THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

చిన్ని : మూవీ రివ్యూ

thesakshiadmin by thesakshiadmin
May 6, 2022
in Latest, Movies, Reviews
0
చిన్ని : మూవీ రివ్యూ
0
SHARES
42
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   మూవీ రివ్యూ : చిన్ని

నటీనటులు: కీర్తి సురేష్-శ్రీ రాఘవ-ఆర్కే విజయ్ మురుగన్-వినోద్ మున్నా-ఆడుగళం మురుగదాస్ తదితరులు
సంగీతం: సామ్ సి.ఎస్

ఛాయాగ్రహణం: యామిని యజ్ఞమూర్తి
మాటలు: కృష్ణకాంత్
నిర్మాణం: స్క్రీన్ సీన్ మీడియా
రచన-దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్

‘మహానటి’ తర్వాత వరుసగా కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేసిన కీర్తి సురేష్ కు అవన్నీ చేదు అనుభవాలే మిగిల్చాయి. అయినా ఆమె ప్రయత్నం ఆపలేదు. ఇప్పుడు కీర్తి ప్రధాన పాత్రలో తమిళంలో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కింది. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే మహిళగా షాకింగ్ రోల్ లో కీర్తి కనిపించిన ఈ చిత్రం ‘చిన్ని’ పేరుతో అనువాదం అయింది. నేరుగా అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చిన్ని (కీర్తి సురేష్) తీర ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో భర్త-కూతురితో నివసించే సాధారణ కానిస్టేబుల్. ఆమె భర్త ఒక మిల్లులో పని చేస్తుంటాడు. అగ్ర కులానికి చెందిన ఆ మిల్లు యజమానులు.. తమకు వ్యతిరేకమైన పార్టీ కోసం పని చేస్తున్నందుకు అతణ్ని అవమానిస్తారు. ఈ క్రమంలో గొడవ పెద్దదై చిన్ని కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసి ఆమెకు తీరని వ్యధ మిగులుస్తారు ఆ మిల్లు యజమానులు. అదే సమయంలో చిన్ని సవతి తల్లి కొడుకైన రంగయ్య (శ్రీ రాఘవ) కూడా అదే వ్యక్తుల వల్ల తనకు జరిగిన అన్యాయానికి రగిలిపోతుంటారు. మరి వీళ్లిద్దరూ కలిసి వారి మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘మహానటి’ సినిమాతో ఒకేసారి చాలా మెట్లు పైకి ఎక్కేసింది కీర్తి సురేష్. ఆ సినిమాకు ముందు వరకు ఆమెను ఒక కథానాయికగా చూశారే తప్ప ‘నటి’గా ఎవరూ గుర్తించలేదు. ‘మహానటి’లో లీడ్ రోల్ కు ఆమెను తీసుకున్నపుడు పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. కానీ వాళ్లందరూ కూడా నోరెళ్లబెట్టి చూసేలా అద్భుతమైన నటనతో ఆ పాత్రను మరో స్థాయిలో నిలబెట్టింది. నిజంగా ఈమె మహానటే అనిపించుకుంది. ఆ పాత్రకు జాతీయ అవార్డు కూడా అందుకున్న కీర్తి.. ఆ ఊపులో పెంగ్విన్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి.. ఇలా వరుసబెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. వాటిలో గర్భిణిగా.. యువ పారిశ్రామిక వేత్తగా.. షూటర్ గా వైవిధ్యమైన-సాహసోపేత పాత్రలే చేసింది. వీటికి తోడు కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల సరసనా నటించింది. కానీ వీటిలో ఏ సినిమా.. ఆమె చేసిన ఏ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించింది లేదు. కీర్తి నుంచి ఎంతో ఊహించుకుని ఈ సినిమాలు చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు తన అభిమానులు. తన సినిమాలూ బాగోక.. తన పాత్రలూ పండక పూర్తిగా ఆశలు వదులుకున్న టైంలో ఇప్పుడు ‘చిన్ని’ ఆశాకిరణంలా వచ్చింది. కథగా చెప్పుకోవడానికి ఇందులో కొత్తదనం లేకపోయినా.. ఎన్నోసార్లు చూసిన రివెంజ్ స్టోరీని కాస్త వైవిధ్యంగా.. చాలా ఇంటెన్స్ గా చూపించడం వల్ల సినిమా బాగానే ఎంగేజ్ చేయగా.. షాక్ కు గురి చేసేలా ఉన్న కీర్తి పాత్ర.. ఆమె అద్భుత నటన ఈ సినిమాకు అతి పెద్ద బలంగా నిలిచాయి. కేవలం కీర్తి నటన కోసం ఈ సినిమా చూడొచ్చు అనడంలో సందేహం లేదు. కానీ సున్నిత మనస్కులు ఆమె పాత్రను.. ఇందులోని హింసను తట్టుకోవడం మాత్రం కష్టమే.

చిన్ని’ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తేనే ప్రేక్షకులకు.. ముఖ్యంగా కీర్తి అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. ‘దండుపాళ్యం’ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఫస్ట్ లుక్ లో కీర్తిని అంత డీగ్లామరస్ గా.. అంత వయొలెంట్ గా చూసి షాకైపోయారు. ఫస్ట్ లుక్ చూస్తే కిరాయి హత్యలు చేసే కిల్లర్ పాత్రలా కనిపించింది కీర్తి పాత్ర. మరి ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అన్న ఆసక్తి కూడా కలిగింది. కానీ ఈ సినిమా టీజర్.. ట్రైలర్లలో మిగతా అంశాలు బాగానే ఆకర్షించినా.. కథ పరంగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఓ మహిళ జీవితంలో దారుణాలు చోటు చేసుకుని తన జీవితం ఛిన్నాభిన్నం అయిపోవడం.. దానికి ఆమె బదులు తీర్చుకోవడం.. ఇదీ ట్రైలర్ చూస్తే ‘చిన్ని’ కథగా అనిపించిన లైన్. సినిమా కూడా ఈ లైన్ కు భిన్నంగా ఏమీ సాగదు. ఇలాంటి ప్రతీకార కథలు వందల సంఖ్యలో చూశాం. ఐతే దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్.. ఈ రొటీన్ కథనే భిన్నమైన టేకింగ్ తో చెప్పే ప్రయత్నం చేశాడు. ‘దండుపాళ్యం’లో మాదిరే ఇందులో హత్యల్ని ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చూపించడమే ఇందులోని ప్రత్యేకత. ప్రేక్షకులుగా మనం ఎంత ఊహించుకున్నా.. ఇంకో లెవెల్లో హత్యల క్రమాన్ని చూపించడం ద్వారా దర్శకుడు బలమైన ముద్రే వేశాడు. కథానాయికకు ఏం అన్యాయం జరిగి ఉంటుందో.. ఆ తర్వాత ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ఆరంభంలోనే అర్థమైపోయినా.. గతంలో ఏం జరిగిందో తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా చేయడంలో దర్శకుడి ‘టేకింగ్’ కీలక పాత్ర పోషించింది.

ప్రతీకార కథల్లో హీరో లేదా హీరోయిన్ కు జరిగిన అన్యాయాన్ని ప్రేక్షకులు కదిలిపోయేలా చూపించడం కీలకమైన విషయం. ఆ సన్నివేశాలు కరెక్టుగా పడితే.. ప్రతీకారానికి కావాల్సిన ఎమోషన్ వచ్చేసినట్లే. ప్రేక్షకుల్లో ఒక కసి పుట్టి ప్రతీకారం కోసం ఎదురు చూస్తే.. ప్రధాన పాత్ర రివెంజ్ తీర్చుకుంటున్నపుడు దాని తాలూకు ఎమోషన్ ను ప్రేక్షకులు కూడా ఫీలవ్వగలిగితే ఆ సినిమా పాసైపోయినట్లే. ఈ విషయంలో ‘చిన్ని’ విజయవంతం అయింది. ఫ్లాష్ బ్యాక్ ను ఒక చిన్న పాపతో ముడిపెట్టడంతో ఆటోమేటిగ్గా ఎమోషనల్ గా కనెక్టయిపోతారు ప్రేక్షకులు. ఇక కథానాయిక కసిగా ఒక్కొక్కరిని చంపే వైనంలో ఎమోషన్ బాగా క్యారీ అయింది. కాకపోతే ముందే అన్నట్లు సున్నిత మనస్కులు ఇందులోని సన్నివేశాలను చూసి తట్టుకోవడం కష్టం. ట్రైలర్ చూస్తేనే ఇది ఏ టైపు సినిమా అన్నది అర్థమైపోయి ఉంటుంది. కానీ సినిమాలో అంతకుమించిన హింసాత్మకమైన.. హృదయ విదారకమైన దృశ్యాలున్నాయి. వాటికి ప్రిపేరైతే ‘చిన్ని’ బాగా ఎంగేజ్ చేస్తుంది. సినిమాను మించి కీర్తి సురేష్ నటన హైలైట్ అయిన నేపథ్యంలో అన్నీ పక్కన పెట్టి ఆమె కోసమైనా సినిమా ఓసారి చూడొచ్చు.

నటీనటులు:

ముందుగా ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకు కీర్తిని ఎంత పొగిడినా తక్కువే. మరే స్టార్ హీరోయిన్ కూడా కనీసం ఆలోచించడానికి కూడా భయపడే పాత్ర తనది. ఇలాంటి పాత్రను చేయడం అంటే మామూలు సాహసం కాదు. నటనకు ఎంత అవకాశమున్నా సరే.. ఇదీ పాత్ర అని చెప్పగానే వెంటనే ‘నో’ చెప్పేసే తరహా పాత్ర ఇది. అభిమానులు సైతం తమ హీరోయిన్ని ఇలాంటి పాత్రలో చూడాలనుకోరు. కానీ కీర్తి గొప్ప ధైర్యం చేసి ఈ పాత్రను ఓకే చేసింది. మరే కథానాయికనీ ఊహించకోలేని స్థాయిలో అద్భుత నటనతో కట్టిపడేసింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకునే సన్నివేశంలో తన నటన కదిలిస్తుంది.. అలాగే ప్రేక్షకుల్లో ఉద్రేకం తీసుకొస్తుంది. ఇంకా కీర్తి నట కౌశలం గురించి చెప్పుకోవడానికి చాలా సన్నివేశాలే ఉన్నాయిందులో. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. దర్శకుడు శ్రీ రాఘవ.. కీర్తికి దీటైన పాత్రలో ఆకట్టుకున్నాడు. తన వల్ల ఈ పాత్రకు ఒక కొత్తదనం వచ్చింది. తన లుక్ చాలా సహజంగా అనిపిస్తుంది. నటనా ఆకట్టుకుంటుంది. శంభుగా విలన్ పాత్రలో నటించిన విజయ్ రాఘవన్ చాలా బాగా చేశాడు. ఆడుగళం మురుగదాస్.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘చిన్ని’ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. సామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం సినిమా శైలికి తగ్గట్లుగా చాలా ఇంటెన్స్ గా సాగింది. యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణంలోనూ ఒక స్థాయి కనిపిస్తుంది. విజువల్స్ కట్టి పడేస్తాయి. సందర్భోచితంగా వాడిన కలర్ థీమ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఎంచుకున్న కథ మామూలుదే అయినా.. తన టేకింగ్ తో అతను ఆద్యంతం ఆకట్టుకున్నాడు. నరేషన్లో అతను వైవిధ్యం చూపించాడు. నటీనటుల నుంచి హావభావాలు రాబట్టుకోవడంలోనూ అతను ప్రతిభ చాటుకున్నాడు. కథలో వైవిధ్యం చూపించి ఉంటే.. సినిమా మరో స్థాయిలో ఉండేది.

చివరగా: చిన్ని.. మహానటి ఈజ్ బ్యాక్

రేటింగ్-3/5

Tags: #chinni#chinnimoviereview#FilmNews#keerthisuresh#TOLLYWOOD
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info