన్ మాత్రం ఎమ్మెల్యేలకు ఓ రేంజ్ లో గతంలో వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.
మొత్తం 8 నెలల పాటు గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇకపై సరిగా పని చేయని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. మళ్లీ వచ్చి తనను టికెట్ అడగొద్దని క్లియర్ గా తేల్చి చెప్పేసారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు పరీక్షా సమయం ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ ప్రారంభం కానుంది. దీని ద్వారా ప్రజల్లో తమ బలం నిరూపించుకున్న ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లు దక్కనున్నాయి. పెరుగుతున్న ఎండలతో పాటుగా రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించిన విధంగా గడప గడపకు వైఎస్సార్సీపీ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ ఎమ్మెల్యే – ఇన్ఛార్జ్ లు తమ నియోజకవర్గంలోని ఒక్కో సచివాలయం పరిధిలో పర్యటించనున్నారు.
ప్రభుత్వ పథకాలు అమలు తీరు పైన ప్రధానంగా లబ్దిదారులతో చర్చించనున్నారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వం నుంచి ఒక లేఖతో వెళ్లనున్నారు. ఆ కుటుంబానికి అందుతున్న ప్రభుత్వ పథకాలను వివరించి..వారికి కలుగుతున్న లబ్దిని వివరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. 35 నెలల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా ఏకంగా రూ.1,38,894 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా ఇళ్ల పట్టాలు.. పథకాలు అందని అర్హులను ఎవరినైనా గుర్తిస్తే.. వారికి స్థానిక సచివాలయంలో నమోదు చేసుకొనే విధంగా చొరవ తీసుకోనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరిస్తూ సీఎం వైయస్ జగన్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించి, ఆశీర్వదించాలని కోరనున్నారు.
ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం సాగుతుంది. అంటే.. ఈ కార్యక్రమం పూర్తవడానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో-ఆర్డినేటర్, వైయస్సార్‌పీపీ నేత విజయసాయిరెడ్డికి సీఎం అప్పగించారు. ఈ కార్యక్రమం ముగిసేలోపే.. బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలకు స్థానం కల్పించనున్నారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది కీలక సమయంగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేల పని తీరు పై సర్వే నివేదికలు సిద్దం చేసారు. వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తానని స్పష్టం చేసారు. ప్రభుత్వం – సీఎం జగన్ పాలన పైన 65 శాతం మేర సానుకూలంగా ఉంటే..ఎమ్మెల్యేల్లో దాదాపుగా 40- 45 మంది పైన వ్యతిరేకత కనిపిస్తోందని గుర్తించినట్లుగా సమాచారం.
దీంతో..ఎమ్మెల్యేల పని తీరుకు గ్రేడింగ్ మూడు రకాలుగా ఖరారు చేసారు. ఈ రేటింగ్ ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తానని సీఎం తేల్చి చెప్పారు. తక్కువ రేటింగ్ ఉన్న వారు ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలతో మరింతగా మమేకమై వారి రేటింగ్ పెంచుకొనేందుకు ఇది సరైన సమయంగా సూచించారు. రేటింగ్ పెరగని వారికి టిక్కెట్లు ఇచ్చి.. నష్టపోవటానికి పార్టీ సిద్దంగా లేదని .. వ్యక్తల కంటే పార్టీనే ముఖ్యమని సీఎం జగన్ స్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో.. ఎమ్మెల్యేలు సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
ఇక, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెల 12న సీఎం జగన్ విశాఖ జిల్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. త్వరలోనే సచివాలయాల సందర్శనలో ఆయన నేరుగా పొల్గని.. ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇక, ఏపీలో దీని ద్వారా రాజకీయంగా మరింత సందడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఇది పరీక్షా సమయంగా మారుతోంది.