thesakshi.com : ప్రధాని మోదీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. పదాలను ఎంచుకుని మాట్లాడతారు. కొన్ని ఘటనలను చాలా జాగ్రత్తగా ప్రస్తావిస్తారు. ఆయన రాజకీయ జీవితాన్ని నిశితంగా పరిశీలించిన చాలామంది ఈ విషయం నిజమని ఒప్పుకుంటారు.
ఇటీవల భరూచ్‌లో మోదీ చేసిన ప్రసంగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భరూచ్‌లో జరిగిన ‘ఉత్కర్ష్ సమరోహ్’ సందర్భంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అందులో ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు.
“నేను ఒకరోజు ఒక పెద్ద నాయకుడిని కలిశాను. ఆయన చాలా సీనియర్ నేత. ఆయన మా విధానాలను నిత్యం వ్యతిరేకిస్తుంటారు. నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయన కొన్ని విషయాలలో నాపై కోపంగా ఉన్నారు. ఒకసారి నన్ను కలవడానికి వచ్చిన ఆయన, ”మోదీజీ, దేశానికి రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇంకా ఏం కావాలి” అని అడిగారు.
‘‘రెండుసార్లు ప్రధాని కావడం చాలా గొప్ప విషయం అని ఆయన అనుకుంటారు. మోదీ ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిన వారన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోరు. ఈ గుజరాత్ భూమి నన్ను తయారు చేసింది. ఇంత మంచి జరిగింది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలా? లేదు. శాచ్యురేషన్ అనేది నా కల. ముందు రోజుల్లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలి” అని మోదీ వ్యాఖ్యానించారు.
శాచ్యురేషన్(సంతృప్త స్థాయి) అంటే ప్రధాని ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడటం.
ప్రసంగంలోని ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి, కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆయన ఈ ప్రసంగం చేశారు. అక్కడ 27 ఏళ్లుగా బీజేపీ పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్‌లోని భరూచ్ ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న ప్రాంతం. ఏడాది తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
అటువంటి పరిస్థితిలో, వర్చువల్ ర్యాలీలో తన సొంత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారంటే, అది కేవలం యాదృచ్చికం కాదు.
అది కూడా తనను ఎవరూ ఆ విషయం అడగకపోయినా ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
ప్రస్తుతం ప్రధాని మోదీ వయసు 71 ఏళ్లు. బీజేపీలో 75 ఏళ్లకు పైబడ్డ వారికి పదవులు నిర్వహించే అవకాశం లేదు. ఇది ఆ పార్టీ విధించుకున్న అప్రకటిత నిబంధన.
ఆ కోణంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అర్థం చేసుకుంటే, 2024 నాటికి ప్రధాని మోదీకి 73 ఏళ్లు నిండుతాయి. మూడోసారి గెలిస్తే ఆయనకు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంటుంది.
ఒకవేళ మోదీని కూడా ఈ అప్రకటిత మార్గదర్శకాలలో చేరిస్తే, ఆయన తర్వాత ప్రధానమంత్రి పదవిని అందుకోవడానికి పార్టీలోని రెండో శ్రేణికి చెందిన నాయకులు చాలామంది ఉన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీలో నాయకత్వ మార్పు అనే ప్రశ్నే లేదని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం. ఆయన ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. మంత్రులలో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు. అత్యధిక సమయం కూడా ఇస్తున్నారు. ఆయన పాపులారిటీ కూడా పెరిగింది. బీజేపీని 1920-1947 మధ్య కాంగ్రెస్ స్థాయికి తీసుకెళ్లారు’